ప్రశాంతంగా ముగిసిన నడిగర్‌ పోలింగ్‌

Nadigar Election Polling Ends Peacefully - Sakshi

సాక్షి, చెన్నై: దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్‌) ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మైలాపూర్‌లోని సెయింట్‌ ఎబాస్‌ బాలికల పాఠశాలలో ఓటింగ్‌ నిర్వహించగా.. కమల్‌హాసన్‌, ప్రకాష్‌రాజ్‌, కుష్భూ, రాధ, కేఆర్‌ విజయ సహా పలువురు నటులు, నటీమణులు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. చివరిక్షణంలో హడావుడి ప్రకటన కారణంగా పోలింగ్ మందకోడిగా సాగినట్టు నిర్వాహకులు తెలిపారు. 3వేల100 మంది సభ్యులున్న నడిగర్‌ సంఘానికి 2019-2022 మధ్యకాలానికి ఈ ఎన్నికలు జరిగాయి. మద్రాస్‌ హైకోర్టు తుదితీర్పు అనంతరం నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి

నాజర్‌ నేతృత్వంలోని పాండవార్‌ ప్యానెల్‌, భాగ్యరాజ్‌ నేతృత్వంలోని శంకర్‌దాస్‌ ప్యానెల్‌  నడిగర్‌ సంఘం ఎన్నికల్లో పోటీచేశాయి. జనరల్‌ సెక్రటరీ పదవికి హీరో విశాల్‌,  నిర్మాత గణేశ్‌తో తలపడ్డారు. కోశాధికారి పదవికి హీరో కార్తీ, హీరో ప్రశాంత్‌ బరిలో ఉన్నారు. నాజర్‌ గ్రూప్‌, భాగ్యరాజ్‌ గ్రూప్‌ మధ్య తీవ్రస్థాయిలో మాటలయుద్ధం జరగడంతో.. ఎన్నికల ప్రక్రియ రచ్చకెక్కింది. విశాల్‌ తమిళ వ్యక్తి కాదని, అతడిని నడిగర్ సంఘం నుంచి బయటకు పంపాలని భాగ్యరాజ్‌ సంచలన కామెంట్స్ చేయడంతో పోటీ వేడెక్కింది. ఈ క్రమంలో ఎన్నికల ప్రక్రియను ఆపాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. చివరినిమిషంలో హైకోర్టు అనుమతి ఇవ్వడంతో పోలింగ్ జరిగింది. పోస్టల్‌ బ్యాలెట్‌ అందకపోవడంతో ముంబైలో దర్బార్‌ షూటింగ్‌లో ఉన్న తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. దీనిపై ట్విట్టర్ వేదికగా ఆయన తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. అయితే పదిరోజుల ముందే పోస్టల్ బ్యాలెట్లు పంపామని, తపాలా శాఖ ఆలస్యం కారణంగా అవి అందలేదని నటి కుష్భూ తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top