40 నిమిషాల గ్రాఫిక్స్‌తో...

Nagakanya released on may 24 - Sakshi

కమల్‌హాసన్‌ హీరోగా నటించిన ‘నియా’ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా ‘నియా–2’ పేరుతో తమిళంలో, ‘నాగకన్య’ పేరుతో తెలుగులో ఓ చిత్రాన్ని రూపొందించారు. ‘జర్నీ, రాజారాణి’ చిత్రాల ఫేమ్‌ జై హీరోగా, వరలక్ష్మీ శరత్‌ కుమార్, రాయ్‌లక్ష్మి, కేథరిన్‌ థెరిస్సా ప్రధాన పాత్రల్లో నటించారు. ఎల్‌.సురేష్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఈనెల 24న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్‌ చేస్తున్నారు. లైట్‌ హౌస్‌ సినీ మ్యాజిక్‌ అధినేత కె.ఎస్‌.శంకర్‌ రావు తెలుగులో విడుదల చేస్తున్నారు.

కె.ఎస్‌.శంకర్‌ రావు మాట్లాడుతూ– ‘‘పాము నేపథ్యంలో వచ్చిన ‘నోము, దేవి, పున్నమినాగు, అమ్మా నాగమ్మ’ వంటి చిత్రాలెన్నో ప్రేక్షకాదరణకు నోచుకున్నాయి. ఇప్పుడు మళ్లీ పాము కథాంశాన్ని ఎంచుకుని నేటి నవీన సాంకేతికతను మిళితం చేశారు. ముఖ్యంగా నలభై నిమిషాల కాలనాగు గ్రాఫిక్స్‌ ఈ చిత్రానికి హైలైట్‌. హారర్‌ కథాంశంతో ఆద్యంతం ఆకట్టుకునే ఈ చిత్రంలో పాము చేసే విన్యాసాలు, మనిషి పాముగా మారే సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో నిజమైన కోబ్రాను వాడాలనుకున్నాం.

అందుకోసం బ్యాంకాక్‌ కూడా వెళ్లాం. కానీ ఒరిజనల్‌ పామును షూటింగ్‌లో ఉపయోగించడానికి వీలుకాలేదు. దాంతో గ్రాఫిక్స్‌లో చూపించాం’’ అన్నారు ఎల్‌.సురేష్‌. ‘‘వెండితెరపై కాలనాగును చూపించాలన్న ఉద్దేశ్యంతో ఇండోనేషియాలో పాములకు శిక్షణ ఇచ్చే నిపుణులను కలిశాం. వారి దగ్గర 20 నుంచి 28 అడుగుల పొడవున్న కోబ్రాలు ఉన్నాయి. వాటిపై చిత్రీకరణ జరిపి కొన్ని సీన్లను గ్రాఫిక్స్‌లో ఉపయోగించాం’’ అని గ్రాఫిక్స్‌ నిపుణుడు వెంకటేష్‌ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రాజావెల్‌ మోహన్, సంగీతం: షబ్బీర్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top