ప్రేక్షకుల...తెలివి మీద ప్రేమతో...

ప్రేక్షకుల...తెలివి మీద ప్రేమతో...


తారాగణం: జూనియర్ ఎన్టీయార్, రకుల్ ప్రీత్‌సింగ్, కెమేరా: విజయ్ కె. చక్రవర్తి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: బి.వి. ఎస్.ఎన్. ప్రసాద్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: బి. సుకుమార్నవలలు సినిమాలుగా రావడం చాలా తెలుసు కానీ, సినిమాయే నవలలాగా ఉండే సందర్భాలు చాలా తక్కువ. ‘నాన్నకు ప్రేమతో...’ సినిమా చూస్తుంటే, గతంలో చదివిన యండమూరి వీరేంద్రనాథ్ తరహా రచయితల కమర్షియల్ నవలలు, వాటిలోని తెలివైన వ్యూహాలు గుర్తుకొస్తాయి. ఇరవయ్యేళ్ళ క్రితం తన తండ్రిని మోసం చేసి, బిలియనీర్‌ని కాస్తా మధ్యతరగతి మనిషిగా మార్చేసిన విలన్ మీద పగ తీర్చుకోవడం హీరో లక్ష్యం. ఆ విలన్‌ను రోడ్డుపైకి ఈడ్చేయడం కోసం అచ్చంగా మళ్ళీ తెలివైన ఆ విలన్ స్వభావాన్నీ, గుణాన్నే హీరో అతి తెలివిగా అనుసరిస్తాడు.అభి (చిన్న ఎన్టీయార్) తండ్రి (రాజేంద్రప్రసాద్) ఒకప్పటి బిలియనీర్ రమేశ్‌చంద్రప్రసాద్ . కానీ, కృష్ణమూర్తి (జగపతి బాబు) మోసంతో రోడ్డునపడతాడు. జనం తరిమితే, పారిపోయి, సుబ్రమ ణ్యంగా పేరు, రూపు మార్చుకొని బతుకుతాడు. పిల్లల్ని పెంచి, ముసలివాడవుతాడు. ఇక మరో నెలరోజుల్లో ప్రాణం పోయే తీవ్రవ్యాధితో మంచం మీద ఉన్న ఆ తండ్రి ఆ సంగతి తన కొడుకులకి చెప్పి, ప్రతీకారేచ్ఛ వెల్లడిస్తాడు. అన్నలు (రాజీవ్ కనకాల, అవసరాల శ్రీనివాస్) కాదన్నా, తమ్ముడు అభి రంగంలోకి దిగుతాడు. మరో ముగ్గురి సాయంతో, కృష్ణమూర్తి కూతుర్ని (రకుల్) ప్రేమలో పడేస్తాడు. తర్వాత బ్రెయిన్ గేవ్‌ులో విలన్‌పై చివరకు హీరో ఎలా విజయం సాధించి, తండ్రి పగ తీర్చాడనేది సినిమా.ఫస్టాఫ్‌లో లవ్‌ట్రాక్ వ్యవహారం సరదాగా అనిపిస్తుంది. సెకం డాఫ్ కీలక ఘట్టం. కానీ, తొలి పావుగంటలోనే విషయమంతా విప్పేసి, రెండుమ్ముప్పావు గంటలు సుదీర్ఘంగా హాలులో కూర్చో పెట్టడం కత్తి మీద సామే. అనేక లోపాల మధ్యనే ఆ ప్రయత్నం చేశారు. హీరోగా 25వ చిత్రంగా ఈ స్క్రిప్ట్‌నెంచుకోవడంలో, పాత్ర పోషణలో చిన్న ఎన్టీయార్ తన మూస నుంచి బయటకు రావాలని శ్రమించినట్లర్థమవుతుంది. గెటప్ శ్రద్ధా కనిపిస్తుంది. డ్యాన్‌‌సల్లో హుషారు సరేసరి! అతి మాస్ యాక్షన్ ఇమేజ్‌కు కొద్దిగా పక్కకు జరగడం బాక్సాఫీస్ రీత్యా అయినా కాకున్నా లాంగ్ కెరీర్‌లో ఆయనకు అవసరమైన మార్పే! తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న పంజాబీ రకుల్ ప్రీత్ సింగ్ ఎన్నారైగా నప్పింది. కాస్ట్యూవ్‌ు్స వగైరా పాత్రకు తగ్గట్లున్నాయి. ప్రత్యేకంగా చెప్పాల్సింది తెలివైన విలన్ కృష్ణమూర్తి పాత్రలో ట్రిమ్ గా, సూపర్ ఫిట్‌నెస్‌తో కనిపించిన జగపతిబాబు నటన. విలనైనా ఆ క్యారెక్టరైజేషన్‌లోని తెలివికి ప్రేమలో పడతాం. రాజేంద్రప్రసాద్ కనిపించేది కాసేపే. అదీ ఎక్కువగా మంచానికి పరిమితమయ్యే! ఆ స్టేజ్‌లో, అందులోనూ క్లైమాక్స్‌లో డైలాగైనా లేకుండా కేవలం ముఖంలో చూపే భావం ఆయన సీనియారిటీకి మచ్చుతునక. మిగిలినవన్నీ సహాయపాత్రలే.