
‘ఇస్మార్ట్ శంకర్’తో తిరిగి ఫామ్ అందుకున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమా హీరోకు క్రేజీ హీరోను ఎంచుకున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ అండ్ క్రేజీ హీరో విజయ దేవరకొండతో కలిసి పూరి ఓ సినిమాను పట్టాలెక్కించునున్నాడు. ఈ విషయాన్ని నటి, నిర్మాత చార్మీ కౌర్ అధికారికంగా ప్రకటించారు. డియర్ కామ్రేడ్ బాక్సాఫీస్ దగ్గర నిరుత్సాహపరిచినప్పటికీ.. నటన, లుక్స్ పరంగా విజయ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఇప్పటికే బ్లాక్ బస్టర్ సాధించి ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఇలాంటి తరుణంలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందబోయే చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, చార్మిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి బరిలో దించాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డియర్ కామ్రేడ్‌తో నిరుత్సాహపరిచిన విజయ్, పూరి సినిమాతో ఆ లోటును భర్తీ చేయాలని ఆశిస్తున్నాడు. ఇక ఇస్మార్ట్ ఊపులోనే మరో హిట్ కొట్టాలని పూరి అండ్ టీమ్ తెగ ఆరాటపడుతోంది.