నటి మౌసుమీ చటర్జీ కుమార్తె మృతి

Moushumi Chatterjees Daughter Payal Dies With Diabetes  - Sakshi

ప్రముఖ బెంగాలీ నటి  మౌసుమీ చటర్జీ కుమార్తె పాయల్‌ (45) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చనిపోయినట్లు బాలీవుడ్‌ హంగామా అనే వెబ్‌సైట్‌ తెలిపింది. చిన్నతనం నుంచే పాయల్‌కు మధుమేహ వ్యాధి ఉందని ఆ నివేదిక పేర్కొంది. కాగా  మౌసుమీ చటర్జీ, ఆమె భర్త జయంతీ ఛటర్జీలు తన కూతురి ఆరోగ్య పరిస్థితి దృష్యా సంరక్షకులుగా తమకు అవకాశం కల్పించాలని బాంబే హైకోర్టులో నవంబర్‌ 2018లో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌లో పాయల్‌ ఆరోగ్య పరిస్థితిని ఆమె భర్త డిక్కీ సిన్హా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. పాయల్‌ తల్లిదండ్రుల పిటిషన్‌ ప్రకారం..పాయల్‌కి అందిస్తున్న ఫిజియోథెరపీ చికిత్సను అల్లుడు మధ్యలోనే ఆపేశాడని,  వైద్యుడికి చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదని తెలిపారు.

పాయల్‌ వ్యాధి దృష్యా డాక్టర్‌ ఆమెకు సూచించిన ఆహార నియమాలను డిక్కీ నిర్లక్ష్యం చేశాడని తెలిపారు. పాయల్‌ను చూడడానికి కూడా ఆమె భర్త అనుమతిచ్చేవాడు కాదని తెలిపారు. చట్టబద్దంగా పాయల్‌ తన భార్య కనుక తల్లిదండ్రులకంటే ఆమెపై తనకే ఎక్కువ హక్కుంటుందంటూ డిక్కీ సిన్హా వాదించేవాడని తెలిపారు. కాగా మౌసుమీ బెంగాలీ చిత్రం బాలికా బధు చిత్రంతో అరంగేట్రం చేసింది. ఏప్రిల్ 26 1953న కలకత్తాలో జన్మించిన ఆమెకు 14ఏళ్ల ప్రాయంలోనే వివాహం జరిగింది. బెంగాలి దర్శకుడు తరుణ్ మజుందార్ ఆమె బాల్య వివాహాన్ని నేపథ్యంగా తీసుకొని ‘బాలికా బధు’ (1967-బాల్యవధువు) చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా బెంగాల్‌లో 75 వారాలకు పైగా ఆడి ప్లాటినం జూబ్లీ చేసుకుంది. ఆ తర్వాత మౌసుమీ చటర్జీ బెంగాలీతో పాటు హిందీలోనూ అగ్ర తారగా వెలుగొందారు. రాజేష్ ఖన్నా, శశి కపూర్, ధర్మేంద్ర, జితేంద్ర, సంజీవ్ కుమార్‌లతో సహా అప్పటి అగ్రశ్రేణి నటులతో ఆమె నటించింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top