‘సినిమాలో యాక్ట్ చేస్తాం.. పబ్లిసిటీ కార్యక్రమాల్లో మాత్ర పాల్గొనం’ అంటూ కొంతమంది కథానాయికలు ముందుగానే షరతులు విధిస్తుంటారు.

‘సినిమాలో యాక్ట్ చేస్తాం.. పబ్లిసిటీ కార్యక్రమాల్లో మాత్ర పాల్గొనం’ అంటూ కొంతమంది కథానాయికలు ముందుగానే షరతులు విధిస్తుంటారు. ఒకవేళ ఎలాంటి నిబంధనలు విధించకపోయినా.. చివరి నిమిషంలో ప్రచార కార్యక్రమాలకు హ్యాండ్ ఇస్తుంటారు కొంతమంది కథానాయికలు. ఇకనుంచీ అలాంటి పప్పులు ఉడకవ్. ఎందుకంటే కథానాయికలు ప్రచార కార్యక్రమాలకు గైర్హాజరయ్యే విషయాన్ని పలువురు నిర్మాతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ విషయాన్ని తమిళ చలన చిత్ర నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లారు. ఆ ఫిర్యాదుని పరిశీలించిన అనంతరం నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఆర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం గురించి కేఆర్ మాట్లాడుతూ -‘‘ఆడియో ఆవిష్కరణ వేడుకల్లోనూ పాత్రికేయుల సమావేశాల్లోనూ కొంతమంది కథానాయికలు పాలుపంచుకోవడంలేదని నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే, ఇకనుంచి మొత్తం పారితోషికం ముందే ఇవ్వకూడదని తెలిపాం. 80 శాతం ఇచ్చేసి, మిగతా 20 శాతాన్ని నిర్మాతల దగ్గరే ఉంచుకోవాలని చెప్పాం. 10 శాతాన్ని ఆడియో వేడుకలో పాల్గొన్నప్పుడు, మిగతా 10 శాతాన్ని ప్రెస్‌మీట్స్‌లో పాల్గొన్నప్పుడు ఇవ్వమని సూచించాం. హీరోయిన్లతో లిఖితపూర్వకంగా ఈ ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్మాతలకు చెప్పాం. ఇవాళ ప్రతి సినిమాకీ ప్రమోషన్ ఎంతో అవసరం. అయితే కొంతమంది కథానాయికలు సినిమాలు నటించడం వరకు మాత్రమే తమ బాధ్యత అని భావిస్తున్నారు.
ఒకవేళ వాళ్ల మేనేజర్ల సలహా వల్లో లేక ఇతరుల సలహా మేరకో వాళ్లలా అనుకుని ఉండొచ్చు. నేనెవర్నీ తప్పుపట్టడంలేదు. అయితే, ఇకముందు కూడా ప్రచార కార్యక్రమాలకు హాజరు కాకపోతే పారితోషికంలో కోత తప్పదు’’ అని తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాజల్ అగర్వాల్, శరణ్యమోహన్ తమ చిత్రాల పబ్లిసిటీ కార్యక్రమాలకు హాజరు కాలేదట. దాంతో ఈ ఇద్దరి ముద్దుగుమ్మలపై ఆయా చిత్ర నిర్మాతలు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.