బుజ్జిగాడి లవ్‌ స్టోరీ 

Priyanka Chopra and Nick Jonas wedding  - Sakshi

చెల్లెలి ఫ్రెండ్స్‌ను ఇష్టపడటం చూశాం.ఈ బుజ్జిగాళ్లు అక్క ఫ్రెండ్స్‌ని ఇష్టపడటం చూస్తున్నాం.గతంలో తమకంటే పెద్ద వయసున్న ఆడవాళ్లను ‘అక్కా’ అనో ‘ఆంటీ’ అనో పిలిచేవాళ్లు.ఇప్పుడు ‘డార్లింగ్‌’ అని గులాబీ పువ్వు ఇస్తున్నారు. తమకంటే వయసు తక్కువ అబ్బాయిలను లైఫ్‌ పార్టనర్‌గా చేసుకోవడం తప్పేం కాదని ఈ బాలీవుడ్‌ హీరోయిన్స్‌ కూడా భావిస్తున్నారు. 

‘పేరులో ఏముంది?’ అన్నాడు షేక్స్‌పియర్‌. ‘వయసులో ఏముంది?’ అని కూడా ఆయనే అనుంటాడు. ప్రేమ గుడ్డిది మాత్రమే కాదు... చెవిటిది.. మూగది.. బర్త్‌ సర్టిఫికెట్‌లను పట్టించుకోనిది కూడా. అమ్మాయికి 18, అబ్బాయికి 25 అనే పాతకాలపు పెళ్లి వయసు లెక్క తప్పిపోయి చాలాకాలం అయ్యింది. ఇప్పుడు పెళ్లిళ్లు జంటల మధ్య పూర్తి అపసవ్య వయసు నిష్పత్తిలో సాగుతున్నాయి. ఆ మధ్య కాలంలో బాలీవుడ్‌ మగవాళ్లు తమ కంటే తక్కువ వయసు ఉన్న స్త్రీలను వివాహం చేసుకున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ తన కంటే 12 ఏళ్లు చిన్నదైన కరీనాను చేసుకున్నాడు. షాహిద్‌ కపూర్‌ తన కంటే 14 ఏళ్లు చిన్నదైన మీరా రాజ్‌పుట్‌ను చేసుకున్నాడు. సంజయ్‌ దత్‌ తన కంటే 20 ఏళ్లు చిన్నదైన మాన్యతను చేసుకున్నాడు. అయితే దీనికి సంఘంలో పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ అమ్మాయి వయసు ఎక్కువయ్యి అబ్బాయి వయసు తక్కువైతే భృకుటి ముడిపడుతూ ఉంటుంది. అయినప్పటికీ బాలీవుడ్‌ స్త్రీలు ఈ విషయంలో లోకరీతిని వదిలి ధైర్యంగా ముందుకు అడుగు వేస్తున్నారు. మనసుకు నచ్చిన బోయ్‌ఫ్రెండ్‌ని ఎంచుకుంటున్నారు. వారెవరో చూద్దాం.

