ఆస్కార్‌ బరిలో ‘విలేజ్‌ రాక్‌ స్టార్స్‌’

Rima Das on Village Rockstars getting selected as India's Oscars 2019 entry - Sakshi

ఆనందంలో అస్సామీ చిత్రసీమ

సినిమా పండగల్లో అతి పెద్ద పండగ ఆస్కార్‌ అవార్డుల పండగ. ప్రపంచంలో అన్ని ప్రాంతాల సినిమాలను కొలమానంగా భావించే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు. ఈ సంబరాలు జరిగేది ఫిబ్రవరి లేదా మార్చి నెలలో అయినా హడావిడి సెప్టెంబర్‌ అక్టోబర్‌ నెలల నుంచే స్టార్ట్‌ అవుతుంది. ఎందుకంటే.. ఆస్కార్‌ నామినేషన్‌ ఎంట్రీ పోటీకి బరిలో నిలిచే సినిమాలను ఆయా దేశాలు అనౌన్స్‌ చేస్తుంటాయి. ఈసారీ స్టార్ట్‌ అయింది. 2018కిగాను ఇండియన్‌ సినిమా తరఫున ఆస్కార్‌ అఫీషియల్‌ ఎంట్రీగా ఎంపికైన చిత్రం ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ అని  ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అనౌన్స్‌ చేసింది. ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ ఒక అస్సామీ సినిమా. కొత్త దర్శకురాలు. పొదుపైన బడ్జెట్‌.

సినిమా తీసింది చిన్న కెమెరాతోనే. మొత్తం దర్శకురాలు రీమా దాస్‌ స్వగ్రామమే. దాదాపు 28 సినిమాలు ఉన్న లిస్ట్‌లో, వచ్చే ఏడాది జరిగే ఆస్కార్స్‌కి ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం తరఫున అఫీషియల్‌గా పంపబోతున్న సినిమా ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’. ఈ సినిమా విషయానికి వస్తే.. రీమా దాస్‌ స్వీయ దర్శకత్వం వహించి, ఎడిటింగ్‌ చేసిన అస్సామీ చిత్రం. రీమా దాస్‌ ప్రొఫెషనల్‌ ఫిల్మ్‌ మేకర్‌ కూడా కాదు. సెల్ఫ్‌ మేడ్‌ ఫిల్మ్‌ మేకర్‌. ఈ ఏడాది వచ్చిన నేషనల్‌ అవార్డ్‌లోనూ ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ సత్తా చాటింది.  బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్, చైల్డ్‌ ఆర్టిస్ట్, ఎడిటింగ్‌ వంటి పలు విభాగాల్లో అవార్డ్స్‌ గెలుచుకుంది. అంతేనా పలు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో కూడా మంచి ప్రశంసలు పొందింది.

కథ :
‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌’ సినిమా కథ చాలా సింపుల్‌ లైన్స్‌లో ఉంటుంది. దును అనే చిన్నారి చయాగాన్‌ గ్రామంలో తన తల్లి, తమ్ముడుతో కలిసి ఉంటుంది. సంతలో అమ్మకు స్నాక్స్‌ అమ్మే పనిలో సాయంగా ఉంటుంది. ఒకసారి గ్రామంలో జరిగిన బ్యాండ్‌ పర్ఫార్మెన్స్‌ చూసి మంత్రముగ్ధురాలైన దును ఎలా అయినా గిటార్‌ కొనుక్కోవాలనుకుంటుంది. అట్లీస్ట్‌ సెకండ్‌ హ్యాండ్‌దైనా ఫర్వాలేదనుకుంటుంది. కామిక్‌ బుక్స్‌ చదివి తను కూడా ఓ బ్యాండ్‌ ఏర్పాటు చేయాలనుకుంటుంది. రూపాయి రూపాయి పోగేసుకుంటుంది. ఇంతలో వరదలు వారి పంటను పూర్తిగా నాశనం చేస్తాయి. అప్పుడు దునుకి తనకు ముఖ్యమైనదేంటో ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఆ సందర్భంలో దును తెలివిగా ఏం చేసిందనేదే సినిమా కథ. దునుగా ప్లే చేసిన బన్నితా దాస్‌ ‘బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌’గా అవార్డు పొందింది. ఈ విలేజ్‌ రాక్‌స్టార్స్‌ మొత్తం దేశాన్నే తమ గ్రామం వైపు తిరిగేలా చేసింది. ఈ కథ ప్రేక్షకుల మనసులను హత్తుకుంది. విశేషం ఏంటంటే.. అస్సామీ పరిశ్రమలో దాదాపు 29 ఏళ్ల తర్వాత జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రం ఇది. ఆ రకంగా అస్సామీ పరిశ్రమకు ఈ సినిమా ఓ తీయని అనుభూతిని పంచితే, ఇప్పుడు ఏకంగా ఆస్కార్‌ నామినేషన్‌ ఎంట్రీకి ఎంపిక కావడం మరో మంచి అనుభూతిని మిగ్చిలింది. ‘‘ఓ వైపేమో ఆనంద భాష్పాలు మరోపక్క మనసు గర్వంతో నిండిపోయి ఉంది. చాలా వినయంగా ఈ ఎంట్రీని యాక్సెప్ట్‌ చేస్తున్నాను.

