తోలు తీస్తామన్న లీడర్లు ఎక్కడ?.. బాధితురాలికి సత్యదేవ్‌తో వివాహం జరిపించాల్సిందే: మార్గాని భరత్‌ | YSRCP Margani Bharat Warn Rajahmundry TDP MLA Aide Incident | Sakshi
Sakshi News home page

తోలు తీస్తామన్న లీడర్లు ఎక్కడ?.. బాధితురాలికి సత్యదేవ్‌తో వివాహం జరిపించాల్సిందే: మార్గాని భరత్‌

Jun 14 2025 1:04 PM | Updated on Jun 14 2025 1:36 PM

YSRCP Margani Bharat Warn Rajahmundry TDP MLA Aide Incident

సాక్షి, తూర్పుగోదావరి: ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న లీడర్లు.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారని మాజీ ఎంపీ మార్గాని భరత్ ప్రశ్నించారు. రాజమండ్రిలో ఓ దళిత బాలికకు అన్యాయం జరిగితే చివరకు మహిళా కమిషన్‌ కూడా స్పందించని స్థితిలో ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. శనివారం ఈ ఉదంతంపై ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 

‘‘దళిత బాలికకు ఎంత అన్యాయం జరిగితే మహిళ కమిషన్ ఎందుకు స్పందించలేదు. ఈ వ్యవహారంపై చంద్రబాబు లోకేష్, పవన్ కల్యాణ్‌ ఎందుకు స్పందించడం లేదు. ఆడపిల్లకు అన్యాయం జరిగితే తోలు తీస్తామన్న ఆ నాయకులు ఎక్కడికి వెళ్లిపోయారు?. ఏపీలో ఇలాంటి ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తోంది. వెలుగులోకి రానివి ఇంకెన్ని ఉన్నాయో?

.. 40 రోజులుగా బాధితురాలు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎందుకు కేసు కట్టలేదు. కలెక్టర్ ఆదేశించే వరకు డీఎస్పీ కూడా ఇన్వాల్వ్ కాకపోవటం దారుణం. ఎవరి రాజకీయ ఒత్తిడితో పట్టించుకోలేదా?. ఈవీఎం ఎమ్మెల్యే ఒత్తిడి చేశారా?. ఈ వ్యవహారం రాష్ట్ర డీజీపీని కలుస్తాం. ఈ ప్రభుత్వం స్పందించి మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని బాధితులానికి న్యాయం చేయాలి. బాధితురాలికి సత్యదేవ్‌తో వివాహం జరిపించాలి’’ అని మార్గాని భరత్‌ డిమాండ్‌ చేశారు. 

తల్లికి వందనం మోసంపై..
మరోవైపు.. తల్లికి వందనం పథకం పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసంపైనా ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 89 లక్షల మంది విద్యార్థులున్నారు. తల్లికి వందనం కోసం రూ.13,000 కోట్లు ఖర్చు అవుతుంది. బీపీఎల్‌లో ఉన్న వారందరికీ ఈ పథకం వర్తించాలి. అలాంటప్పుడు ఎంతమందికి తల్లికి వందనం లేకుండా చేస్తున్నారు?.  వైఎస్సార్సీపీ సానుభూతి పరులను ఆ జబితా నుంచి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. తల్లికి వందనం గతేడాది నిధులు విద్యార్థులకు బకాయి ఉన్నారు. ఎంతమంది విద్యార్థులున్నారో అందరికీ తల్లికి వందనం నిధులు జమ చేయాలి. లేదంటే వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుంది’’ అని భరత్‌ హెచ్చరించారు.

కేసు ఏంటంటే..
బాధితురాలు, ఆమె తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మోరంపూడికి చెందిన పులవర్తి సత్యదేవ్‌ ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి దళిత బాలికను మోసం చేశాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు సత్యదేవ్‌ వద్దకు వెళ్లి తమ కుమార్తెను వివాహం చేసుకోవాలని అడిగారు. తాను స్వామి మాలలో ఉన్నానని చెప్పాడు. ఆపై ధవళేశ్వరంలోని సీఈఎం ఆసుపత్రిలో గత ఏడాది డిసెంబర్‌ 17న అబార్షన్‌ చేయించారు. ఆ తరువాత బాలికను వివాహం చేసుకోవడానికి సత్యదేవ్‌ నిరాకరిస్తూ వస్తున్నాడు. గట్టిగా నిలదీస్తే.. కులం తక్కువ దానివంటూ దూషించాడు. ఈ నేపథ్యంలో బాలిక, తల్లిదండ్రులు బొమ్మూరు సీఐకి ఫిర్యాదు చేయగా ఇప్పటివరకూ కేసు నమోదు చేయలేదు. నిందితుడు సత్యదేవ్‌ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుచరుడు కావడంతో పోలీసులు కేసు నమోదు చేయకుండా జాప్యం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. వివాహం చేసుకోమని అడిగితే.. పెద్ద సమక్షంలో సెటిల్‌మెంట్‌ కోసం ప్రయత్నిస్తున్నాడని మండిపడుతోంది. ఈ ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement