ఆ ఎన్నికలకు నేను దూరమే: రజినీ

I Am Not Contesting For That Elections Clarifies Rajinikanth - Sakshi

సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఉప ఎన్నికలకు తాను దూరమేనని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టంచేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికలు ముగియగానే రజనీ పార్టీకి సంబంధించిన ప్రకటన చేస్తారని ఆయన సోదరుడు సత్యనారాయణరావు తెలిపారు. తలైవా రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చి ఏడాది పూర్తి అయింది. అయితే, పార్టీ ప్రకటనపై నాన్చుడు ధోరణి అనుసరిస్తూ చివరకు ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలు దూరం అని ప్రకటించారు. ఎవరికీ తన మద్దతు అన్నది లేదని, తన మక్కల్‌ మండ్రం జెండా, తన ఫొటోలను ఏ ఒక్కరూ ఉపయోగించ కూడదన్న హెచ్చరికలు చేసి ఉన్నారు. అదే సమయంలో అభిమానులకు తరచూ ఆంక్షలు విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్న రజనీ ముందు ఆదివారం మీడియా వర్గాలు ఓ ప్రశ్నను ఉంచాయి.

చెన్నై విమానాశ్రయం నుంచి వెలుపలకు వచ్చిన రజనీ కాంత్‌ను మీడియా చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించాయి. తర్వాత చూసుకుందామంటూ తలైవా రజనీకాంత్‌ ముందుకు సాగారు. చివరకు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యం అంటున్నారుగా అలాంటప్పుడు రాష్ట్రంలో 21 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే పోటీ చేస్తారా అని ఆయన్ను విలేకరులు ప్రశ్నించగా, లేదు తాను ఆ ఎన్నికలకూ దూరం అంటూ ముందుకు సాగారు. ఉప ఎన్నికల బరిలో తాను దిగబోనని తలైవా స్పష్టం చేయడం గమనార్హం. ఇక, రజనీకాంత్‌ సోదరుడు సత్యనారాయణరావు కృష్ణగిరిలో మీడియాతో మాట్లాడుతూ రజనీకాంత్‌ జాప్యం చేయడం లేదని, అన్ని సక్రమంగా పూర్తి చేసుకుని, నిదానంగా పనుల్ని ముగించుకుని పార్టీని ప్రకటిస్తారన్నారు. లోక్‌సభ ఎన్నికలు ముగియగానే పార్టీ విషయంగా రజనీకాంత్‌ ప్రకటన చేస్తారన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top