నేనున్నానని తెలిసింది! | kovera u movie updates | Sakshi
Sakshi News home page

నేనున్నానని తెలిసింది!

Dec 28 2018 6:00 AM | Updated on Dec 28 2018 6:00 AM

kovera u movie updates - Sakshi

కొవెర

‘‘ఈ సినిమా అసలు రిలీజ్‌ అవుతుందా? లేదా అనుకున్నాను. మంచి రిలీజ్‌ బజ్‌ వచ్చింది ఇప్పుడు. ప్రేక్షకులకు నేనున్నానని తెలిసింది. తెలియనప్పుడే చాలా ట్రై చేశాను. ఇప్పుడు మరింత గట్టిగా ట్రై చేస్తాను’’ అన్నారు కొవెర. ఆయన హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమా ‘యు’. ‘కథే హీరో’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రం ఈరోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా కొవెర మాట్లాడుతూ – ‘‘ప్రముఖ కథారచయిత, డైరెక్టర్‌ విజయేంద్ర ప్రసాద్‌గారి దగ్గర నాలుగేళ్లు వర్క్‌ చేశాను. ఆయనతో పని చేయడం వల్ల నా ఆలోచనా పరిధి పెరిగింది. దాదాపు 16 మంది హీరోలకు కథలు వినిపించాను.

ఇప్పుడు ఈ సినిమాకు నిర్మాతగా, ప్రొడ్యూసర్‌గా, డైరెక్టర్‌గా చేయడంతో పాటు హీరోగా నటించాను. విజయేంద్రప్రసాద్‌గారు ఇన్‌పుట్స్‌ ఇచ్చారు. ప్రతి క్రైమ్‌ వెనక డబ్బు ఒక ప్రధాన కారణంగా ఉంటుందని నమ్ముతాను నేను. ఈ సినిమా కథనం అండర్‌వరల్డ్‌లో జరిగే ఆర్థిక లావాదేవీల అంశాల ఆధారంగా తెరకెక్కించాను. ఇంతకుముందు ఈ సినిమాను మరో ఇద్దరు హీరోలకు వినిపించాను. మూడేళ్ల క్రితం అఖిల్‌కు కూడా ఓ కథ చెప్పాను. నేను కథలు రాస్తాను. అమ్ముతాను కూడా. అల్లు శిరీష్‌కి ఓ స్టోరీ అమ్మాను. ప్రస్తుతం హీరోగా ఒకటి, డైరెక్టర్‌గా మరొక అవకాశం వచ్చింది. ఈ సినిమా రిజల్ట్‌ని బట్టి నెక్ట్స్‌ ప్రాజెక్ట్స్‌ కమిట్‌ అవుదామని అనుకుంటున్నాను. కథలు రాయడం మాత్రం ఆపను’’ అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement