
కాస్త సరదా కోసం’ అన్నట్లుగా కనిపించే ఇమోజీలు ఇప్పుడు సామాజిక విషయాలపై కూడా దృష్టి పెడుతున్నాయి.స్త్రీ సాధికారత, శక్తికి పెద్ద పీట వేస్తున్నాయి...
‘వంద మాటలేల... ఒక ఇమోజీ చాలదా!’ అనుకోవడం వల్ల ఇమోజీలకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ వస్తోంది. వరల్డ్ ఆన్‌లైన్ పాపులేషన్‌లో 90 శాతం మంది ఇమోజీలను ఉపయోగిస్తున్నారు. సరదా సమయాలలో, భావోద్వేగ ప్రతీకలుగా ఉపయోగించే ఇమోజీలను స్త్రీ సాధికారత, శక్తిని ప్రతిబింబించే ప్రతీకలుగా తీర్చిదిద్దే ధోరణి పెరిగింది.
‘వైవిధ్యమైన కెరీర్‌లో మహిళలు’ అనే అంశాన్ని ప్రతిబింబించేలా ఇమోజీలు వచ్చాయి. స్విమ్మింగ్, వెయిట్ లిఫ్టింగ్, బోట్ రైడింగ్... ఇలా వివిధ ఆటల్లో మహిళల శక్తిసామర్థ్యాలను ప్రతిఫలించే ఇమోజీలు వచ్చాయి. ‘స్టెమ్’ కెరీర్‌లలో రాణించడానికి అమ్మాయిలకు కావాల్సింది ఏమిటి? అని చెప్పే ఇమోజీలు, సాంకేతికరంగంలో మహిళలు సత్తా చాటుతున్నారు అని చెప్పే ఇమోజీలు వచ్చాయి.
మహిళల సమస్యలను ప్రతిబింబించే ఇమోజీలు...
కరోనా కల్లోల సమయంలో స్త్రీలపై ఒత్తిడి, గృహహింస బాగా పెరిగింది. సంస్థలు, ఇతరుల నుంచి సహాయం తీసుకోవడం కూడా కష్టంగా ఉన్న సమయం అది. ఆ కల్లోల పరిస్థితికి అద్దం పట్టేలా ‘వయొలెన్స్ ఆన్ ఉమెన్ అండ్ గర్ల్స్’ ఇమోజీ వచ్చింది.
కోవిడ్ సమయంలో హెల్త్, సోషల్ కేర్ వర్కర్‌లుగా మహిళలు ముందు వరుసలో ఉండి పనిచేశారు. ప్రాణాలను లెక్క చేయకుండా వృత్తి నిబద్ధత చాటుకున్నారు. వారి వృత్తి నిబద్ధత మాట ఎలా ఉన్నా వేతనాలు, నాయకత్వ స్థానాలకు సంబంధించి మహిళలపై వివక్ష కనిపించింది. ఈ సమస్యను గురించి చెప్పే ఇమోజీ... జెండర్ పే గ్యాప్.
కోవిడ్ కాలంలో విద్యాసంస్థలు మూతపడడం వల్ల చాలామంది ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వైపు వెళ్లారు. అయితే సరైన సదు΄ాయాలు లేక΄ోవడం, పేదరికం వల్ల అబ్బాయిలతో ΄ోల్చితే అమ్మాయిలు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌లో వెనకబడి΄ోయారు. దీని గురించి చెప్పే ఇమోజీ... డిజిటల్ జెండర్ డివైడ్. కోవిడ్ కల్లోలం మహిళల ఆదాయం, జీవనోపాధిని బాగా దెబ్బతీసింది. ఎకనామిక్ యాక్టివిటీ లేకుండా పోయింది. దీని గురించి చెప్పే ఇమోజీ... ఇన్‌ఫార్మల్ వర్క్ అండ్ ఇన్‌స్టేబిలిటీ.
పీరియడ్స్‌కు సంబంధించి మహిళలు ఎదుర్కొనే సమస్యలపై ‘పీరియడ్ పావర్టీ అండ్ స్టిగ్మా’ ఇమోజీ వచ్చింది. కోవిడ్ సమయంలో పురుషులతో పోల్చితే ఫిమేల్ హెల్త్‌కేర్ వర్కర్‌లు ఇన్‌ఫెక్షన్, అనారోగ్యం బారిన పడ్డప్పటికీ ప్రాణభయంతో వెనకడుగు వేయలేదు. అయినప్పటికీ విధాన నిర్ణయాలలో వారికి తగిన ప్రాతినిధ్యం లభించలేదు. ఈ విషయాన్ని చెప్పే ఇమోజీ... అండర్ రిప్రెజెంటేషన్ యాజ్ లీడర్స్ ఇన్ హెల్త్.
బ్రెస్ట్ ఫీడింగ్ ఇమోజీ
టెక్నికల్ ఆర్గనైజేషన్ యూనికోడ్ కన్షార్టియం తొలిసారిగా బ్రెస్ట్ ఫీడింగ్ ఇమోజీని తీసుకువచ్చింది. ఇది ఇమోజీ లైబ్రరీలో భాగం అయింది. ట్విట్టర్(ఎక్స్)లాంటి సామాజిక మాధ్యమాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలాంటి సందర్భాలలో ప్రత్యేక ఇమోజీలు తీసుకువచ్చాయి.
కొన్ని సంవత్సరాల క్రితం...
‘పెళ్లికూతురు ఇమోజీలు తప్ప వివిధ వృత్తులకు సంబంధించిన మహిళల ఇమోజీలు కనిపించవు. ఇమోజీ ప్రపంచంలో లింగ వివక్ష కనిపిస్తుంది’ అనే విమర్శలు ఉండేవి. ఇలాంటి విమర్శల నేపథ్యంలో పురుషులతో సమానంగా మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడానికి, స్త్రీ సాధికారతకు అద్దం పట్టే ఇమోజీలకు పట్టం కట్టే ప్రయత్నం జరుగుతోంది. మార్పు మంచిదే కదా!
(చదవండి: నీట్, యూపీఎస్సీలలో ఓటమి..ఇవాళ రోల్స్ రాయిస్‌లో రూ. 72 లక్షలు..)