లండన్ నేపథ్యంలో ఎక్కువగా నడిచే ఈ సినిమాకు ఆయువుపట్టు - నిర్మాణ విలువలు, కెమేరా వర్‌‌క, సంగీతం. దేవిశ్రీ ప్రసాద్ రాసి, చిన్న ఎన్టీయార్‌తో పాడించిన ‘ఐ వాంట్ టు ఫాలో ఫాలో’ కొన్నాళ్ళు యువతరం ఫాలో అయ్యే పాట. భావోద్విగ్న సన్నివేశాల్లో రీరికార్డింగ్ మెరుపులూ ఆకట్టుకుంటాయి. అయితే ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ రిజిస్టర్ చేసుకొని, ఆ అంశం చుట్టూ సినిమా తీస్తున్నప్పుడు, సెంటిమెంటల్ సీన్లకు మరింత ప్రాధాన్యమివ్వాల్సింది. అలాగే, హీరోయిన్‌ను చిన్నప్పటి నుంచి వెంటాడుతున్న కల తాలూకు అంశాన్ని హీరో ఛేదిస్తాడు. కానీ, జీవితంలో కీలకమైన ఆ సంగతి వెల్లడయ్యాక హీరోయిన్ పాత్ర తెరపై హఠాత్తుగా కనిపించడం మానేసింది. అంత చేసిన హీరో వెంట హీరోయిన్ నడిచిందా? తండ్రితో ఆమె బాంధవ్యమెలా మారింది లాంటి ప్రశ్నలకు తెరపై సమాధానాలు వెతకకూడదు.పాత్రలు, పాత్ర చిత్రణ, కథను చెప్పిన విధానం చూస్తే... ప్రేక్షకుల తెలివితేటలు, అవగాహన మీద అతి ప్రేమతో దర్శక - రచయిత ఈ సినిమా తీశారనిపిస్తుంది. పూర్వాశ్రమంలో కాలేజ్‌లో లెక్కల లెక్చరరైన సుకుమార్ ఏవేవో లెక్కలు వేసుకొని ఈ సినిమా తీయలేదనీ అర్థమవుతుంది. ‘బటర్‌ఫై్ల ఎఫెక్ట్’ లాంటి అంశాలు, ఈస్ట్రోజెన్ లెవల్స్ లాంటి ప్రస్తావనలు సులభంగా అర్థమయ్యేలా చేయాలని పడిన తపన చూస్తే పాఠం విడమర్చి చెప్పారన్న భావన కలుగుతుంది.ఎక్కడో తీర్చుకోలేకపోయిన నొప్పుల్ని మరెక్కడో తీర్చుకోవడానికి చూడడం మానవ నైజం. అందుకే, ఒక ఎమోషన్‌ను మరొకచోట చూపిస్తుంటాం. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఇదొక ప్రధానమైన పాయింట్. నిజజీవితంలో తండ్రి మరణవేళ ఎదురైన కొన్ని ఎమో షన్‌‌సను తెరపై చూపేందుకు సుకుమార్ ప్రయత్నించారు. ‘ఆర్య’, ‘1’ లాంటి సినిమాల్లో లాగే ఎక్స్‌ట్రీవ్‌ు ఆలోచనలు, కథలో ఇంటెలిజెన్స్, స్క్రీన్‌ప్లేలో కొత్తదనం మామూలే. ఈసారి స్ట్రెయిట్ నేరేషన్ స్క్రీన్‌ప్లేను ఆయన అనుసరించినా, ఆ మార్‌‌క చెరిగిపోలేదు. అందుకే, పాత్రల మధ్య ఇంటెలిజెన్స్‌తో మొత్తం నడిచే ఈ సినిమా కొండొకచో ప్రేక్షకుడి మెదడుకీ పనిపెడుతుంది. డైలాగులు, ఘట్టాల్లో కొన్ని పదేపదే చూడా లనిపిస్తే, మరికొన్ని చూడాల్సొస్తాయి. ప్రేక్షకులు ఆ శ్రమకు ఎంతమేర సిద్ధపడతారన్నదాన్ని బట్టి, వారి బాక్సాఫీస్ ప్రేమ వర్షిస్తుంది.మొత్తం మీద అజ్ఞాతంలోని హీరో... విలన్ ఇంట్లో హీరో దాగుడుమూతలు... హీరో చేతిలో విలన్ బకరా... ఆల్రెడీ పెళ్ళి ఫిక్సయిన హీరోయిన్‌ను ఒప్పించి మరీ పెళ్ళిచేసుకోవడాలు - ఇలా వచ్చిన సినిమాలే కొత్తగా వస్తున్నరోజులివి. ఈ టైమ్‌లో కొత్తదనం కోరుకొంటున్నవారికి పాతకాలపు రివెంజ్ ఫార్ములా కథనే ఇంటెలిజెంట్ గేమ్‌గా, కొత్త పద్ధతిలో చెప్పడానికి చేసిన ప్రయత్నం ఈ సినిమాలో కనిపిస్తుంది. కొన్నిచోట్ల బుర్రకు పదును, ఇంకొన్నిచోట్ల వేడి తెప్పిస్తుంది. టైటిల్స్ నుంచి కొత్తదనం మాత్రం కాదనలే మనిపిస్తుంది.అన్నట్లు, హాలులోంచి బయటకొస్తుంటే ఒక పెద్ద మనిషి, ‘ఇంతకీ సినిమా ఎలా ఉంది’ అని అడిగిన ఫ్రెండ్‌తో సినిమాలో జగపతిబాబు అన్నట్లే ‘గుర్తుపెట్టుకో! మళ్ళీ చెబుతా!’ ననడం వినిపించింది. హీరో చాలాసార్లన్నట్లు యాంగిల్ మార్చి కూర్చొనిచూస్తే మరోలా ఉండే ఈ సినిమా.. చూసిన ‘ఎమోషన్‌ను అక్కడికక్కడే తీర్చేసుకోలేం!’ ఎంతైనా జీరో ఎమోషన్‌‌స... జీరో ఎనిమీస్ సూత్రం చెప్పినంత ఈజీ కాదుగా!

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top