సినీ నిర్మాత మోసం కేసులో ట్విస్ట్ | Missing producer 'Vendhar Movies' Madhan arrested from Tirupur | Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత మోసం కేసులో ట్విస్ట్

Nov 25 2016 10:06 AM | Updated on Sep 4 2017 9:06 PM

మదన్‌ పెళ్లినాటి ఫొటో(పైల్‌)

మదన్‌ పెళ్లినాటి ఫొటో(పైల్‌)

మదన్‌ మొదటి భార్య సింధూజ, రెండో భార్య సుమలతను రప్పించారు. ఆ సమయంలో వర్షా కూడా మూడో భార్యనని అక్కడికి రావడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.

చెన్నై(తమిళసినిమా): ఆరు నెలల పాటు చెన్నై పోలీసులను ముప్పతిప్పలు పెట్టి ఎట్టకేలకు వారి వలలో పడ్డ సినీ నిర్మాత వేందర్‌ మూవీస్‌ మదన్‌ను పోలీసులు ఏడు రోజుల పాలు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న విషయం తెలిసిందే. చెన్నై, ఎగ్మూర్‌లోని పాత కమిషనర్‌ కార్యాలయంలో మదన్‌ను 300 ప్రశ్నలతో విచారిస్తున్నారు. ఈ విచారణలో పలు ఆసక్తికరమైన అంశాలు బయట పడుతున్నాయి. వైద్య విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానని చెప్పి వారి తల్లిదండ్రుల నుంచి రూ.85 కోట్లు మోసానికి పాల్పడిన మదన్‌ ఆ డబ్బును ఏమి చేశారు? ఎవరెవరికిచ్చారన్న వివరాలను బయట పెడుతున్నట్లు పోలీసుల సమాచారం.

తన ఇద్దరు భార్యాలకు, ఓ నిర్మాతకు, నటుడికి డబ్బు ఇచ్చినట్లు మదన్‌ చెప్పినట్లు సమాచారం. ఇంకా చాలా ఆస్తులను బినామీల పేర్లపై కూడబెట్టినట్లు చెప్పారట. వారి నుంచి డబ్బును తిరిగి వసూలు చేసి బాధితులకు చెల్లించే చర్యలను పోలీసులు తీసుకోనున్నారు. అదే విధంగా మదన్‌ మొబైల్‌ ఫోన్‌ ద్వారా ఆయనకు 20 మంది మహిళలతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసుల విచారణలో బట్టబయలైంది. వారిని విచారించడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో మెడికల్‌ సీట్లు ఇప్పిస్తానని చెబుతూ 123 మంది వద్ద రూ.85 కోట్లు మోసగించిన కేసులో ఆరు నెలలుగా తప్పించుకుని తిరుగుతున్న మదన్‌ను తిరుపూర్‌లో మంగళవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు చెన్నై కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది.

ఇదిలావుండగా మంగళవారం సెంట్రల్‌ క్రైంబ్రాంచ్‌ పోలీసులు విచారణ నిమిత్తం మదన్‌ మొదటి భార్య సింధూజ, రెండో భార్య సుమలతను రప్పించారు. ఆ సమయంలో వర్షా కూడా మూడో భార్యనని తెలిపి అక్కడికి రావడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement