ప్రముఖుల చమక్కులతో పుస్తకం

cine premikula chamakkalu book release - Sakshi

‘‘జయకుమార్, నేను కలిసి మద్రాస్‌లో ఒకే రూంలో ఉండేవాళ్లం. అప్పటి నుంచి కూడా ఆయనకు సాహిత్యం మీద చాలా అభిలాష ఉండేది’’ అని డైరెక్టర్‌ రేలంగి నరసింహారావు అన్నారు. ఆనాటి సినీ ప్రముఖులు, రచయితలు, నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల మధ్య వివిధ సందర్భాల్లో జరిగిన సంభాషణలను సేకరించిన సహదర్శకులు కనగాల జయకుమార్‌ ‘సినీప్రముఖుల చమక్కులు’ పేరిట ఓ పుస్తకాన్ని ముద్రించారు. హీరో శ్రీకాంత్‌ ఈ బుక్‌ని ఆవిష్కరించగా, వాసిరెడ్డి విద్యాసాగర్‌ స్వీకరించారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు జయకుమార్‌ని చాలా గౌరవించేవారు.

రెండుసార్లు ఆయనకు డైరెక్టర్‌గా అవకాశాలు వచ్చినా కూడా ఎందుకో డైరెక్టర్‌ కాలేకపోయారు. జయకుమార్‌ చక్కని పాటలు, కవితలు రాస్తారు’’ అన్నారు. ‘‘జయకుమార్‌గారు, నేను కలిసి కొంతకాలం పని చేశాం. ఆయన ఎప్పుడూ టెన్షన్‌ పడరు. ఈ పుస్తకం పార్ట్‌ –2 తీసుకురావాలన్నది చాలా మంచి ఆలోచన’’ అన్నారు డైరెక్టర్‌ శివనాగేశ్వరరావు. ‘‘జయ్‌కుమార్‌గారు నా సినిమాలకు కో డైరెక్టర్‌గా పని చేశారు. ఆయన ప్లానింగ్‌ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ పుస్తకం చదువుతుంటే చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు హీరో శ్రీకాంత్‌.

‘‘40ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. ఈ ఆనందం వేరే ఎందులోనూ ఉండదు. విద్యాసాగర్‌గారు ఫిల్మ్‌ అప్రిసియేషన్‌ క్లాసెస్‌ అని తన కళాశాలలో నాకు ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించారు. నేను అడగకుండానే నా పుస్తకాలను ప్రచురించినందుకు చాలా కృతజ్ఞతలు’’ అని రచయిత జయకుమార్‌ అన్నారు. సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఎండ్లూరి సుధాకర్‌రావు, జడ్జి కరపాల సుధాకర్, నటుడు హేమసుందర్, మరుధూరి రాజా, రాంప్రసాద్, సీనియర్‌ జర్నలిస్ట్‌ వినాయకరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top