హీరోలూ... పారితోషికం తగ్గించుకోండి! | male Hollywood stars should take pay cut | Sakshi
Sakshi News home page

హీరోలూ... పారితోషికం తగ్గించుకోండి!

May 15 2018 1:27 AM | Updated on May 15 2018 1:27 AM

male Hollywood stars should take pay cut - Sakshi

సల్మా హయక్‌

‘‘సినిమా బడ్జెట్‌ 10 మిలియన్‌ డాలర్లు అనుకుందాం. అందులో 9.7 శాతం హీరోలు పట్టుకుపోతుంటే ఇక మాకేం మిగులుతుంది’’ అంటున్నారు హాలీవుడ్‌ తార సల్మా హయక్‌. ఫ్రాన్స్‌ దేశంలో జరుగుతోన్న కాన్స్‌ చలన చిత్రోత్సవాల్లో ఆమె ఈ విధంగా పేర్కొన్నారు. స్త్రీ–పురుష సమానత్వం గురించి ఈ ఉత్సవాల్లో పలువురు ఇప్పటికే మాట్లాడారు. చిత్రసీమలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులకు వ్యతిరేకంగా మొదలైన ‘మీటూ’, ‘టైమ్‌ ఈజ్‌ అప్‌’ ఉద్యమానికి మద్దతు పలుకుతూ 82 మంది మహిళలు కాన్స్‌ సాక్షిగా నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ఇదే వేదిక సాక్షిగా హీరో, హీరోయిన్ల పారితోషికం గురించి సల్మా హయక్‌ మాట్లాడారు. సినిమాకి పెడుతున్న బడ్జెట్‌లో దాదాపు 9 శాతానికి పైగా హీరోలు తీసేసుకుంటే.. ఇక హీరోయిన్లకు ఎంత దక్కుతుందన్నారామె. ఇంకా సల్మా హయక్‌ మాట్లాడుతూ – ‘‘హీరోలకు సమానంగా హీరోయిన్లకూ పారితోషికం దక్కాలి. అది జరగాలంటే హీరోయిన్లకు కూడా నిర్మాతలు ఎక్కువ పారితోషికం ఇస్తే సరిపోదు. హీరోలు తమ పారితోషికం తగ్గించుకుంటే అప్పుడు ఆటోమేటిక్‌గా సమానం అవుతుంది’’ అన్నారు.

అటు హీరోకీ ఇటు హీరోయిన్‌కీ ఎక్కువ పారితోషికం ఇస్తే.. ఇక నిర్మాతకు ఏం మిగులుతుంది? దానికి బదులు హీరోలే పారితోషికం తగ్గించుకుంటే బాగుంటుందన్నది సల్మా అభిప్రాయం. పాయింటే కదా. ఆ సంగతలా ఉంచితే... పలువురు నటీమణుల పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన నిర్మాత హార్వీ వెయిన్‌స్టీన్‌ తనను కూడా హెరాస్‌ చేశాడని అన్నారామె. సల్మా నటించి, నిర్మించిన చిత్రం ‘ఫ్రిడా’ (2002). ‘‘ఈ సినిమా అప్పుడు హార్వీ వెయిన్‌స్టీన్‌ ఇచ్చిన అడ్వాన్స్‌ని తిరస్కరిస్తే నా మోకాలి చిప్పలను పగలగొడతానని బెదిరించాడు. ఇలాంటివాళ్లను తరిమికొట్టాలి’’ అని సల్మా ఘాటుగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement