నాకు ఖైదీ.. విజయ్‌కి గీత గోవిందం

Megastar Chiranjeevi Speech At Geetha Govindam Success Celebrations - Sakshi

చిరంజీవి

‘‘ఈ ఫంక్షన్‌లో పాలు పంచుకోవడం నా బాధ్యత. ఆ సంతృప్తి కోసమే ‘గీత గోవిందం’ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌కి వచ్చా. ఓ సినిమా బాగుందంటే అది చిన్న బడ్జెటా? పెద్ద బడ్జెట్‌ సినిమానా అని ఆలోచించరు. కంటెంట్‌ బాగుంటే మీ (ప్రేక్షకులు) దృష్టిలో అన్నీ పెద్ద బడ్జెట్‌ సినిమాలే’’ అని చిరంజీవి అన్నారు. విజయ్‌ దేవరకొండ, రష్మికా మండన్నా జంటగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గీత గోవిందం’. అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ సినిమా ఇటీవల విడుదలైంది.

ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘రెండేళ్లుగా చూస్తుంటే తెలుగు సినీ పరిశ్రమ చాలా సంతోషం, ఉత్సాహం, ప్రోత్సాహంతో ముందుకెళుతోందన్నది వాస్తవం. తెలుగు ప్రేక్షకుల ఆదరణ, అభిమానానికి మేం ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటాం. ఏం సినిమా తీస్తున్నారని అరవింద్‌గారిని నేను అడిగినప్పుడు ‘గీత గోవిందం’ చేస్తున్నాను. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో విజయ్‌ అగ్రెసివ్‌ పాత్ర చేశాడు.. ‘గీత గోవిందం’ సినిమాలో చాలా సాఫ్ట్‌. ఈ పాత్రని ప్రేక్షకులు ఎంతవరకూ ఆదరిస్తారనే చిన్న డౌట్‌ వచ్చినప్పుడు ‘విజేత’ గుర్తొచ్చింది.

‘ఖైదీ, అడవిదొంగ, చట్టంతో పోరాటం, చట్టానికి కళ్లు లేవు’ వంటి సినిమాలతో యాక్షన్‌ హీరోగా నేను దూసుకెళుతున్న టైమ్‌లో.. ‘విజేత’ ఓ ఫ్యామిలీ ఓరియంటెడ్‌ మూవీ. ఈ పాత్రలో నన్ను ఎంతవరకూ ఆదరిస్తారనే చిన్న మీమాంస నాకు, అరవింద్‌గారికి ఉండేది. ఆ సినిమా అన్ని తరగతుల ప్రేక్షకులకు నన్ను దగ్గర చేసి, ఆల్‌ క్లాస్‌ హీరో అనిపించింది. ‘గీత గోవిందం’ సినిమా కూడా విజయ్‌ని ఆల్‌ క్లాస్‌ హీరో అనిపించింది. విజయ్‌కి ఇది ల్యాండ్‌ మార్క్‌ ఫిల్మ్‌. నీకు చాలా భవిష్యత్‌ ఉంది. ఈ సినిమాతో నీకు స్టార్‌ స్టేటస్‌ వచ్చింది. 1978 నుంచి నేను 30 సినిమాలు చేసినా సరే ‘ఖైదీ’ సినిమా నాకు స్టార్‌ హీరో స్టేటస్‌ ఇచ్చింది. ఇండస్ట్రీలోని టాప్‌స్టార్స్‌లో విజయ్‌ ఒక్కడు అయినందుకు స్వాగతిస్తున్నా. మన ఇండస్ట్రీకి దక్కిన మరో అరుదైన స్టార్‌ విజయ్‌ దేవరకొండ’’ అన్నారు.

ఇదేం న్యాయం
పైరసీ గురించి చిరంజీవి మాట్లాడుతూ – ‘‘గీత గోవిందం’ సినిమా కంటెంట్‌ దాదాపు గంటన్నర్ర లీకైపోయింది.. ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు అరవింద్‌. ఆయనకు ఊరట కలిగించేందుకు నేను ఓ మాట చెప్పా. పవన్‌ కల్యాణ్‌ సినిమా ‘అత్తారింటికి దారేది’ కంటెంట్‌ లీకైనా సక్సెస్‌కి ఏమాత్రం ఇబ్బంది కలగలేదు. ‘గీత గోవిందం’ సినిమా కూడా ‘అత్తారింటికి దారేది’ అంత హిట్‌ అవుతుందని సెంటిమెంట్‌గా అనుకోమని చెప్పా.

