సీనియర్‌ నిర్మాత కొసరాజు భానుప్రసాద్‌ కన్నుమూత

Senior producer Kosaraju Bhanu Prasad pass away - Sakshi

సీనియర్‌ నిర్మాత కొసరాజు భానుప్రసాద్‌ (84) బుధవారం చెన్నైలో మృతి చెందారు. ప్రముఖ పాటల రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి కుమారుడిగా భానుప్రసాద్‌ అందరికీ సుపరిచితమే. ‘రోజులు మారాయి’ కోసం రాఘవయ్య చౌదరి రాసిన ‘ఏరు వాకా సాగారో...’, ‘రాముడు–భీముడు’ కోసం రాసిన ‘సరదా సరదా సిగరెట్టు’ వంటి పాటలు ఎవర్‌ గ్రీన్‌. ఎకనామిక్స్‌లో ఎం.ఏ చేసిన అనంతరం బి.ఎల్‌ చదివినప్పటికీ తండ్రి ప్రభావంతో 26 ఏళ్లకే భాను ప్రసాద్‌ సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అయితే తండ్రిలా రచయితగా కాకుండా నిర్మాతగా ప్రవేశించారు.

‘కాంభోజరాజు కథ, రాధాకృష్ణ’ చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు భాను ప్రసాద్‌. 1981లో కవిరత్నా మూవీస్‌ బ్యానర్‌ని స్థాపించి ఎన్టీఆర్‌ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘విశ్వరూపం’ సినిమాని నిర్మించారు భానుప్రసాద్‌. అనంతరం ‘ఓ ఆడది ఓ మగాడు’(1982), ‘భోళాశంకరుడు’(1984) సినిమాలు రూపొందించారాయన. దాదాపు 12ఏళ్ల తర్వాత 1997లో ఎన్‌.ఆర్‌. అనురాధా దేవితో కలిసి ‘ప్రియా ఓ ప్రియా’ చిత్రాన్ని నిర్మించారు. ఆ తర్వాత భానుప్రసాద్‌ సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్నారు. భానుప్రసాద్‌ అంత్యక్రియలు ఈ రోజు ఉదయం 10 గంటలకు చెన్నైలో జరగనున్నాయి. ఆయన మృతికి తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి సంతాపం తెలిపింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top