తేడా ఉన్నా.. తేడాల్లేవ్‌
మ్యారేజెస్‌ ఆర్‌ మేడ్‌ ఇన్‌ హెవెన్‌ అంటారు. అప్పట్లో ఐశ్వర్యారాయ్‌తో లవ్‌లో ఉన్నారని కొందరు హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఫైనల్‌గా ఆమెను అభిషేక్‌ బచ్చన్‌ 2007లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ముద్దుల కూతురు ఆరాధ్య. అభిషేక్‌ కంటే ఐశ్వర్య రెండున్నరేళ్లు పెద్దది. అలాగే తనకంటే మూడు సంవత్సరాలు చిన్నవాడైన కరణ్‌సింగ్‌ గ్రోవర్‌ను వివాహం చేసుకున్నారు బిపాసా బసు. విశేషం ఏంటంటే.. కరణ్‌ ఇది వరకే రెండు పెళ్లిళ్లు (2008లో ఒకసారి, 2012లో మరోసారి) చేసుకుని విడాకులు తీసుకున్నారు. బిపాసాను మూడో వివాహం చేసుకున్నారు. అప్పటికే జాన్‌ అబ్రహాంతో  తొమ్మిదేళ్లు సహజీవనం చేశారు బిపాసా. ఆ తర్వాత ఒంటరి జీవితం గడుపుతున్న ఆమెకు, అప్పటికే ఒంటరిగా ఉన్న కరణ్‌కు ‘ఎలోన్‌’ (2015) సినిమాతో ఒంటరితనం పోయింది.  అప్పుడే ప్రేమలో పడ్డారు. ఇక ‘ధూంధే రెహ్‌ జోగి’ (2009) సినిమా సెట్‌లో కలుసుకున్నారు సోహా అలీఖాన్‌ (40), కునాల్‌ కేము (35). అదే ఏడాది ‘99’ సినిమా సెట్స్‌లో మాటలతో పాటు సోహా అలీఖాన్, కునాల్‌ మనసులు కలిశాయి. ఐదేళ్ల గ్యాప్‌ ఉన్నా వీరిద్దరి బంధం పెళ్లితో ముడిపడిపోయింది. అలాగే బాలీవుడ్‌ బ్యూటీ ఊర్మిళా మటోండ్కర్‌ తనకంటే పదేళ్లు చిన్న అయిన కశ్మీరీ బిజినెస్‌మేన్‌ మోహ్‌సిన్‌ అక్తర్‌ను 2016 మార్చిలో షాదీ చేసుకున్నారు. ఈ లిస్ట్‌లో నేహా ధూపియా, అంగద్‌ బేడీ కూడా ఉన్నారు. నేహా ధూపియా (38), అంగద్‌ బేడీ (35)ల స్నేహం ప్రేమగా మారి పెళ్లి పీటలెక్కడానికి  కాస్త టైమ్‌ ఎక్కువగానే పట్టింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఈ ఏడాది మేలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంకో విశేషం ఏంటంటే... వీరి పెళ్లి జరిగే నాటికి నేహా గర్భవతి. ఈ విషయాన్ని పెళ్లి తర్వాత బయట పెట్టారామె. అతి త్వరలో వీరి ఇంట్లోకి రానున్న చిన్నారితో వీరి బంధం డబుల్‌ స్ట్రాంగ్‌ అవుతుంది.

పియానిక్‌
2017నాటి ఒక వేడుకలో బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రా (36), అమెరికన్‌ పాప్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ (26) కలిశారు. తొలిచూపులోనే అతడు ప్రియాంకాకు ఫిదా అయిపోయాడు. తొలి ఫొటోను ఫోన్‌లో వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాడు. తమ మధ్య పదేళ్ల గ్యాప్‌ ఉన్నప్పటికీ ప్రేమకు వయసు అడ్డు కాదనుకున్నాడు నిక్‌. ‘ఐ వానా ఫాలో ఫాలో యూ’ అంటూ ప్రియాంకా చుట్టూ ప్రదక్షిణలు చేశాడు. మరోవైపు ప్రియాంకకు కూడా నిక్‌ అంటే ప్రేమలాంటిది మొదలైంది. ఆ విషయాన్ని బయట ప్రపంచంతో చెప్పుకోలేదు.కానీ నిక్‌కి సంబంధించిన ఈవెంట్స్‌లో ప్రియాంక ప్రత్యక్షమవడం, నిక్‌ కజిన్‌ పెళ్లికి హాజరు కావడంతో అందరికీ డౌట్‌ వచ్చింది. ప్రియాంకా చోప్రా బర్త్‌డే నాడు నిక్‌–ప్రియాంకాల ప్రేమ వ్యవహారం అఫీషియల్‌గా మారింది. ఆ తర్వాత నిక్‌ ముంబై రావడం, ప్రియాంకా ఫ్యామిలీని మీట్‌ అవ్వడం చకచకా జరిగిపోయాయి. వారి రోకా (నిశ్చితార్థం) వేడుక ఆగస్టు 18న జరిగింది. వీరిద్దరి వివాహం ఈ ఏడాది డిసెంబర్‌ 2న జరగనుందని బాలీవుడ్‌ టాక్‌. ప్రస్తుతం న్యూయార్క్‌లో నిక్‌ బ్యాచిలర్‌ పార్టీలతో బిజీగా ఉంటే... ప్రియాంకా చోప్రా ‘ద స్కై ఈజ్‌ పింక్‌’ సినిమా కోసం ఢిల్లీలో ఉన్నారు.

