డిసెంబర్‌ 1న భారత్‌ బంద్‌.. పద్మావతి విడుదల అయ్యేనా!

Karni Sena calls for Bharat Bandh against Padmavati  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’  సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ.. ఈ సినిమా వివాదం మరింత ముదురుతోంది. ఈ సినిమాకు వత్యిరేకంగా రాజ్‌పుత్‌ వర్గీయుల ఆధ్వర్యంలోని కర్ణిసేన ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. డిసెంబర్‌ 1న పద్మావతి సినిమా విడుదల కావాల్సి ఉండగా.. సినిమా విడుదలకు వ్యతిరేకంగా 'భారత్‌ బంద్‌'కు కర్ణిసేన పిలుపునిచ్చింది. ఈ సినిమాను విడుదలను ఆపాల్సిందేనని, ఒకవేళ సినిమాను విడుదల చేస్తే.. తీవ్ర పరిణామాలు తప్పవని కర్ణిసేనకు చెందిన లోకేంద్ర సింగ్‌ కల్వి హెచ్చరించారు. ఒకవేళ 'పద్మావతి' సినిమా విడుదలైతే.. నిరసన జ్వాలలతో దేశం తగలబడుతుందని, దీనిని అడ్డుకుంటే అడ్డుకోండి అని ఆయన సవాల్‌ విసిరారు. మరోవైపు బెంగళూరులో సినిమాకు వ్యతిరేకంగా కర్ణిసేన పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది.

రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ’పద్మావతి’ సినిమాను వివాదాలు విడిచిపెట్టడం లేదు.  ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమాను నిషేధించాలంటూ జోరుగా రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదల కాకుండా నిషేధించాలంటూ హర్యానా మంత్రి విపుల్‌ గోయెల్‌ ఇప్పటికే కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు. డిసెంబర్‌ 1న  విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ మరోవైపు జోరుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్‌ కపూర్, అల్లా వుద్దీన్‌ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్‌ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్‌లు ఆరోపిస్తున్నారు. అయితే, తమ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఇప్పటికే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top