తమిళ హీరో శివ కార్తికేయన్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారు అయిందనే టాక్ తెరపైకొచ్చింది. ‘దేవదాస్, రామ్‌లీల, పద్మావత్’ వంటి సూపర్‌హిట్ సినిమాలను తెరకెక్కించిన బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్‌కు వెళ్లొచ్చారు శివ కార్తికేయన్. దీంతో భన్సాలీతో ఈ హీరో ఓ సినిమా చేయనున్నారనే టాక్ బాలీవుడ్‌లో ఊపందుకుంది.
మరి... భన్సాలీ దర్శకత్వంలోని సినిమాలో శివ కార్తికేయన్ హీరోగా నటిస్తారా? లేక శివ కార్తికేయన్ హిందీలో నటించే తొలి సినిమాకు భన్సాలీ నిర్మాతగా ఉంటారా? అనే విషయాలపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హిందీ చిత్రం ‘లవ్ అండ్ వార్’తో బిజీగా ఉన్నారు సంజయ్ లీలా భన్సాలీ. ఈ సినిమా రిలీజ్ తర్వాత శివ కార్తికేయన్‌తో భన్సాలీ సినిమా గురించి ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


