దళపతితో రొమాన్స్‌ చేయనున్న పూజాహెగ్డే !

Puja Hegde Acting As Heroine In Vijay Next Film - Sakshi

చెన్నై : కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌కు సెట్టయ్యిందనే ప్రచారం జరుగుతోంది. నటుడు విజయ్‌తో రొమాన్స్‌ చేయడానికి బాలీవుడ్‌ బ్యూటీ పూజాహెగ్డే సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. విజయ్‌ ప్రస్తుతం మాస్టర్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ కుట్టి మాళవికమోహన్‌ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యువ దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ను నాన్‌స్టాప్‌గా జరుపుకుంటున్న మాస్టర్‌ చిత్రం చివరి దశకు చేరుకుంది. అంతేకాదు చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా ఏప్రిల్‌ 9వ తేదీన విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో నటుడు విజయ్‌సేతుపతి ప్రతినాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా నటి ఆండ్రియా కీలక పాత్రలో నటిస్తోంది. అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని నటుడు విజయ్‌ పాడిన కుట్టి స్టోరి పాట ఇప్పుడు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తోంది. (బ్యాచిలర్‌ తొలి పాట రెడీ)

ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే నటుడు విజయ్‌ కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపేశారన్నది తాజా సమాచారం. ఇది ఆయనకు 65వ చిత్రం అవుతుంది. దీన్ని సన్‌ ఫిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్నట్లు తెలిసింది. ఇంతకుముందు ఈ సంస్థ విజయ్‌ హీరోగా మెర్శల్‌ చిత్రాన్ని నిర్మించిందన్నది గమనార్హం. అదేవిధంగా ప్రస్తుతం రజనీకాంత్‌ హీరోగా అన్నాత్తా చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయ్‌ కథానాయకుడిగా నటించే చిత్రానికి క్రేజీ మహిళా దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈమె ఇంతకుముందు ఇరుదు చుట్రు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రస్తుతం సూర్య హీరోగా సూరరై పోట్రు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఇదీ సమ్మర్‌లోనే తెరపై రానుంది.
(‘సామజవరగమన’  వీడియో సాంగ్‌ వచ్చేసింది!)

విజయ్‌తో చేసే చిత్రంలో టాలీవుడ్‌లో క్రేజ్‌లో ఉన్న బాలీవుడ్‌ బ్యూటీ పూజాహెగ్డే కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ అమ్మడు దక్షిణాదిలో మొదట ఎంట్రీ ఇచ్చింది కోలీవుడ్‌లోనే అన్నది గమనార్హం. జీవాకు జంటగా దర్శకుడు మిష్కిన్‌ ముఖముడి చిత్రం ద్వారా పరిచయం చేశారు. ఆ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. కారణం ఏదైనా పూజామెగ్డేను ఆ తరువాత కోలీవుడ్‌ పట్టించుకోలేదు. అలాంటిది చాలా ఏళ్ల తరువాత ఇప్పుడు దళపతితో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతోందనే ప్రచారం వైరల్‌ అవుతోంది. దీనికి సంబంధించిన అధికారపూర్వక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. మరోవిషయం ఏమిటంటే నటి ఇలియానా కూడా కోలీవుడ్‌లో కేడీ అనే చిత్రంతో పరిచయం అయ్యి ఆ తరువాత ఇక్కడ కనిపించలేదు. టాలీవుడ్‌లో వరుస విజయాలతో క్రేజ్‌ తెచ్చుకున్న తరువాత నన్బన్‌ చిత్రంతో విజయ్‌కు జంటగా రీఎంట్రీ ఇచ్చింది. నటి పూజాహెగ్డే కూడా టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోతున్న తరుణంలో ఇప్పుడు దళపతి కొత్త చిత్రంతో రీఎంట్రీ కానుందన్నమాట. ఇదేకనుక నిజం అయితే ఈ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి తెలుగులోనూ మంచి డిమాండ్‌ ఉంటుందన్న విషయంలో సందేహం ఉండదు.   

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top