నవీన్‌లో మంచి ఈజ్‌ ఉంది | Naveen Vijaya Krishna's Oorantha Anukuntunnaru Movie Title Logo launch | Sakshi
Sakshi News home page

నవీన్‌లో మంచి ఈజ్‌ ఉంది

Jan 17 2019 12:31 AM | Updated on Jan 17 2019 12:31 AM

Naveen Vijaya Krishna's Oorantha Anukuntunnaru Movie Title Logo launch - Sakshi

నవీన్‌ విజయ్‌, కృష్ణ, విజయ నిర్మల, నరేశ్‌

‘‘టైటిల్‌ బావుంటే సినిమా సగం సక్సెస్‌ అయినట్టే. ‘ఊరంతా అనుకుంటున్నారు’ అనే టైటిల్‌లో నేటివిటీ ఉంది. ఇంగ్లీష్‌ టైటిల్స్‌ ఎక్కువ వస్తున్న టైమ్‌లో ఇలాంటి టైటిల్‌తో రావడం బాగుంది’’ అని సూపర్‌స్టార్‌ కృష్ణ అన్నారు. నవీన్‌ విజయ్‌కృష్ణ, అవసరాల శ్రీనివాస్‌ హీరోలుగా బాలాజి సానల తెరకెక్కించిన చిత్రం ‘ఊరంతా అనుకుంటున్నారు’. మేఘా చౌదరి, సోఫియా సింగ్‌ కథానాయికలు. శ్రీహరి మంగళంపల్లి, రమ్య గోగుల, పి.యల్‌.యన్‌. రెడ్డి, ఎ. పద్మనాభరెడ్డి నిర్మాతలు.

నవీన్‌ విజయ్‌కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ లోగోను కృష్ణ, ఫస్ట్‌ లుక్‌ను విజయ నిర్మల రిలీజ్‌ చేశారు. నవీన్‌ లుక్‌ టీజర్‌ను నరేశ్‌ విడుదల చేశారు.  ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ – ‘‘నవీన్‌ చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగాడు. తనలో మంచి ఈజ్‌ ఉంది. పాటలు, ఫైట్లు బాగా చేస్తున్నాడు. ఆర్టిస్ట్‌గా మంచి భవిష్యత్తు ఉంది. కథ బావుందని నరేశ్‌ అన్నాడంటే సినిమాలో విషయం ఉన్నట్టే. ఈ చిత్రం విజయం సాధించాలి’’ అన్నారు.

‘‘నందిని నర్సింగ్‌ హోమ్‌’ నవీన్‌కు హీరోగా మంచి పేరు తెచ్చింది. ఆర్టిస్ట్‌గా నిలదొక్కుకోవాలన్నది అతని తాపత్రయం. నేను బాగున్నాయి అన్న సినిమాలు 99 శాతం ఫెయిల్‌ అవ్వలేదు’’ అన్నారు నరేశ్‌. ‘‘ఈ సినిమా అంతా పాలకొల్లులో షూట్‌ చేశాం. అక్కడే సెటిల్‌ కావాలనిపించేంతగా నచ్చింది’’ అన్నారు నవీన్‌. ‘‘గ్రామీణ నేపథ్యంలో అందంగా సాగే సినిమా ఇది. విలేజ్‌ బాయ్‌గా నవీన్‌ మెప్పిస్తాడు. నవీన్‌లోని పలు షేడ్స్‌ ఇందులో కనిపిస్తాయి’’ అన్నారు నిర్మాతలు.

Advertisement
 
Advertisement
Advertisement