సిరికాకొలనులో సీత..! | Smitha Madhav: Carnatic Classical Singer and Bharatanatyam Dancer. | Sakshi
Sakshi News home page

సిరికాకొలనులో సీత..! జూనియర్‌ ఎన్టీఆర్‌ మూవీ ..

Jul 17 2025 10:50 AM | Updated on Jul 17 2025 11:07 AM

Smitha Madhav: Carnatic Classical Singer and Bharatanatyam Dancer.

గుణశేఖర్‌ ‘రామాయణం’ గుర్తుందా? రాముడుగా జూ. ఎన్టీఆర్‌తోపాటు సీతగా.. స్మితామాధవ్‌ ప్రేక్షక మనసులను కట్టిపడేసింది! సినిమాల్లో కనిపించకపోయినా.. నాట్యంతో, గానంతో కళాభిమానులను అబ్బురపరుస్తూనే ఉంది!ఇటీవల ‘సిరికాకొలను చిన్నది’ నృత్యరూపకంతో  మరోసారి తన ప్రతిభను చాటుకుంది. ఈ నేపథ్యంలో.. హైదరాబాద్‌ వాసి స్మిత గురించి మరిన్ని విషయాలు, విశేషాలు ఆమె మాటల్లోనే.. 

‘‘నిజానికి.. వేటూరి సుందర రామ్మూర్తి ‘సిరికాకొలను చిన్నది’ రేడియో డ్రామాను కె. విశ్వనాథ్‌గారు సినిమాగా తీయాలనుకున్నారట. ఎందుకనో కుదరలేదట. 2019 ఎండింగ్‌లో ఆయన ఆ స్క్రిప్ట్‌ను నాకు ఇచ్చి నన్ను చేయమన్నారు. కోవిడ్‌ రావడంతో ఆ ప్రాజెక్ట్‌ లేట్‌ అయింది. నేను చేసిన ఆ నృత్యరూపకానికి చాలా ప్రశంసలు అందాయి. 

కె. విశ్వనాథ్‌గారు ఉండి ఉంటే చాలా మురిసిపోయేవారు. నా ప్రదర్శనకు వాళ్ల అబ్బాయి వాళ్లంతా వచ్చారు.. సంతోషమేసింది. విశ్వనాథ్‌గారున్నప్పుడు చేయలేకపోయాననే బాధ మాత్రం ఉంది. వారంటే నాకు చాలా అభిమానం, గౌరవం. వారి సినిమాల్లో నటించాలనే ఆసక్తి, ఆలోచన వచ్చేప్పటికే ఆయన సినిమాలు తగ్గించేసుకున్నారు. 

నా పెర్‌ఫార్మెన్సెస్‌ చాలా వాటికి వచ్చారు. కళ పట్ల నాకున్న కమిట్‌మెంట్‌ను మెచ్చుకునేవారు. నాకు ఊహ తెలిసేప్పటికల్లా భరతనాట్యం, కర్ణాటక సంగీతం క్లాసెస్‌లో ఉన్నాను. ఒకరకంగా చెప్పాలంటే మాది కళల నేపథ్యం ఉన్న కుటుంబం. మా అమ్మమ్మ, నానమ్మ పాడేవారు. అమ్మ (హేమ) పాడుతారు.. వీణా వాయిస్తారు. అన్నయ్య సిద్ధార్థ వీణ, వయొలిన్‌ నేర్చుకున్నాడు. అయితే మా ఇంట్లో ఆర్ట్‌ని ప్రొఫెషన్‌గా తీసుకుంది మాత్రం నేనే! భరతనాట్యంలో నా గురువు రాజేశ్వరీ సాయినాథ్, సంగీత గురువు లలితమ్మ.

