నిజం తెలుసుకొని షాకైన హీరోయిన్‌! | Deepika Padukone Social Experiment With Wont Buy Won't Sell | Sakshi
Sakshi News home page

ఒకేరోజు 24 యాసిడ్‌ బాటిళ్లు కొనుగోలు.. వామ్మో!

Jan 15 2020 5:01 PM | Updated on Jan 16 2020 11:03 AM

Deepika Padukone Social Experiment With Wont Buy Won't Sell - Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపిక పదుకొనే తాజాగా నటించిన చిత్రం ఛపాక్‌. లక్ష్మీ అగ్వాల్‌ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో దీపిక యాసిడ్‌ బాధితురాలిగా నటించింది. జనవరి 10న విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ఇక యాసిడ్‌ అమ్మకాలను నియంత్రిచాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు అమలవుతున్నాయా? అని దీపికకు సందేహం తలెత్తింది. దీంతో దీపిక టీమ్‌ ఓ సామాజిక ప్రయోగానికి(సోషల్‌ ఎక్స్‌పర్మెంట్‌) పూనుకుంది. ఇందులో భాగంగా బృ‍ంద సభ్యులు ప్లంబర్‌, మెకానిక్‌, బిజినెస్‌మెన్‌, గృహిణి ఇలా రకరకాలుగా వేషాలు కట్టి ముంబైలోని పలు దుకాణాలకు వెళ్లి యాసిడ్‌ కావాలంటూ అడిగారు. దీనికి కొందరు షాపు యజమానులు అడగ్గానే సులువుగా ఇచ్చేయగా ఒకరిద్దరు మాత్రం ఎందుకు? ఏమిటి? ఆరా తీశారు.

గుర్తింపు కార్డు చూపించని వారికి యాసిడ్‌ను అమ్మకూడదన్న నిబంధనలను సైతం దుకాణదారులు బేఖాతరు చేశారు. కేవలం ఒక్కరు మాత్రమే ఐడీ కార్డ్‌ అడిగి, చివరకు యాసిడ్‌ బాటిల్‌ను అతని చేతికందించాడు. ఇంత విచ్చలవిడిగా యాసిడ్‌ అమ్మకాలు జరుగుతున్నాయని తెలిసి దీపిక టీమ్‌ సభ్యులు ఆశ్చర్యపోయారు. దీన్నంతటినీ సీక్రెట్‌గా వీడియో తీస్తుండగా ఈ ప్రయోగాన్ని కారులో కూర్చొని పర్యవేక్షిస్తున్న దీపికకు నోట మాట రాలేదు. మన దేశంలో యాసిడ్‌ను ఇంత సులభంగా కొనుగోలు చేయవచ్చన్న విషయం తెలుసుకున్న ఆమె నిశ్చేష్టురాలైంది.(‘మాల్తీ’గా ముంబైలో దీపిక చక్కర్లు)

దీనిపై దీపిక పదుకొనే స్పందిస్తూ ‘సుప్రీంకోర్టు యాసిడ్‌ అమ్మకాలపై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. అయినా కూడా మేము ఒక్కరోజులోనే 24 యాసిడ్‌ బాటిళ్లను కొనుగోలు చేశామంటే నమ్మలేకపోతున్నాను. దుకాణదారులతోపాటు ఎవరైనా చట్ట విరుద్ధంగా యాసిడ్‌ అమ్మినా, కొనుగోలు చేసినా ఆ విషయాన్ని పోలీసులకు చేరవేయాల్సిన బాధ్యత మనపై ఉంది. యాసిడ్‌ను కొనుగోలు చేయకండి, దాన్ని ఎవరూ అమ్మకండి’ అని పిలుపునిచ్చింది. కాగా గతంలోనూ దీపిక ఓ ఎక్స్‌పర్మెంట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఛపాక్‌ సినిమా షూటింగ్‌ సమయంలో మాలతి వేషంలో ఉన్న దీపిక పలు షాపులకు వెళ్లింది. యాసిడ్‌ బాధితురాలిగా ఉన్న దీపికను ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. పైగా ఆమెను చూడగానే కొందరు మొహం తిప్పుకుని వెళ్లిపోగా మరికొందరు చిరునవ్వుతో పలకరించారు. ఇలా ఆమెకు జరిగిన అనుభవాలను వీడియో తీసి పోస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement