మరోసారి వివాదాల్లో హాస్య నటుడు వడివేలు

Controversy Again on Comedian Vadivelu Tamil nadu - Sakshi

చెన్నై,పెరంబూరు:  హాస్య నటుడు వడివేలు మరోసారి వివాదాల్లో ఇరుక్కున్నారు.అతన్ని విచారించడానికి పోలీసులు సిద్ధం అవుతున్నారు. వడివేలు ఇది వరకే పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. వాటిలో ముఖ్యంగా  ఇంసై అరసన్‌ 23 ఆమ్‌ పులికేసి 2 చిత్ర వివాదం. శంకర్‌ నిర్మాతగా శింబుదేవన్‌ దర్శకత్వంలో వడివేలు హీరోగా నటించిన ఇంసై అరసన్‌ 23ఆమ్‌ పులికేసి చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వడివేలుకు హీరోగా క్రేజ్‌ పెరిగింది. దీంతో అదే కాంబినేషన్‌లో ఇంసైఅరసన్‌ 23ఆమ్‌ పులికేసి– 2 రూపొందించతలపెట్టారు. దీనికి సంబంధించి కొంత షూటింగ్‌ కూడా జరిగింది.అందుకోసం భారీ సెట్స్‌ వేశారు. అలాంటిది అనూహ్యంగా ఆ చిత్రంలో నటించడానికి వడివేలు నిరాకరించారు.

దీంతో శంకర్‌ నష్టపరిహారంగా రూ.4కోట్లు చెల్లించాలని వడివేలును డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇంకా పంచాయితీ దశలోనే ఉంది. కాగా తాజాగా మధురై, పుదూర్‌కు చెందిన సతీష్‌కుమార్‌ వడివేలుపై పుదూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈయన పుదూర్‌లో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్నారు. కాగా  ఈయన కార్యాలయంలో గోవిందరాజ్‌ అనే వ్యక్తి నిర్వాహకుడిగా పని చేస్తున్నాడు. కాగా గత  ఒకటవ తేదీన తిరుప్పువనానికి చెందిన మణికంఠన్‌ అనే వ్యక్తి మరొకరితో సతీష్‌కుమార్‌ కార్యాలయంలోని దౌర్జన్యంగా ప్రవేశించి అక్కడ ఉన్న నిర్వాహకుడు గోవందరాజ్‌పై దాడి చేశారు. డబ్బు సెటిల్‌మెంట్‌ చేయకపోతే నిన్నూ , సతీష్‌కుమార్‌ను నీటి ట్యాంకర్‌తో గుద్ది చంపుతామని బెదిరించారు.  కాగా సతీష్‌కుమార్‌ ఇంతకు ముందు వడివేలు హీరోగా ఎలి అనే చిత్రాన్ని నిర్మించారు. కాగా వడివేలు వద్ద మేనేజర్‌గా మణికంఠన్‌ పని చేస్తున్నాడు. కాగా ఆ చిత్ర లావాదేవీల్లో కారణంగానే నటుడు వడివేలు ప్రోద్బలంతో మణికంఠన్‌ సతీష్‌కుమార్‌ను బెదిరించినట్లు తెలిసింది. దీంతో సతీష్‌కుమార్‌ ఈ సంఘటనపై పుదూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నటుడు వడివేలును విచారించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top