ఇన్ని కోట్లు వెచ్చించి ఓ సినిమా తీసిన తర్వాత ఆ కంటెంట్‌ని కుర్రతనంగానో, వేరే దురుద్దేశాలు ఉండో దాన్ని చోరీ చేసి ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకోవడం ఏం న్యాయం? సినిమా పరిశ్రమ కొన్ని వేలమందికి, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న మాతృసంస్థ.. తల్లిలాంటిది. ఇక్కడ పనిచేసే టెక్నీషియన్స్‌ దాన్ని దొంగలించి ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకోవడమంటే ఎంత ద్రోహం చేస్తున్నారంటే.. తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లే అని తెలుసుకోవాలి. ఈరోజు వారంతా జైలులో ఊసలు లెక్కపెడుతున్నారు. ఈ దుస్థితి కావాలా మీకు? మీ తల్లితండ్రులకు బాధ కలిగించాలా? ఇండస్ట్రీలో ఉండే ప్రతి ఒక్కర్ని కూడా నేను హెచ్చరిస్తున్నా. కింది స్థాయి టెక్నీషియన్స్‌ ఎవరైనా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే అది మీ తల్లిపాలు తాగి రొమ్మును గుద్దినట్లే అని గుర్తుంచుకోండి’’ అన్నారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ– ‘‘గీత గోవిందం’ లాస్ట్‌ రీల్‌ రీ–రికార్డింగ్‌ టైమ్‌లో కంటెంట్‌ లీకు అయిందని తెలిసింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రేక్షకులు ఇంతటి విజయ పతాకం ఎగురవేస్తుంటే మేం చూసి ఆనందిస్తున్నాం. పరశురామ్‌ గ్రేట్‌ రైటర్‌. చిరుకి, విజయ్‌కి కొన్ని కామన్‌ పోలికలు ఉన్నాయి. విజయ్‌.. ఈ సినిమాతో నువ్వు స్టార్‌ అయ్యావు’’ అన్నారు.

చిత్ర నిర్మాత ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ–  ‘‘ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే కారణం బన్నీనే (అల్లు అర్జున్‌). అరవింద్‌ గారికి రెండు సక్సెస్‌ సీక్రెట్స్‌ ఉన్నాయి. సినిమాకి ఎంత ఖర్చు అవుతుంది? ఇంకా బాగా రావాలంటే ఎంత ఖర్చు పెట్టాలి?.. ఇదే ఆయన మొదటి సక్సెస్‌ ఫార్ములా. రెండో సక్సెస్‌ ఫార్ములా ఏంటంటే.. డైరెక్టర్‌ అనుకున్నట్లు సినిమా వచ్చేవరకూ, ఆయనకు సంతృప్తి ఇచ్చే వరకూ తీయిస్తూనే ఉంటారు’’ అన్నారు.

పరశురామ్‌ మాట్లాడుతూ– ‘‘మా సినిమాని ఇంత పెద్ద హిట్‌ చేసి, నాకు పునర్జన్మను ప్రసాదించిన ప్రేక్షక దేవుళ్లకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. చిరంజీవి సార్‌.. మీరు మా సినిమా చూసి నాతో మాట్లాడిన మాటలు నాకు భగవద్గీత లాంటివి. ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్‌లేని విజయ్‌ హీరోగా ఎదుగుతూ పైకొస్తుంటే ప్రోత్సహిస్తున్న చిరంజీవిగారికి హ్యాట్సాఫ్‌’’ అన్నారు. ‘‘ఇక్కడ మనం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ చేసుకుంటున్నాం. కేరళ పరిస్థితి బాగోలేదని మొన్నే చిరంజీవిగారు, చరణ్, బన్నీ చేయూతనిచ్చారు. అరవింద్‌గారి అనుమతితో మా బ్యానర్‌ నుంచి ఓ పది లక్షలు ఇవ్వనున్నామని ఇక్కడ ప్రకటిస్తున్నా. ‘అర్జున్‌రెడ్డి’తో కాదు ‘గీత గోవిందం’ సినిమాతో స్టార్‌ హీరో స్థాయికి వెళ్లాడు విజయ్‌’’ అన్నారు నిర్మాత ‘దిల్‌’ రాజు. ‘‘ఈ సినిమా సక్సెస్‌ వెనకాల అరవింద్‌గారు, పరశురామ్‌గారు, ‘బన్నీ’వాసుగారు ఉన్నారు. జస్ట్‌ నేను యాక్టర్‌లా నా జాబ్‌ చేశానంతే’’ అన్నారు విజయ్‌ దేవరకొండ.  సీనియర్‌ నటి అన్నపూర్ణ, నిర్మాతలు ఎన్వీ ప్రసాద్, శానం నాగఅశోక్‌కుమార్, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్, కెమెరామేన్‌ మణికందన్‌ తదితరులు పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top