
రూ.100 కోట్లు ఇచ్చినా సరే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali)తో కలిసి పని చేసే ప్రసక్తే లేదంటున్నాడు మ్యూజిక్ డైరెక్టర్ ఇస్మాయిల్ దర్బార్ (Ismail Darbar). వీరిద్దరూ 'హమ్ దిల్ దే చుకే సనమ్', 'దేవదాస్' సినిమాలకు కలిసి వర్క్ చేశారు. ఈ రెండు చిత్రాల ఘన విజయంలో ఇస్మాయిల్ సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. కలిసి బ్లాక్‌బస్టర్లు కొట్టిన వీళ్లిద్దరి మధ్య తర్వాత పెద్ద అగాధమే ఏర్పడింది. దాని గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇస్మాయిల్ మాట్లాడాడు.
భయమెందుకు?
'హీరామండి ప్రాజెక్ట్ ఈ మధ్య అనుకుంది కాదు. రెండున్నర దశాబ్దాల కిందటే ఆ ప్రాజెక్ట్‌కు పునాది పడింది. ఆ సమయంలో ఓ వార్తాపత్రికలో హీరామండి ప్రాజెక్ట్‌కు నేను అందించే సంగీతమే వెన్నెముకలా నిలవనుంది అని రాశారు. ఇది నేనే పత్రికలో వేయించానని సంజయ్ అనుమానించాడు. పిలిచి నిలదీశాడు. నిజంగా నాకు అలాంటి ఉద్దేశమే ఉంటే నీకు భయపడాల్సిన అవసరమే లేదు. నీ ముందు కూడా అదే చెప్తాను. అయినా పేపర్‌లో అది ఎవరు రాశారో నాకసలు తెలీనే తెలియదు అని చెప్పాను.
నేనే బ్యాక్‌బోన్
సరే, వదిలెయ్ అని అసహనం వ్యక్తం చేశాడు. ఆయన వదిలెయ్ అన్నది ఈ విషయాన్ని కాదు, ప్రాజెక్ట్ అని నాకు తర్వాత అర్థమైంది. తనతో చెప్పించుకోవడం దేనికని నేనే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా! తర్వాత.. హమ్ దిల్ దే చుకే సనమ్, దేవదాస్ సినిమాలకు నేనే వెన్నెముక అని సంజయ్ పీఆర్ టీమ్‌కు కూడా తెలిసొచ్చింది. కానీ సంజయ్‌కు ఇగో ఎక్కువ. నా కష్టానికి కూడా తనే క్రెడిట్ తీసుకుంటాడు. అందుకే తనతో పనిచేయకూడదనుకున్నాను. తను రూ.100 కోట్లు ఇచ్చినా సరే ఆయన సినిమాకు పని చేయను' అని ఇస్మాయిల్ చెప్పుకొచ్చాడు.
చదవండి: పగలూరాత్రి తేడా లేకుండా మందు తాగా.. ఆరుగురితో డేటింగ్