`ఇగో` మూవీ రివ్యూ

Ego Movie Review - Sakshi

టైటిల్ : ఇగో
జానర్ : రొమాంటిక్‌ కామెడీ
తారాగణం : ఆశిష్‌ రాజ్, సిమ్రాన్‌, దీక్షాపంత్‌, రావు రమేష్‌, పృధ్వీ, పోసాని కృష్ణమురళీ
సంగీతం : సాయి కార్తీక్‌
దర్శకత్వం : సుబ్రమణ్యం
నిర్మాత : విజయ్ కరణ్‌, కౌషల్‌ కరణ్‌, అనిల్‌ కరణ్‌

ఆసక్తికరమైన కథా కథనాలతో తెరకెక్కిన చిన్న సినిమాలు కూడా సంచలన విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో ఆ తరహా చిత్రాలను రూపొందించేందుకు చాలా మంది ముందుకొస్తున్నారు. అదే బాటలో ఆశిష్ రాజ్‌, సిమ్రాన్‌ జంటగా ఇంట్రస్టింగ్‌ పాయింట్‌ కు లవ్ స్టోరి, కామెడీలను జోడించి ఇగో సినిమాను తెరకెక్కించారు. మరీ ఈ ప్రయత్నం ఆకట్టుకుందా..?

కథ :
గోపి (ఆశిష్‌ రాజ్‌), ఇందు (సిమ్రాన్‌)లు ఇద్దరు ఇగోతో ఒకరి మీద ఒకరు పై చేయి సాధించాలని ప్రయత్నిస్తుంటారు. తరతరాలుగా వారిద్దరి కుటుంబాలకు ఒకరంటే ఒకరు పడదు. దీంతో ఇందుని ఇబ్బంది పెట్టాలని గోపి, గోపిని ఏదో ఒక సమస్యలో ఇరికించాలని ఇందు ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంటారు. ఈ గోడవలు ఇంట్లో తెలియటంతో ఇందుకు పెళ్లి సంబంధం చూస్తారు. అమెరికాలో స్థిరపడిన అబ్బాయితో ఇందుకి పెళ్లి కుదురుతుంది. ఇగో గోపి ఇందుకు కన్నా ముందే మంచి అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఛాలెంజ్ చేసి హైదరాబాద్‌ వస్తాడు. అప్పుడే ఇందు, గోపిలకు ఒకరంటే ఒకరికి ప్రేమని తెలుస్తుంది. 

ఇద్దరు కలుసుకునే సమయానికి గోపిని ఓ మర్డర్‌ కేసులో అరెస్ట్‌ చేస్తారు. పూర్వి (దీక్షాపంత్‌) అనే అమ్మాయి అతి దారుణంగా హత్య చేయబడుతుంది. ఆమె ఫోన్‌లో గోపితో దిగిన సెల్ఫీతో పాటు, హత్య జరగటానికి ముందుకు గోపితో 40 నిమిషాలు మాట్లాడినట్టు, హత్య జరిగిన తరువాతి రోజు పూర్వి అకౌంట్‌ నుంచి గోపి 40 వేలు డ్రా చేసినట్టు సీసీ టీవీ ఫుటేజ్‌ సాక్ష్యాలుగా ఉంటాయి. దీంతో అంతా గోపినే ఈ హత్య చేశారని భావిస్తారు. అసలు పూర్విని హత్య చేసింది ఎవరు..? ఆ కేసులో గోపిని ఎందుకు ఇరికించారు..? ఈ కేసునుంచి గోపి ఎలా బయట పడ్డాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
ఆకతాయి సినిమాతో హీరోగా పరిచయం అయిన ఆశిష్ రాజ్‌, రెండో ప్రయత్నంలో పరవాలేదనిపించాడు. డ్యాన్స్‌లు, యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకున్న ఈ యంగ్ హీరో నటన విషయంలో పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. హీరోయిన్‌ గా పరిచయం అయిన సిమ్రాన్‌ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. బిగ్ బాస్‌ ఫేం దీక్షా పంత్‌ది చిన్న పాత్రే అయిన ఉన్నంతలో తన పరిధిమేరకు పాత్రకు న్యాయం చేసింది. రావూ రమేష్, పృధ్వీ, పోసాని కృష్ణమురళీలు రొటీన్‌ పాత్రల్లో నిరాశపరిచారు. ఫస్ట్ హాఫ్‌ లో పృధ్వీ కామెడీ కాస్త నవ్విస్తుంది.

విశ్లేషణ :
తనకేది సంబంధం లేని కేసులో ఇరుక్కున్న ఓ యువకుడు ఎలా బయటపడ్డాడు అన్న ఆసక్తికరమైన పాయింట్ ను కథగా ఎంచుకున్న దర్శకుడు ఆ పాయింట్‌ ను ఆసక్తికరంగా తెరకెక్కించటంలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యాడు. మెయిన్ పాయింట్‌ కు సపోర్ట్‌ గా ఎంచుకున్న ప్రేమకథ, కామెడీ ఏమాత్రం ఆకట్టకోకపోవటం. అసలు కథ ద్వితియార్థంలో గాని మొదలు కాకపోవటం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. కావాలని ఇరికించిన పంచ్ డైలాగ్‌ లు కామెడీ సీన్స్ విసిగిస్తాయి. అయితే హీరో మర్డర్‌ కేసులో అరెస్ట్ అయ్యే సన్నివేశాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నా.. అదే స్థాయిలో సినిమాను ముందుకు నడిపించలేకపోయాడు. సాయికార్తీక్‌ సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top