ఆ చిత్రాలను మించి హిట్‌ అవుతుంది | Ravi Teja's 'Raja The Great' launched | Sakshi
Sakshi News home page

ఆ చిత్రాలను మించి హిట్‌ అవుతుంది

Feb 6 2017 11:22 PM | Updated on Sep 5 2017 3:03 AM

ఆ చిత్రాలను మించి హిట్‌ అవుతుంది

ఆ చిత్రాలను మించి హిట్‌ అవుతుంది

మాస్‌ మహారాజా రవితేజ కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు.

–‘దిల్‌’ రాజు
మాస్‌ మహారాజా రవితేజ కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టేశారు. ‘బెంగాల్‌ టైగర్‌’ వంటి హిట్‌ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్‌ తీసుకున్న ఆయన ఇప్పుడు రెట్టించిన కొత్త ఉత్సాహంతో నూతన చిత్రాలను ఎక్స్‌ప్రెస్‌ లెవల్‌లో పట్టాలెక్కిస్తున్నారు. రవితేజ హీరోగా విక్రమ్‌ సిరికొండను దర్శకునిగా పరిచయం చేస్తూ నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ‘టచ్‌ చేసి చూడు’ గత శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. రవితేజ, మెహరీన్‌ కౌర్‌ జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్న ‘రాజా ది గ్రేట్‌’ మూవీ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది.

హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ఫైనాన్షియర్‌ ఎం.వి.ఆర్‌.ఎస్‌. ప్రసాద్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, హీరో నందమూరి కల్యాణ్‌ రామ్‌ క్లాప్‌ ఇచ్చారు. కాగా, ఈ చిత్రంలో రవితేజ అంధుడిగా కనిపించనున్నారు. చిత్ర సమర్పకుడు, నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ – ‘‘భద్ర’ చిత్రం తర్వాత రవితేజతో, ‘సుప్రీమ్‌’ మూవీ తర్వాత అనిల్‌ రావిపూడితో మా బ్యానర్లో చేస్తున్న చిత్రమిది. అవుట్‌ అండ్‌ అవుట్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ‘భద్ర’, ‘సుప్రీమ్‌’ చిత్రాల కంటే ‘రాజా ది గ్రేట్‌’ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతుంది. మార్చిలో రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం’’ అన్నారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కనున్న చిత్రమిది. ఇప్పటి వరకూ కనిపించని విలక్షణ పాత్రలో రవితేజ కనిపిస్తారు. ఆయన అభిమానులు, ప్రేక్షకులకు నచ్చేలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. ‘దిల్‌’ రాజుగారి బ్యానర్‌లో రెండో చిత్రం చేయడం హ్యాపీ. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో చెబుతాం’’ అని తెలిపారు. నిర్మాత శిరీష్, దర్శకుడు సతీష్‌ వేగేశ్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement