
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాను క్వారంటైన్‌లో ఉన్నట్టు వచ్చిన వార్తలను ప్రముఖ నటుడు..
చెన్నై: కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాను క్వారంటైన్‌లో ఉన్నట్టు వచ్చిన వార్తలను ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ తోసిపుచ్చారు. గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు తన ఇంటికి క్వారంటైన్ స్టిక్కర్ అంటించడంతో ఆయన క్వారంటైన్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కమల్‌హాసన్ వివరణ ఇస్తూ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
స్టిక్కర్ అతికించిన ఇంటిలో ప్రస్తుతం తాను ఉండటం లేదని ఆయన తెలిపారు. ఈ ఇంటిని మక్కల్ నీది మయ్యం కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నామని చెప్పారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సామాజిక దూరం పాటిస్తున్నానని వెల్లడించారు. ప్రజలంతా సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. వార్తలను ప్రసారం చేసేముందు వాస్తవాలను ధ్రువీకరించుకోవాలని వార్తా సంస్థలకు ఆయన సూచించారు. కమల్‌హాసన్ వివరణ ఇవ్వడంతో ఆయన ఇంటికి అతికించిన స్టిక్కర్‌ను ప్రభుత్వ సిబ్బంది తొలగించారు. (కరోనా లాక్‌డౌన్: చిరు బాటలో నాగ్)
కరోనా వ్యాప్తి నేపథ్యంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి చెబుతూ జనతా కర్ఫ్యూకు ముందు కమల్‌హాసన్ ఒక వీడియో విడుదల చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని బయటకు రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. (చదవండి: ఇప్పుడు ఏమి చేయాలి ‘కరోనా’)