ఈ విషయం జీర్ణించుకోవడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది’’ అని ట్వీటర్‌లో పేర్కొన్నారు దర్శకురాలు రీమా దాస్‌. మరి మన దేశం తరఫున ఆస్కార్‌కు వెళ్తున్న ఈ చిత్రం ఆస్కార్‌ బృందాన్ని మెప్పించి, నామినేషన్‌ దక్కించుకుని, చివరికి అవార్డునూ సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.  ఏది ఏమైనా అంత దాకా వెళ్లడమే గొప్ప విషయం. టైటిల్‌ విలేజ్‌ రాక్‌స్టార్స్‌ అయినా  మొత్తం గ్లోబల్‌ విలేజ్‌ సెలబ్రేట్‌ చేసుకునే ఈ పండగలో తన సత్తా చాటితే మాత్రం చరిత్రే అవుతుంది. ఫారిన్‌ క్యాటగిరీలో హిందీ చిత్రం ‘మదర్‌ ఇండియా’ నుంచి ఆస్కార్‌ వైపు ఆశగా చూస్తున్న మనకు ఈసారి ఎలా ఉంటుందో చూడాలి. గతేడాది ఆస్కార్‌కు అఫీషియల్‌ ఎంట్రీగా వెళ్లిన హిందీ చిత్రం ‘న్యూటన్‌’ నామినేషన్‌   దక్కించుకోలేకపోయింది.

పోటీలో నిలిచిన 28 సినిమాలు
ఆస్కార్‌ నామినేషన్స్‌కు భారతదేశం నుంచి   ఫిల్మ్‌ ఫెడరేషన్‌ పరిగణనలోకి తీసుకున్నవి  సుమారు 28 సినిమాలు ఉన్నట్టు సమాచారం.  అందులో మన ‘మహానటి’, సంజయ్‌లీలా భన్సాలీ ‘పద్మావత్‌’, నందితా దాస్‌ ‘మంటో’, సూజిత్‌ సర్కార్‌ ‘అక్టోబర్‌’, లవ్‌సోనియే’ ప్యాడ్‌మ్యాన్, తుమ్‌బాద్‌ హల్కా, పీకు వంటి సినిమాలు ఫారిన్‌ క్యాటగిరీలో జరిగిన రేసులో పోటీపడ్డాయి.

అవార్డు ఆస్కారం ఎప్పుడు?
మన దేశం నుంచి ఆస్కార్‌ అవార్డ్స్‌లో ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగానికి సినిమాలను పంపడం మొదలైంది 1957లో. అప్పటి నుంచి కేవలం మూడు సినిమాలు (మదర్‌ ఇండియా, సలామ్‌ బాంబే, లగాన్‌) మాత్రమే నామినేషన్‌ దక్కించుకున్నాయి. 1986లో నామినేషన్స్‌కు కె.విశ్వనాథ్‌ ‘స్వాతిముత్యం’ ఆస్కార్‌ నామినేషన్‌ ఎంట్రీ రేస్‌ వరకూ వెళ్లింది కానీ నామినేషన్‌ దక్కించుకోలేదు. అంతదాకా వెళ్లి, నామినేషన్‌ దక్కించుకున్నా అవార్డు వరకూ రాలేకపోతున్నాం. ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’కి ఏఆర్‌ రెహమాన్, రసూల్‌ పూకుట్టి.. ఇలా మనవాళ్లు ఆస్కార్‌ తెచ్చినా, అది మన దేశం సినిమా కాదు. బ్రిటిష్‌ ఫిల్మ్‌ కింద వస్తుంది.


  రీమా దాస్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top