రోహ్‌మాన్సింగ్‌!
విశ్వసుందరి సుస్మితాసేన్‌ వివాహం చేసుకుంటోందంటూ ఇటీవల ఓ వార్త తెరపైకి వచ్చింది. దీనికి కారణం మోడల్‌ రోహ్‌మన్‌ షాల్‌. ఈ మధ్య సుస్మితాసేన్‌తో ఇతను చాలా క్లోజ్‌గా ఉంటున్నాడు. సుస్మిత ఎక్కడ కనిపించినా అక్కడే ఉంటున్నాడు. పైగా అతనితో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారామె. దాంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే వీళ్లిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం, దత్తపుత్రికలు రినీ సేన్, అలీషా సేన్‌లతో సుస్మితకు ఉన్న అనుబంధం రీత్యా ఆమెకు పెళ్లి ఆలోచన లేదన్నది చాలామంది ఊహ.సుస్మిత వయసు 42 అయితే రోహ్‌మన్‌ వయసు 27. వయసు గురించి ఇద్దరూ పట్టించుకోలేదు. ‘రోహ్‌మాన్సింగ్‌’ అనే పదాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయడం ద్వారా సుస్మిత తమ ప్రేమను బయటపెట్టారు. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదన్నారు. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకోన్‌లు కూడా ఇలానే అన్నారనీ వాళ్లు పెళ్లి వైపు నడిచినట్టే సుస్మితా కూడా పెళ్లి వైపు నడుస్తుందని మరికొందరి జోస్యం. వచ్చే ఏడాది ఎండింగ్‌లో ఈ జంట పెళ్లి కార్డు అందుతుందని కొందరు ఊహిస్తున్నారు.

చెప్పకనే చెబుతున్నారు
ఇటీవల ముంబైలో ఓ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు వెళ్లారు మలైకా ఆరోరా. జనాలు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడ్డారు. అయితే ఆమె పక్కనే ఉన్న అర్జున్‌ కపూర్‌ మలైకాకు ఫుల్‌ ప్రొటెక్షన్‌ ఇచ్చాడు. క్రౌడ్‌ని పక్కకు తోశాడు. మలైకా విషయంలో అర్జున్‌ ఇంత కేరింగ్‌గా ఎందుకు ఉన్నాడు అని ఔత్సాహికరాయుళ్లు గుసగుసలు మొదలుపెట్టారు. ఇది ఇలా ఉండగా మొన్నటి దీపావళి పండక్కి అర్జున్‌ కపూర్‌ ఇంటికి వెళ్లారు మలైకా. ఇంకేముంది ఈ కబురు ఢాంఢామ్మని పేలింది. కథ పాకాన పడిందని కన్‌ఫర్మేషన్‌ అందింది. కానీ అర్జున్‌ కంటే మలైక 12 ఏళ్లు పెద్ద. సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ నుంచి మలైకా విడాకులు తీసుకుని ఏడాదిన్నర  అయింది. ఒంటరితనంలో దొరికిన ప్రేమ ఆమెను పెళ్లివైపు నడిపిస్తుందని అందరూ అంటున్నారు.

ఇన్‌పుట్స్‌: ముసిమి శివాంజనేయులు 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top