
సాక్షి, చెన్నై : మంచి అంచనాలు ఉన్న చిత్రాల్లో వేల్లైక్కారన్ ఒకటని చెప్పవచ్చు. కారణం.. వరుస విజయాల జోరు మీదున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇది. రెమో వంటి సెన్సేషనల్ సక్సెస్‌పుల్ చిత్ర నిర్మాణ సంస్థ 24ఏఎం ఫిలింస్ అధినేత ఆర్‌డీ.రాజా నిర్మిస్తున్న నూతన చిత్రం వేల్లైక్కారన్. అదే విధంగా తనీఒరువన్ వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత మోహన్‌రాజా తెరకెక్కిస్తున్న మూవీ ఇదే. ఇక అన్నింటికీ మించి స్టార్ హీరోయిన్ నయనతార నాయకిగా నటిస్తున్న చిత్రం వేల్లైక్కారన్. ఇంకా నటి స్నేహా, ఫాహద్ పాజిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబరు నెలలోనే విడుదల కావలసిన ఈ చిత్రం నిర్మాణంలో జాప్యం కారణంగా వాయిదా పడింది.
అయితే ఇటీవల చిత్ర నిర్మాత చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసి పసందైన విందునిచ్చారు. అందులో నటి నయనతార పాల్గొనడం విశేషం. కాగా ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్మాత డిసెంబరు 3వ తేదీన గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు నయనతార కూడా పాల్గొనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే తన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పాల్గొనని నయనతార వేల్లైక్కారన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటుందా? అన్న సందేహం కలగక మానదు. అప్పుడెప్పుడో నటుడు ఆర్య చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఈ బ్యూటీని ఆ తరువాత ఎలాంటి వేడుకలోనూ చూడలేదు. అలాంటిది వేలైక్కారన్ చిత్ర ఆడియో ఆవిష్కరణ వేడుకలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని స్పెషల్ చేస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.