ఆ శక్తి వాళ్లను నాశనం చేస్తుంది

Gayathri Movie Success Meet  - Sakshi

‘‘గాయత్రి’ సినిమా రిలీజ్‌ అయిన వెంటనే ఇంటర్‌నెట్‌లో పెట్టారు. ఒక సైట్‌లో 2 లక్షల మంది, ఇంకో సైట్‌లో 75 వేల మంది చూశారని అమెరికా నుంచి మిత్రులు ఫోన్‌ చేసి చెప్పారు. సినిమా విడుదలైన రోజే పైరసీ సీడీలు వస్తుంటే ఏం చేయాలి? నిర్మాతగా హృదయంలో ఏడుస్తున్నాను. కళ్లలో నీళ్లు కూడా రావడంలేదు’’ అని నటుడు మంచు మోహన్‌బాబు అన్నారు. మోహన్‌బాబు లీడ్‌ రోల్‌లో నటించి, నిర్మించిన సినిమా ‘గాయత్రి’. మదన్‌ రామిగాని దర్శకత్వం వహించారు. విష్ణు, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమా సక్సెస్‌ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘పైరసీ బారిన పడ్డ నాలాంటి నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. వాళ్లు బయటకు రాలేక, చెబితే వినేవాడు లేక ఉన్నారు. 42 ఏళ్ల సినిమా కెరీర్‌ ఉన్న నేను చెబితే కొంచెం అయినా చెవిన పడుతుందనే ఉద్దేశంతో మాట్లాడుతున్నా. ‘గాయత్రి’ కోసం తొమ్మిది నెలలు కష్టపడ్డాను. చేతికి, మోకాలికి సర్జరీ జరిగినా లెక్క చేయలేదు. దేవుడి దయవల్ల, ప్రేక్షకుల ప్రేమ వల్ల అన్నీ సంపాదించాను. నేను.. నా కుటుంబం.. నా బిడ్డలు... ఓ నలుగురికి సాయం చేయగలుగుతున్నాం.

‘అయ్యా.. పైరసీ చూసే మహానుభావుల్లారా. దయచేసి చూడొద్దు’. మనందరం దేవుణ్ణి.. ఏదో ఓ శక్తి ఉందని నమ్ముతాం. ఆ పైరసీ చూసేవాళ్లందర్నీ ఆ శక్తి నాశనం చేస్తుంది. ఎదుటివాడు చెడిపోవాలనుకుంటే మనమే చెడిపోతాం. పైరసీ చేసినవాళ్లు, దాన్ని చూసే వాళ్లు ఉంటే ఎక్కడికి పోతుందీ దేశం. రిలీజ్‌ రోజే పైరసీ చేసింది థియేటర్‌ ఆపరేటరా? ఓనరా? ఇంకా ఎవరైనానా? ఇవన్నీ ఆ శివుడు.. సాయినాథుడికే ఎరుక. ‘రౌడీ’ సినిమా అప్పుడు ‘విష్ణు ఎంత చక్కగా చేస్తున్నాడు’ అన్నాడు రామ్‌గోపాల్‌ వర్మ. డబ్బు ముఖ్యమా? పేరు ముఖ్యమా అంటే పేరే ముఖ్యం అంటాను నేను.

ఏ తండ్రి అయినా బిడ్డల్ని చూసి పొందేదే సంతోషం. యంగ్‌ శివాజీ పాత్రలో విష్ణుకి మంచి పేరు వచ్చింది. శ్రియ కూడా బాగా చేసింది. వీడియో పైరసీ చేసినవాళ్లను కూడా ఆ దేవుడు చల్లగా చూడాలి’’ అన్నారు. మదన్‌ రామిగాని మాట్లాడుతూ– ‘‘సినిమాకు మేము చేసిన పబ్లిసిటీ కంటే మౌత్‌ టాక్‌ చాలా ఎక్కువగా ఉంది. విజయవాడకు చెందిన నాటక పరిషత్‌ వాళ్లు ‘గాయత్రి’ సినిమా నటులకు డిక్షనరీలా ఉంటుంది అన్నారు. ‘మోహన్‌బాబుకు వయసు అయిపోదా? ఆ ఎనర్జీ ఏంటి?’’ అని రాయలసీమలో ఓ ఫ్రెండ్‌ అన్నాడు.

ఈ సినిమాకి ఇవి రెండూ బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌. మోహన్‌బాబుగారు హిట్స్‌.. ఫ్లాప్స్‌ పట్టించుకోరు. కథ నచ్చితే చేస్తారు.  హాలీవుడ్‌ యాక్టర్‌ టామ్‌ క్రూజ్‌ ఏదో స్టంట్‌ చేస్తూ గాయపడ్డాడని ప్రపంచం మొత్తం మాట్లాడుకున్నారు. మోహన్‌బాబుగారు భుజం నొప్పితో వారం రోజులపాటు ఫైట్‌ సీన్‌లో పాల్గొన్నారు. వయసులో టామ్‌ క్రూజ్‌ కంటే మోహన్‌ బాబుగారే పెద్ద. ఎందుకు మనం మనవాళ్ల గురించి గొప్పగా మాట్లాడుకోమో తెలియదు. పరాయి వాళ్ల గొప్పలే కనిపిస్తుంటాయి మనకు. మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి కానీ అప్లై చేయం, విల్‌ పవర్‌ ఉంటుంది కానీ వాడం.

మోహన్‌బాబుగారు ఆ రెండూ చేస్తారు. మా కెరీర్‌లో ‘గాయత్రి’ ఒక మంచి మైలు రాయి. ఈ సినిమా గొప్పతనం మెల్లిగా తెలుస్తుంది. సినిమాల్లో 24 క్రాఫ్ట్‌లే కానీ 25వ క్రాఫ్ట్‌ రావాలి.. అదే ఆత్మ పరిశీలన. ఈ సినిమాకు అది జరిగింది. ప్రతీ సీన్‌ ఒకటికి మూడు సార్లు ఆలోచించి తీశాము’’ అన్నారు. ‘‘భారతదేశంలో ఇద్దరి పరిస్థితే బాగోలేదు. ఒకరు రైతు, ఇంకొకరు నిర్మాత. సినిమా రాకముందే రివ్యూలు వచ్చేస్తున్నాయి. రోజు గడవకముందే పైరసీ ప్రింట్‌లు వచ్చేస్తున్నాయి. ఇలాంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడు నిర్మాత’’ అన్నారు డైలాగ్‌ రైటర్‌ డైమండ్‌ రత్నబాబు.

నేను ఏ పార్టీవాణ్ణి కాదు
‘గాయత్రి’ సినిమాలో కొన్ని డైలాగ్స్‌ వివాదంగా ఉన్నాయనీ.. ఓ పార్టీని ఉద్దేశించి ఆ డైలాగ్స్‌ మాట్లాడాననే మాటలు విన్నాను. నేను ఏ పార్టీకీ చెందినవాణ్ణి కాదు. రోజూ పేపర్‌లో చూసే కొన్ని ఛలోక్తులు సినిమాలో వాడాం. నేను రాజకీయాల గురించి త్వరలో మాట్లాడతాను. ఏ పార్టీకి ఓటు వేయాలో.. ఏ పార్టీకి వేస్తే నష్టపోతారో చెబుతాను.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top