మా బావ ప్రభాస్ నిరూపించాడు : మోహన్ బాబు | mohan babu aplauds bahubali2 team | Sakshi
Sakshi News home page

మా బావ ప్రభాస్ నిరూపించాడు : మోహన్ బాబు

May 3 2017 8:54 PM | Updated on Sep 5 2017 10:19 AM

మా బావ ప్రభాస్ నిరూపించాడు : మోహన్ బాబు

మా బావ ప్రభాస్ నిరూపించాడు : మోహన్ బాబు

బాహుబలి 2 సినిమాకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు కొనసాగుతున్నాయి.

బాహుబలి 2 సినిమాకు సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తెలుగు, తమిళ, హిందీ స్టార్స్ బాహుబలి యూనిట్పై అభినందనల జల్లు కురిపిస్తుండగా, తాజాగా సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా స్పందించారు. హీరోలు ప్రభాస్, రానా, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత విజయేంద్రప్రసాద్‌లను ప్రశంసలతో ముంచెత్తారు.

‘బావా బాహుబలి.. పూర్వం దేశాన్ని రాజులు పరిపాలించారు. ఇప్పుడు ప్రపంచాన్నే ‘రాజులు’ పరిపాలిస్తున్నారని మా బావ ప్రభాస్ రాజు నిరూపించాడు. నా సంతోషానికి అవధుల్లేవు. మీ నాన్నగారు ఎక్కడున్నా ఆయన ఆశీస్సులు నీకున్నాయని నమ్ముతున్నాను. ఇక్కడ మీ అమ్మగారు బిడ్డ విజయాన్ని చూసి గర్విస్తుందని భావిస్తున్నాను. ఈ సంవత్సరమైనా ఒక ఇంటివాడివై అమ్మ కోరికను, ఈ బావ కోరికను తీర్చగలవని ఆశిస్తున్నాను. విజయీభవ.’ అంటూ ప్రభాస్ను పొగుడుతూనే ఈ ఏడాదైనా వివాహం చేసుకోవాలంటూ సూచించారు.

‘డియర్ శోభు యార్లగడ్డ-ప్రసాద్ దేవినేని, నిర్మాతలు లేనిదే సినిమా పరిశ్రమ లేదు. ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసల కోర్చి మీరు ‘బాహుబలి’ ద్వారా ఇంతటి గొప్ప విజయాన్నిఅందుకున్నందుకు నాతో పాటుగా సినిమా జగత్తు యావత్తూ గర్వపడుతున్నది. ప్రియమైన రాణా.. బాహుబలిలో నీ నటన అద్భుతం. విజయోస్తు..దిగ్విజయోస్తు..కీర్..మరకతమణిగా..ఎంఎం క్రీమ్‌గా..కీరవాణిగా..ఆ వాణి నీ శరీరంలో ప్రవహించి బాహుబలికి అద్భుతమైన సంగీతాన్ని అందించినందుకు ఆత్మబంధువుగా గర్విస్తున్నాను. శ్రీవల్లీ సమేతుడైవై పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను.’

‘ప్రియమైన రాజమౌళి.. భారతదేశంలో తెలుగు ప్రజలు ఉన్నారని అన్నయ్య ఎన్.టి రామారావు గారి ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఒక గొప్ప దర్శకుడు ఉన్నాడని బాహుబలి ద్వారా నువ్వు చాటి చెప్పావు. నీ తల్లిదండ్రుల ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలని, అర్ధాంగి ‘రమ’ ప్రేమానురాగాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనసా వాచా కోరుకుంటున్నాను.. ప్రియమైన ప్రసాద్.. బాహుబలి విజయంతో 'విశ్వ విజయేంద్రప్రసాద్‌'గా సార్థక నామధేయుడివి అయ్యావు. ఒక తెలుగు రచయితగా విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినందుకు ఆత్మీయుడిగా గర్విస్తున్నాను’ అని బాహుబలి2 టీంను మోహన్ బాబు అభినందనలతో ముంచెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement