
తిరువనంతపురం: మళయాళం మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ‘అమ్మ’(Association of Malayalam Movie Actors) లుకలుకలు మొదలయ్యాయి. ప్రస్తుతం అమ్మ అధ్యక్షుడిగా ఉన్న ఇన్నోసెంట్, ప్రధాన కార్యదర్శి మమ్మూటీని ఆయా పదవుల నుంచి దిగిపోవాలంటూ పలువురు సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. అమ్మలో సమూల మార్పులు కొరుకుంటున్న సభ్యులు.. తెరపైకి కొత్త పేర్లను తెస్తున్నారు.
అధ్యక్షుడిగా మోహన్‌లాల్? దాదాపు 20 ఏళ్లుగా అధ్యక్షుడి పదవిలో ఇన్నోసెట్ కొనసాగుతూ వస్తున్నారు. త్వరలో మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకాలం సభ్యులుగా ఉన్నవాళ్లు వైదొలిగి.. ఈసారి కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తేవటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఎన్నికల ప్రస్తావన లేకుండా ఏకపక్షంగా ఆయన్ని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని సభ్యులు తీర్మానించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న మోహన్‌లాల్.. ఈ విషయంలో సుముఖంగా ఉన్నారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆయన విముఖత వ్యక్తం చేస్తే.. మరో ఉపాధ్యక్షుడు గణేషన్‌కు అవకాశం లభించొచ్చని మాలీవుడ్ వర్గాల కథనం.
ప్రధాన కార్యదర్శి పోటీకి నామినేషన్ దాఖలు చేసిన ఇదవేలా బాబు ఈ విషయమై స్పందిస్తూ.. కొత్త వారు నామినేషన్లు వేస్తే తామంతా పోటీ నుంచి విరమించుకుంటామని స్పష్టం చేశారు. అలాకానీ పక్షంలో పాత సభ్యులే కొనసాగే అవకాశం ఉందని ఆయన అంటున్నారు. జూన్ 24వ తేదీ జరబోయే జనరల్ బాడీ మీటింగ్‌లో ఈ అంశం ఓ కొలిక్కి వస్తుందని ఆయన అంటున్నారు. అమ్మ ఏకపక్ష నిర్ణయాలు.. దీనికి తోడు నటి భావన ఉదంతంలో ‘అమ్మ’ వైఖరిపై పెద్ద ఎత్తున్న విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వారిని వైదొలగాలంటూ సభ్యులు నిర్ణయించినట్లు భోగట్ట.
పృథ్వీ, రమ్యలపై చర్యలు... భావన ఉదంతంపై హీరో పృథ్వీరాజ్, నటి రమ్య నంబీషన్‌లు అమ్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో ‘అమ్మ’ ఎలాంటి జోక్యం చేసుకోకపోవటం అప్రజాస్వామికమని, నిందితులు ఎవరో తెలిసీ కూడా కంటితుడుపు చర్యలు తీసుకోవటం దారుణమంటూ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఉన్న వీరిద్దరూ వ్యాఖ్యానించారు. దీంతో వీరిద్దరిపై క్రమశిక్షణ నియామవళి ప్రకారం చర్యలు తీసుకోవాలని అసోషియేషన్ నిర్ణయించింది. జూన్ 24న జరగబోయే జనరల్ బాడీ మీటింగ్‌లో వీరిద్దరి భవిష్యత్‌పై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.