అలా చూస్తే ఏ సినిమా విడుదల కాదు

sensor board is outdated says ramgopal verma - Sakshi

– రామ్‌గోపాల్‌ వర్మ

‘‘సెన్సార్‌ బోర్డ్‌ రూల్‌ ప్రకారం చూస్తే ఏ సినిమా కూడా విడుదల కాదు. సెన్సార్‌ వాళ్లు అన్ని రూల్స్‌ను నా సినిమా మీదే ప్రయోగిస్తున్నారు. ఎందుకో అర్థం కావడం లేదు. ఓటు వేసి మనకు కావాల్సిన నాయకులను ఎన్నుకునే జ్ఞానం ఉన్న మనకు ఏ సినిమా చూడాలో? చూడకూడదో తెలియదా? ఆ విషయాన్ని ఇద్దరు, ముగ్గురు సెన్సార్‌ వాళ్లు చూసి చెప్పాలా? నా దృష్టిలో సెన్సార్‌ అనేది అవుట్‌ డేటెడ్‌’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.

టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌గోపాల్‌ వర్మ అందిస్తున్న చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహించారు. టి. అంజయ్య సమర్పణలో అజయ్‌ మైసూర్, టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్‌ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సి ఉన్నా, సెన్సార్‌ కారణాల వల్ల కాలేదు. ఈ సినిమా పేరును ‘అమ్మరాజ్యంలో కడపబిడ్డలు’గా మార్చారు. రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ – ‘‘ఏ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోవద్దనే సందేశంతో ఈ సినిమా రూపొందించాం. ఇందులో ఏ కులాన్ని, ఏ వర్గాన్ని తక్కువగా చేసి చూపలేదు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిగారి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా కథ రెడీ చేశాను.

ఎవరినైనా ప్రేమించడానికి లేదా ద్వేషించడానికి నా దగ్గర సమయం లేదు. నన్ను ఎంత గట్టిగా ఆపితే అంత గట్టిగా పైకి లేస్తాను.. అందుకే ఈ సినిమాకు సీక్వెల్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నాను’’ అన్నారు. చిత్ర సహనిర్మాత నట్టి కుమార్‌ మాట్లాడుతూ –‘‘మా సినిమాను నవంబర్‌ 29న విడుదల చేయాలంటే అర్జెన్సీ సర్టిఫికెట్‌ కావాలన్నారు. దాన్ని పొందుపరిచి నవంబర్‌ 14న సెన్సార్‌కి పంపించాం. ఎలాంటి కారణం చూపకుండా సెన్సార్‌ వారు ఇంతవరకూ సినిమా చూడలేదు. అందుకే కోర్టును ఆశ్రయించడంతో వారంలోపు సినిమా చూసి, ఎగ్జామినేషన్‌ చేయాలని ఆదేశాలిచ్చారు’’ అన్నారు. ‘‘నిర్మాతగా నా తొలి చిత్రమిది. ఎవర్నీ కించపరిచేలా ఉండదు’’అన్నారు అజయ్‌ మైసూర్‌. ఈ చిత్రానికి సహ నిర్మాత: నట్టి కరుణ.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top