జయలలితగా..?
ప్రియాంకా చోప్రా ఓ పక్క, ఆనందంతోనూ, మరో పక్క టెన్షన్‌తోనూ ఉన్నారు. ఆనందానికి కారణం ఏంటంటే - ఇద్దరు ప్రసిద్ధ మహిళల నిజజీవిత పాత్రలు చేసే అవకాశం రావడం.
ప్రియాంకా చోప్రా ఓ పక్క, ఆనందంతోనూ, మరో పక్క టెన్షన్‌తోనూ ఉన్నారు. ఆనందానికి కారణం ఏంటంటే - ఇద్దరు ప్రసిద్ధ మహిళల నిజజీవిత పాత్రలు చేసే అవకాశం రావడం. టెన్షన్‌కి కూడా అదే కారణం. ఎందుకంటే, ఆ పాత్ర పోషణలో ఎక్కడైనా తడబడితే తప్పుపట్టడానికి వెయ్యి నోళ్లు వెనకాడవు. బాక్సింగ్ చాంపియన్ మేరీ కోమ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘మేరీ కోమ్’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్నారు ప్రియాంక. దీనికోసం మేరీ కోమ్ జీవితాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడంతో పాటు అసలు సిసలైన క్రీడాకారిణిగా కనిపించడానికి కొన్ని కసరత్తులు చేశారు.
ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే మరో నిజజీవిత పాత్ర చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాలో రాజకీయ నాయకురాలిగా మారిన నటి పాత్రను చేయనున్నారు. సహజత్వానికి దగ్గరగా ఉండే చిత్రాలను రూపొందించే మధుర్ బండార్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ‘మేడమ్‌జీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. మాజీ నటి, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ పాత్రకు విద్యాబాలన్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా బాగుంటారని మధుర్ అనుకున్నా, చివరకు ప్రియాంకనే ఖరారు చేశారని బాలీవుడ్ టాక్. మామూలుగా ఏ కథానాయికతో అయినా ఒకే ఒక్క సినిమా చేసే అలవాటున్న మధుర్, ‘ఫ్యాషన్’ తర్వాత మళ్లీ ప్రియాంకను ఎంపిక చేయడం విశేషం. ఇక, జయలలితగా ఒదిగిపోవడానికి ప్రియాంక ఎలాంటి కసరత్తులు చేస్తారో చూడాలి.