తాతగారి వల్లే సీత.. 
నా అరంగేట్రం గురించి పత్రికలో వచ్చిన కథనాన్ని చదివి, నా గురించి వాకబు చేసి మా ఇంటికి వచ్చారు నిర్మాత, కవి ఎమ్మెస్‌ రెడ్డి. ‘మేము తీయబోయే ‘రామాయణం’ సినిమాలో మీ అమ్మాయిని సీతగా అనుకుంటున్నాం.. మీకు సమ్మతమేనా’ అని నాన్నగారిని అడిగారు. దాని మీద మా ఇంట్లో పెద్ద చర్చే జరిగింది. మా తాతగారే చొరవ తీసుకుని ‘మంచి అవకాశం... పంపించండి’ అని  తేల్చేశారు. 

అలా తాతగారి వల్లే ఆ సినిమాలో సీతగా నటించాను. రామాయణం తర్వాతా, హీరోయిన్‌గానూ చాలా అవకాశాలే వచ్చాయి. కానీ ఇటు డాన్స్‌ అండ్‌ మ్యూజిక్, చదువు, అటు సినిమాలు..  బ్యాలెన్స్‌ చేసుకోవడం కుదరలేదు. అందుకే సినిమాల మీద దృష్టి పెట్టలేదు. నేను చదువులో కూడా క్వయిట్‌ గుడ్‌. లా (ఉస్మానియా యూనివర్సిటీ)లో గోల్డ్‌మెడలిస్ట్‌ని. కర్ణాటిక్‌ మ్యూజిక్, భరతనాట్యం(మద్రాస్‌ యూనివర్సిటీ)లో మాస్టర్స్‌ చేశాను. 

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశాను. వీలున్నప్పుడల్లా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి గెస్ట్‌ ఫ్యాకల్టీగా వెళ్తుంటాను భరతనాట్యం అండ్‌ కర్ణాటిక్‌ మ్యూజిక్‌లో. బాలినీస్‌ డాన్స్‌ కూడా నేర్చుకున్నాను. అనేక రకాల అంశాలలోమన దేశానికి, ఇండోనేషియాకు ఉన్న సంబంధం వల్ల నాకు ఆ దేశపు బాలినీస్‌ డాన్స్‌ అంటే ఆసక్తి పెరిగింది. అందుకే బాలీ (ఇండోనేషియా)వెళ్లి..కొన్నాళ్లుండి ఆ డాన్స్‌ నేర్చుకుని వచ్చాను.

అండర్‌ ప్రివిలేజ్డ్‌కు ఫ్రీగా.. 
ఇరవై ఏళ్ల కిందటే అంటే కాలేజ్‌ డేస్‌లోనే ‘వర్ణా ఆర్ట్స్‌ అకాడమీ’ పేరుతో డాన్స్‌ అండ్‌ మ్యూజిక్‌ స్కూల్‌ స్టార్ట్‌ చేశాను. దాదాపు వంద మంది స్టూడెంట్స్‌ ఉంటారు. అందులో అండర్‌ప్రివిలెజ్డ్‌ పిల్లలూ ఉన్నారు. వాళ్లందరికీ ఫ్రీగానే నేర్పిస్తాను. అయితే మిగతా పిల్లలెవరికీ వాళ్లు అండర్‌ ప్రివిలెజ్డ్‌ అని తెలియనివ్వం. 

అందరూ ఈక్వలే! ఎవరి ఆత్మవిశ్వాసమూ దెబ్బతినకూడదు కదా! అంతేకాదు మా ఆర్ట్‌స్కూల్‌కి అన్ని మతాలకు చెందిన పిల్లలూ వస్తుంటారు. అందరికీ అంతే శ్రద్ధతో నేర్పిస్తాం. చాలామంది దర్శకులూ వస్తుంటారు చైల్డ్‌ ఆర్టిస్ట్‌ల కోసం. 24 క్రాఫ్ట్స్‌తో కూడిన సినిమా అంటే నాకు ముందునుంచీ క్రేజే! ఇప్పుడు నాకు తగ్గ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తాను.

