
సినిమా పరిశ్రమలో బ్యాగ్రౌండ్ లేకుండా ఒంటరిగా కెరీర్ మొదలుపెట్టారు ప్రియాంకా చోప్రా. ‘‘ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యేదాన్నని, దానికి కారణం ఇతరుల మీద ఆధారపడటమే’’ అని అన్నారామె. ఈ విషయం గురించి ప్రియాంకా చోప్రా మాట్లాడుతూ – ‘‘ఒక సినిమాలో భాగమవ్వాలంటే హీరోయిన్లు చాలామందిపై ఆధారపడాల్సి వస్తుంది. అది నిజంగా దురదృష్టం. అలా ఆధారపడటం వల్ల మనలో ఆత్మవిశ్వాసం తగ్గి ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఒకప్పుడు ఈ ఒత్తిడి నాపై కూడా ఉండేది. ఇప్పుడు ఆ ఒత్తిడికి భయపడే స్థాయిలో నేను లేను. సినిమాల విషయంలో ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడే నా ఒత్తిడి మాయమైపోయింది. సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యమే నన్ను నిర్మాతగా మార్చాయనుకుంటున్నాను. ఇప్పుడు నిర్మాతగా, హీరోయిన్‌గా కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాను. నా అనుభవంతో చెబుతున్నాను.. ఇతరులపై ఆధారపడితే ఒత్తిడి తప్పదు. అందుకే మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి’’ అన్నారు.