హీరోలు ముందుకొస్తేనే కొత్త కథలొస్తాయి– ‘దిల్‌’ రాజు

Raja The Great Pre Release Function

‘‘రవితో (రవితేజ) నాకు 20ఏళ్ల పరిచయం. ‘ఆర్య’ కథని ఫస్ట్‌ తనకే చెప్పాం. కథ బాగుంది. కానీ, నాకు కరెక్ట్‌ కాదన్నాడు. నితిన్, ప్రభాస్‌ తర్వాత బన్ని (అల్లు అర్జున్‌) వద్దకు వెళ్లింది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే కొన్ని కథలు వాటికవే ప్రయాణం చేస్తూ వాళ్లతోనే చేయిస్తాయి’’ అని నిర్మాత ‘దిల్‌’ రాజు అన్నారు. రవితేజ, మెహరీన్‌ జంటగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మించిన ‘రాజా ది గ్రేట్‌’ ఈ నెల 18న రిలీజవుతోంది. ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘అనిల్‌ నాకు ‘రాజా ది గ్రేట్‌’ ఐడియా చెప్పినప్పుడు ఎగై్జటయ్యా.

సినిమా మొత్తం హీరో అంధుడు అన్నప్పుడు తెలుగులో ఇలాంటి సినిమా వర్కట్‌ అవుద్దా? అని చాలామంది డౌట్లు అడిగారు. ఈ కథ చాలామంది హీరోల వద్దకు వెళ్లింది. రవికి రాసిపెట్టి ఉండటంతోనే ఆయన వద్దకు వెళ్లింది. సినిమా చూశాక రవికి ఫోన్‌ చేసి ‘ఇరగ్గొట్టేశావ్‌’ అన్నా. ‘నీ మాటలో ఏంటి? ఇంత కాన్ఫిడెన్స్‌’ అన్నారు. ‘శతమానం భవతి, నేను లోకల్, డీజే, ఫిదా’ వరుస సక్సెస్‌లు. బాల్‌ పడుతుంటే బ్యాట్స్‌మెన్‌కి టెన్షన్‌ ఉన్నట్టే నాకూ ఈ సినిమాతో మొన్నటి వరకూ టెన్షన్‌ ఉండేది. సినిమా చూశాక ‘థ్యాంక్యూ అనిల్‌... ఫిఫ్త్‌ బాల్‌ కూడా సిక్సర్‌ కొట్టేశాం’ అన్నా.

రవితేజ కెరీర్‌లో ‘ఇడియట్‌’ వన్నాఫ్‌ ద బెస్ట్‌ ఫిల్మ్‌. ఆ తర్వాత ‘భద్ర’, ‘విక్రమార్కుడు’... ఇప్పుడు మళ్లీ ‘రాజా ది గ్రేట్‌’. మమ్మల్ని నమ్మి అంధుడి పాత్ర చేసినందుకు రవికి హ్యాట్సాఫ్‌. కమర్షియల్‌ సినిమా కొత్తగా రావాలంటే అది హీరోతోనే సాధ్యం. హీరో ముందుకొస్తే కొత్త కథలు, పాత్రలొస్తాయి’’ అన్నారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నానంటే నా డైరెక్టర్లే కారణం. మనకి నిర్మాతలు చాలామంది ఉంటారు. మేకర్స్‌ చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో రాజు ఒకరు. తనకున్న జడ్జిమెంట్‌ కానీ, టేస్ట్‌ కానీ, ఆ సక్సెస్‌ రేట్‌ చూస్తే తెలుస్తుంది. ప్రతి సినిమాకి రేయింబవళ్లు కష్టపడతాడు తను. శిరీష్‌ నాలానే. అనిల్‌ మంచి ఎనర్జిటిక్, పాజిటివ్‌ పర్సన్‌. ఈ సినిమాతో హ్యాట్రిక్‌ కొడతాడు’’ అన్నారు.

అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘సుప్రీమ్‌’ తర్వాత రాజుగారితో బ్లైండ్‌ కాన్సెప్ట్‌ చెప్పగానే చేద్దామన్నారు. రవితేజగారు ఎంటరయ్యాక ఆయన ఎనర్జీ లెవల్స్‌కి తగ్గట్టు కథ రాశా. కథ మొత్తం అమ్మాయి చుట్టూ తిరిగినా... మార్నింగ్‌ షో చూశాక అందరూ ‘రవితేజ ది గ్రేట్‌’ అంటారు. ఆయన నటన చూశాక నాకు మాటలు రాలేదు. నిర్మాతలు నాకు ఫ్రీడమ్‌ ఇవ్వబట్టే ఇంతమంచి సినిమా వచ్చింది’’ అన్నారు. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘వెరైటీ పాత్రలు చేయాలనుకునే వారే నటులు. నాకు తెలిసి ఒక కమర్షియల్‌ హీరో... మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో ఇంత అద్భుతమైన పాత్ర చేయడం తొలిసారి. ఈ సినిమా తర్వాత ‘రవితేజ గొప్ప నటుడు’ అంటారు. ‘సర్వేంద్రియానాం సర్వమ్‌ ప్రదానం’ అని ఈ సినిమా ప్రూవ్‌ చేస్తుంది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top