స్త్రీల సమస్యలు కళ ద్వారా.. 
‘సిరికాకొలను చిన్నది’ కంటే ముందు కూడా తమిళ్, సంస్కృత నృత్యరూపకాలు చాలా చేశాను. పర్సనల్‌గా ఫీలై.. నాకు నచ్చితే సబ్జెక్ట్, భాషా భేదాలు చూడను. ‘సిరికాకొలను చిన్నది’ కోసం చాలా కష్టపడ్డాను. ఎన్నో హార్డిల్స్‌ ఎదురయ్యాయి. ‘ఇంత కష్టపడ్డం అవసరమా?’అనడిగారు శ్రేయోభిలాషులు చాలామంది. అవసరమే! ఎందుకంటే అంతలా కనెక్ట్‌ అయ్యాను ఆ ప్రాజెక్ట్‌తో. అలా నచ్చితే వెనక్కి తగ్గను. 

నేనెప్పుడూ ఓల్డ్‌ ఇన్‌ ద న్యూ.. న్యూ ఇన్‌ ద ఓల్డ్‌ని చూస్తాను. ఈ కోవలోనే మహిళలు, పిల్లలకు సంబంధించి అంశాలనూ నాకొచ్చిన కళద్వారా ఫోకస్‌ చేయడానికి ప్రయత్నిస్తాను. మేనేజ్‌మెంట్‌ స్కూల్స్‌ నా ్ర΄ోగ్రామ్స్‌ కండక్ట్‌ చేస్తుంటాయి. ఆ ప్రోగ్రామ్స్‌లోనూ వాళ్ల సమస్యలను రామాయణ, మహాభారతాల్లో ఉన్న స్టోరీస్‌కి అనుసంధానించి ప్రదర్శిస్తుంటాను. సమాజానికి కళలు అవసరం.. కళలకు సమాజం అవసరం. కళలు ఒత్తిడిని జయించేలా చేస్తాయి. 

అయితే దానికి పోటీని చేర్చకూడదు. పోటీ వల్ల సాంత్వన స్థానంలోస్ట్రెస్‌ చేరుతుంది. అందుకే ఒకటే చెబుతాను కళలు గురువులు నేర్పుతారు సంస్కారం మాత్రం పేరెంట్సే నేర్పాలి. పిల్లలను పిల్లలుగానే ఉండనివ్వాలి. వాళ్ల బాల్యాన్ని లాక్కోకూడదు’’ అని ముగించారు స్మితామాధవ్‌.

తాతను అమెరికా పంపిన నానమ్మ.. 
మా నాన్న (పీబీ మాధవ్‌) వాళ్లు అయిదుగురు తోబుట్టువులు. వాళ్ల చిన్నప్పుడే ఏదో ఆరోగ్య సమస్యతో మా తాత (పీబీ కృష్ణస్వామి)గారు చూపుకోల్పోవడంతో ఆయన చేస్తున్న క్లర్క్‌ జాబ్‌ కూడా పోయింది. అప్పుడు మా నానమ్మ (సుగంధ కృష్ణస్వామి) తన నగలన్నీ అమ్మి.. తాతగారిని అమెరికా పంపించారు బ్రెయిలీలో టీచర్‌ ట్రైనింగ్‌ కోసం. 

ఆయన అమెరికా నుంచి వచ్చేసరికి నానమ్మ కూడా తన పిల్లలతో పాటు చదువుకొనసాగించి, ట్యూషన్స్‌ చెబుతూ కుటుంబాన్ని పోషించింది. తనూ ఎం.ఎ. ఎం.ఈడీ. చేసింది. తాతగారు ఇండియా వచ్చేసమయానికే కేంద్రప్రభుత్వం డెహ్రాడూన్‌లో బ్లైండ్‌ స్కూల్‌ను స్టార్ట్‌ చేసింది. దేశంలో అదే ఫస్ట్‌ బ్లైండ్‌ స్కూల్‌. దానికి తాతగారే ప్రిన్సిపల్‌. మా నానమ్మ దూరదృష్టికి నిదర్శనం అది. 
– సరస్వతి రమ

(చదవండి: World Emoji Day: సరదా మాత్రమే కాదు.. స్త్రీ సాధికారత కూడా..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement