
‘అంతరిక్షంలో అణువణువు గాలిస్తా. నింగిలోకి తొంగి చుస్తా. గ్రహాల గమనాన్ని గమనిస్తా’ అంటున్నారు హీరో మాధవన్. అక్కడితో ఆగలేదండోయ్. క్రయోజినిక్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్‌ఎల్వీ) అంటూ తన సన్నిహితుల దగ్గర రాకెట్ భాష మాట్లాడుతున్నారట. ఇదంతా చదువుతుంటే మాధవన్ సినిమాలు మానేసి, సైంటిస్ట్‌గా మారబోతున్నాడేమో అనుకుంటున్నారా? నిజమే. అయితే సినిమాలు మానేసి కాదు. సినిమా కోసం సైంటిస్ట్ అయ్యారు.
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌లో మాధవన్ నటించబోతున్నారు. 1970వ దశాబ్దంలో నారాయణన్ ఇస్రోలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఆ తర్వాత ఆయనపై కొన్ని అభియోగాలు నమోదయ్యాయి. వాటికి సంబంధించిన కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఈ విషయం పక్కన పెడితే... ఈ బయోపిక్‌లో నారాయణన్ జీవితంలో 27–78 ఏళ్ల వయసులో జరిగిన సంఘటనలను చూపించనున్నారట. ఈ సినిమా మాధవన్‌కి సవాలే.
ఎందుకంటే, ఫార్టీ ప్లస్ ఉన్న మాధవన్ 27 ఏళ్ల యువకుడిగానూ, 78 ఏళ్ల వృద్ధుడిగానూ కనిపించాలి. ‘‘కెరీర్‌లో ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ రోల్‌లో నటించేందుకు ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నాను. ఏజ్ వైజ్‌గా డిఫరెంట్ షేడ్స్ చూపించాలి. ఈ విషయంలో దేవుడే నాకు హెల్ప్ చేయాలి. వెయిట్ గురించి బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ను టిప్స్ అడిగా. ముందుగా బరువు పెరిగిన సీన్స్‌ను తీయమని సలహా ఇచ్చారు’’ అని పేర్కొన్నారు మాధవన్. ప్రస్తుతం తెలుగులో నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సవ్యసాచి’ చిత్రంలో మాధవన్ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.