నిజమే నటిస్తున్నా.. | Shruti Haasan Romance With Vijay Sethupathi | Sakshi
Sakshi News home page

నిజమే నటిస్తున్నా..

Apr 2 2019 1:47 PM | Updated on Apr 2 2019 1:47 PM

Shruti Haasan Romance With Vijay Sethupathi - Sakshi

సినిమా: నిజమే కొత్త చిత్రంలో నటిస్తున్నానని స్పష్టం చేసింది నటి శ్రుతీహాసన్‌. నటుడు కమలహాసన్‌ పెద్ద కూతురు అయిన ఈ సంచలన నటి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నా తను మాత్రం తన తండ్రి రాజకీయాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. అయితే తన వారసులు రాజకీయాల్లోకి రారని కమలహాసన్‌ చాలా సార్లు బహిరంగంగానే వెల్లడించారన్నది గమనార్హం. కాగా శ్రుతీహాసన్‌ నటించిన చిత్రం తెరపైకి వచ్చి రెండేళ్లకు పైనే అవుతోంది. కోలీవుడ్‌లో సింగం–3 తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు. నిజానికి ఈ బ్యూటీకి తమిళం, తెలుగు, హింది మూడు భాషల్లోనూ క్రేజ్‌ ఉంది. అయినా నటించకపోవడానికి అవకాశాలు రాకా, లేక వస్తున్నా నిరాకరిస్తోందా? అన్నది ప్రశ్నార్ధకమే.

తన తండ్రితో కలిసి తొలిసారిగా నటించడానికి సిద్ధం అయిన త్రిభాషా చిత్రం శభాష్‌నాయుడు మధ్యలోనే ఆగిపోయింది. సంగీత ఆల్బమ్స్, బుల్లితెర షోలతో కాలం గడిపేస్తున్న శ్రుతీహాసన్‌ సుధీర్ఘ విరామం తరువాత దక్షిణాదిలో నటించడానికి సిద్ధం అయ్యిందన్నది తాజా సమాచారం. ఈ ముద్దుగుమ్మ కోలీవుడ్‌లో ఎస్‌పీ.జననాథన్‌ దర్శకత్వంలో విజయ్‌సేతుపతికి జంటగా నటించడానికి పచ్చజెండా ఊపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటి శ్రుతీహాసన్‌ తమిళంలో ఒక చిత్రం చేయబోతున్న విషయం నిజమేనని తెలిపింది. అంతే కాదు మే నెలలో ఒక తెలుగు చిత్రంలోనూ నటించనున్నానని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఈ అమ్మడు హిందిలో ఒక చిత్రంలో నటిస్తోంది. దీంతో మళ్లీ ఈ సంచలన నటిని తెరపై వరుసగా చూడబోతున్నామన్న మాట.

Advertisement
 
Advertisement
Advertisement