మణిరత్నం... అది నా మనసులో నాటారు!

మణిరత్నం... అది నా మనసులో నాటారు!


‘‘ఇండస్ట్రీలోని హీరోలందరూ కేవలం సీటునో, లేదంటే నంబర్స్‌నో కాపాడుకోవడానికి సినిమాలు మొదలు పెడితే... నిజంగా మమ్మల్ని (హీరోల్ని) ఎవరూ కాపాడలేరు’’ అన్నారు రామ్‌చరణ్‌. ఆయన హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్వీ ప్రసాద్‌లు నిర్మించిన సినిమా ‘ధృవ’. శుక్రవారం హైదరాబాద్‌లో ‘శాల్యూట్‌ టు ఆడియన్స్‌’ వేడుక నిర్వహించారు. ‘‘దర్శక – నిర్మాతలు కాదు... హీరోలు అనుకుంటే కొత్త తరహా సినిమాలు వస్తాయి. ‘ధృవ’ సరైన సమయంలో విడుదలైతే ఇంకో 20 శాతం రెవెన్యూ ఎక్కువ ఉండేది’’ అని ‘దిల్‌’ రాజు అన్నారు. రామ్‌చరణ్‌ మాట్లాడుతూ – ‘‘నేనూ, మామ (అల్లు అరవింద్‌) సినిమా చేస్తే ఎక్కువ ఆనందపడే వ్యక్తి మా అమ్మ. అమ్మ ఆనందం కోసం ‘ధృవ’ హిట్టవ్వడం ఇంకా హ్యాపీగా ఉంది.


నా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్స్‌ రెండూ (‘మగధీర, ధృవ’) గీతా ఆర్ట్స్‌లోనే అంటే గర్వంగా ఉంది. బన్నీ (అల్లు అర్జున్‌)కి మామ చాలా ఇచ్చారు. ఇంకా కోరుకుంటే అది బన్నీ తప్పు గానీ.. మామ తప్పు కాదు (నవ్వులు). బన్నీ కెరీర్‌లో బిగ్గెస్ట్‌  హిట్‌ (‘సరైనోడు’) కూడా మామదేగా! ఓసారి మణిరత్నంగారు ‘నీ మార్కెట్‌కు లోటేమీ లేదు. ఒకవేళ నాతో సినిమా చేస్తే, ఎక్కువ వసూళ్లు సాధించక పోవచ్చు. కానీ, కచ్చితంగా నీకు మంచి పేరొస్తుంది. కథలు వినేటప్పుడు వసూళ్లు గురించి కాకుండా పేరు గురించి ఆలోచించు’ అనే విత్తనాన్ని నా మనసులో నాటారు. ఆ విత్తనమే ‘ధృవ’లా వచ్చింది. నాతో పాటు ఈ కథను నమ్మిన మా టీమ్‌కి థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘నోట్ల రద్దు ప్రభావం ఉన్నప్పటికీ రిస్క్‌ చేసి సినిమా రిలీజ్‌ చేశాం. అయినా... ప్రేక్షకులు మంచి హిట్‌ చేశారు.


ఈ ఏడాది గీతా ఆర్ట్స్‌లో చరణ్‌తో ‘ధృవ’, బన్నితో ‘సరైనోడు’, అల్లు శిరీష్‌తో ‘శ్రీరస్తు శుభమస్తు’ వంటి హిట్‌ చిత్రాలు చేయడం వ్యక్తిగతంగా ఆనందాన్నిచ్చింది’’ అన్నారు అల్లు అరవింద్‌. ‘‘కథను నమ్మి హీరో, నిర్మాతలు ముందడుగు వేశారు. మంచి విజయం అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు సురేందర్‌రెడ్డి. కథానాయిక రకుల్, సంగీత దర్శకుడు ‘హిప్‌ హాప్‌’ తమిళ, నటులు నవదీప్, అలీ, పాటల రచయితలు చంద్రబోస్, వరికుప్పల యాదగిరి పాల్గొన్నారు.

 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top