
విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయ్, బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇర్ఫాన్‌ఖాన్ అనారోగ్యంపై మీడియాలో వస్తున్న కథనాలపై ట్విటర్ వేదికగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ఏదో తెలియని జబ్బుతో బాధపడుతున్నఇర్ఫాన్ ఆ వ్యాధి గురించి తెలిసిన తరువాత తనే చెబుతానని సోమవారం ట్విటర్‌లో పేర్కొన్నాడు. అరుదైన వ్యాధి అని, దాని గురించి ఇంకా వివరాలు తెలియలేదని, ఇంకో వారం పది రోజుల్లో వివరాలు ప్రకటిస్తానని పోస్ట్ చేశాడు.
అయితే దీనిపై మీడియా తనకు తోచిన విధంగా కథనాలు ప్రచురిస్తుండటంతో నటుడు మనోజ్ బాజ్‌పేయ్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ...‘‘అందరినీ దయ చేసి వేడుకుంటున్నాను, మీరు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేయకండి. తన వైపు నుంచి అధికారికంగా విషయం వెల్లడించేవరకు వేచి చూడండి. తను ఆ వ్యాధిని కనిపెట్టి, ఎదురించి చాంపియన్‌లా తిరిగివస్తాడు. అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థించండి. మనమంతా అతని ప్రైవసీని గౌరవిద్దాం’’ అని ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.