అమ్మ కోసం ఓ పాట

Raghava Lawrence Composed A Song On Mother - Sakshi

పెరంబూరు: నృత్యదర్శకుడు, నటుడు, దర్శక నిర్మాత రాఘవలారెన్స్‌ అమ్మ కోసం ఒక పాటను రూపొందించారు. శ్రీరాఘవేంద్రస్వామి భక్తుడైన ఈయన తన తల్లిని కూడా దైవంగా భావిస్తారు. అందుకే ఆమెకు గుడి కూడా కట్టించారు. ఇక ఎందరో అనాథలను ఆదుకుంటూ, వారికి విద్య, వైద్యసేవలను అందిస్తూ ఆదుకుంటున్న రాఘవ లారెన్స్‌ తాజాగా లోకంలోని తల్లుల కోసం ఒక పాటను రూపొందించారు. దాన్ని ప్రపంచ మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తన తల్లితో కలిసి పాల్గొన్న రాఘవ లారెన్స్‌ మరికొందరు వృద్ధాశ్రమ తల్లులను ఆహ్వానించి వారిని సత్కరించి కానుకలను అందించారు.

రాఘవలారెన్స్‌ మాట్లాడుతూ ప్రప్రంచంలో అమ్మకు మించిన దైవం లేదని, అందుకే అమ్మలను ప్రతి ఒక్కరూ ప్రేమించాలని అన్నారు. దయచేసి తల్లిదండ్రులను అనాథాశ్రమాలకు పంపకండని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తల్లిదండ్రులను అనాథాశ్రమానికి పంపిన వారు ఈ తాయ్‌(తల్లి) పేరుతో తాను రూపొందించిన ఈ పాట విని వారిని తమ ఇళ్లకు తిరిగి తీసుకొస్తారని భావిస్తున్నానన్నారు. తాను తాయ్‌ పేరుతో ఒక ట్రస్టును ప్రారంభించినట్లు, తద్వారా తాను, తన తల్లి వీలు కుదిరినప్పుడల్లా అనాథాశ్రమాలకు వెళ్లి తల్లుల గురించి అవగాహనా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే విధంగా వృద్ధాశ్రమంలోని వారి జీవనానికి తోడ్పడేలా పలు సేవాకార్యక్రమాలను నిర్వహించతలపెట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తాయ్‌ పేరుతో రూపొందించిన పాటను తన తదుపరి చిత్రంలో పొందుపరచనున్నట్లు చెప్పారు. 
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top