
సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య పోటీ ఎప్పుడూ ఉండేదే! అయితే కొత్తగా వచ్చే హీరోహీరోయిన్స్ ఎదుగుతున్నారంటే కొందరు బడా స్టార్స్ అస్సలు తట్టుకోలేరు. హీరో కార్తీక్ ఆర్యన్ విషయంలో ఇదే జరిగిందంటున్నాడు సింగర్ అమాల్ మాలిక్ (Amaal Mallik). బాలీవుడ్‌లోని చీకటి కోణం గురించి సింగర్ అమాల్ మాలిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
మాయా ప్రపంచం
సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా ఉంటాయో జనాలకు అర్థమవుతోంది. ఇక్కడ చీకట్లోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. దాన్ని ఎదిరించలేకపోయాడు. అతడిది ఆత్మహత్య అని కొందరు, హత్య అని మరికొందరు అంటుంటారు. ఏదేమైనా అతడు మనమధ్య లేడనేది నిజం. ఈ పరిశ్రమ వారి మనసును, మెదడును దెబ్బతీస్తుంది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. సినిమా ఇండస్ట్రీ అనేదే ఒక మాయాప్రపంచం.
తగిన శాస్తి
ఈ విషయం జనాలకు అర్థమయ్యాక బాలీవుడ్‌పై వారి అభిప్రాయమే మారిపోయింది. వీళ్లు చెడ్డవాళ్లు.. ఊరికే వదిలిపెట్టకూడదు అని జనాల్లో కోపం కట్టలు తెంచుకుంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో సెలబ్రిటీలను, వారి సినిమాలను ప్రజలు దూరం పెట్టారు. ఈ పతనాన్ని చూసేందుకు వారు నిజంగానే అర్హులు. ఒక మంచి మనిషి (సుశాంత్ సింగ్) మన మధ్య లేకుండా పోయాడు.
సమస్యలను ఎదిరించి..
కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan)ను కూడా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తొక్కడానికి ప్రయత్నించారు. కానీ, అతడు చిరునవ్వుతోనే ఆ సమస్యలను జయించాడు. అతడికి పేరెంట్స్ సపోర్ట్ ఉంది. ఇండస్ట్రీకి కొత్తవాడయినా తన స్వయంకృషితో ఎదిగాడు. కార్తీక్‌ను ఇండస్ట్రీ నుంచి బయటకు పంపించేందుకు దాదాపు వంద మంది ప్రయత్నిస్తున్నారు. అందులో పెద్ద హీరోలు, నిర్మాతలు.. ఎందరో ఉన్నారు అని చెప్పుకొచ్చాడు.
సినిమా
ప్యార్ కా పంచనామా సినిమాతో బాలీవుడ్‌లో హీరోగా కెరీర్ మొదలుపెట్టాడు కార్తీక్ ఆర్యన్. ప్యార్ కా పంచనామా 2, లుకా చుప్పి, లవ్ ఆజ్ కల్, ధమాకా, భూల్ భులయ్యా 2, భూల్ భులయ్యా 3, ఫ్రెడ్డీ, షెహజాదా (అల వైకుంఠపురములో రీమేక్), సత్య ప్రేమ్‌కీ కథ వంటి చిత్రాల్లో నటించాడు.
చదవండి: బిగ్‌బాస్ షోలో రోబో ఎంట్రీ.. కంటెస్టెంట్లకు కష్టమే!