ఆ పెయింటింగ్‌.. ఆ పోస్టు.. ముందే చెప్పావా సుశాంత్‌?

Does Sushant Singh Rajput Twitter Cover Pic Reveals Connection With His Demise - Sakshi

మనిషి ప్రవర్తనను బట్టి అతడి/ఆమె మానసిక స్థితిని అంచనా వేయవచ్చు అంటారు వైద్య నిపుణులు. నిజమే కావొచ్చు.. అయితే ఆ మనిషితో మనం సన్నిహితంగా మెలిగినపుడు మాత్రమే వారి హృదయాంతరాల్లో దాగిన రహస్యాన్ని ఛేదించగల అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి మనసు చదవగలిగినపుడే దాని లోతెంతో అర్థం చేసుకునే వీలు కలుగుతుంది. కానీ ఎల్లప్పుడూ ఉరుకులు, పరుగులతో బిజీగా ఉండే ఈ డిజిటల్‌ యుగంలో మన గురించి మనం పట్టించుకోవడమే మానేశాం. అలాంటిది ఇతర వ్యక్తుల గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది. ఆకస్మికంగా ఈ లోకాన్ని వీడి.. అభిమానులను శోక సంద్రంలో ముంచిన యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య ఉదంతం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.(‘సుశాంత్‌ ఎందుకిలా చేశాడో చెప్పలేను’)

ధోనీ మూవీ ఫేం సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణం.. 34 ఏళ్ల వయసులోనే బలవన్మరణానికి పాల్పడ్డ బాలీవుడ్‌ హీరో.. అరె అతడికి ఏం తక్కువ. చదువు, తెలివి, ప్రతిభ, అందం, ఆరోగ్యం, ఆస్తి అన్నీ ఉన్నాయి కదా.. ఇంత హఠాత్తుగా అంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు. బాలీవుడ్‌ స్టార్‌గా ఎదిగిన తర్వాత అతడికి ఇంకా లోటు ఏముంది. సినీ అభిమానులతో పాటు నెటిజన్లను ఇలాంటి ప్రశ్నలెన్నో ఉక్కిరిబిక్కిరి చేశాయి. నిజానికి తనది ఆకస్మిక మరణం కాదు.. హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోనూ లేదు. సుశాంత్‌ను సోషల్‌ మీడియాలో ఫాలో అయ్యే వాళ్లకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. 

అవును.. తనను ‘డిప్రెషన్‌’ అనే ‘దెయ్యం’ పట్టిపీడిస్తుందని ట్విటర్‌ కవర్‌ ఇమేజ్‌ ద్వారా పరోక్షంగా తన ఫాలోవర్లకు సుశాంత్‌ తెలియజేశాడు. 1889లో విన్సెంట్‌ వాన్‌ గోగ్‌ చిత్రించిన ‘స్టారీ నైట్స్‌’ పెయింటింగ్‌ ద్వారా తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు. (విన్సెంట్‌ గోగ్‌ డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నపుడే ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఆ మరుసటి ఏడాది అనగా 1890లో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లుగా కథనాలు ప్రచారంలో ఉన్నాయి) అయితే కొన్నాళ్లుగా ట్విటర్‌కు దూరమైన సుశాంత్‌.. ‘‘మసకబారిన జీవితం కన్నీటిబొట్టు రూపంలో ఆవిరి అవుతోంది. అంతు లేని కలలు చిరునవ్వును, అశాశ్వతమైన జీవితాన్ని చెక్కుతున్నాయి. ఆ రెండింటి మధ్య బతుకుతున్నాను’’ అంటూ జూన్‌ 3న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టాడు. తనకు శాశ్వతంగా దూరమైన కన్నతల్లిని తలచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. పదిరోజులు తిరగకుండానే తానూ తల్లికి దగ్గరికి వెళ్లిపోయాడు.

ఎందుకో మరి ఇలా!
విద్యాధికుడు, ఆల్‌ ఇండియా ఇంజనీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌లో 7వ ర్యాంక్‌ సాధించిన విద్యార్థి.. మంచి కాలేజీ నుంచి పట్టా పుచ్చుకుని ఐదంకెల జీతం అందుకోగల ప్రతిభ ఉన్నవాడు.. కానీ ప్రాణంగా భావించిన నటన కోసం వాటిన్నంటినీ త్యజించాడు. ఎక్కో మెట్టు ఎక్కుతూ.. ఎవరి అండ లేకుండానే సొంతంగా ఎదిగాడు.. స్టార్‌ అయిపోయాడు.. కల నెరవేర్చుకున్నాడు.. ఇంకా ఇంకా ఎదగాలనుకున్నాడు..

తను చంద్రుడి గురించి మాట్లాడతాడు.. జాబిల్లి అందాన్ని ఆస్వాదిస్తాడు.. వెన్నెల్లో సేద తీరాలంటాడు.. ప్రకృతిని ఆస్వాదిస్తాడు.. డిస్నీల్యాండ్‌లో చిన్నపిల్లాడిలా కేరింతలు కొడతాడు.. అంగారకుడిపై అడుగు పెడితే బాగుందంటాడు... డార్క్‌ మ్యాటర్‌ అంటాడు.. panpsychism అంటే ఏంటో తెలుసుకోవాలంటాడు.. విశ్వంలో నిగూఢమైన రహస్యాలను ఛేదించాలంటాడు.. కాంతి, పదార్థం గురించి పెద్ద పెద్ద వ్యాసాలు రాయగలడు.. ఇవన్నీ చేయగలడు.. ఆత్మహత్య చేసుకోవడం సరైన పని కాదంటూ అనిరుధ్‌గా డైలాగ్‌లు చెప్పనూగలడు.. ‘లూజర్‌’ అన్నా బాధపడొద్దు, పడినా ఉవ్వెత్తున ఎగిసే అలలా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలంటాడు.. ఇన్ని విషయాలు తెలిసిన తను బాధను మాత్రం ఎవరితో పంచుకోలేదా..? లేదా తనను అర్థం చేసుకునే తోడు ఎవరు లేరనుకున్నాడా? ఏమో! ఎందుకో అంతటి కఠిన నిర్ణయం తీసుకున్నాడు..! 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top