పడ్డానండి.. మరి! | Charmi Kaur u really broke a leg | Sakshi
Sakshi News home page

పడ్డానండి.. మరి!

Jul 10 2016 12:23 AM | Updated on Oct 4 2018 4:40 PM

పడ్డానండి.. మరి! - Sakshi

పడ్డానండి.. మరి!

అవును.. చలాకీ అమ్మాయి చార్మీ కౌర్ పడ్డారండి! అవునా.. ఎవరితో ప్రేమలో పడ్డారు? అని ఆరా తీయకండి.

 అవును.. చలాకీ అమ్మాయి చార్మీ కౌర్ పడ్డారండి! అవునా.. ఎవరితో ప్రేమలో పడ్డారు? అని ఆరా తీయకండి. అలా ఆలోచిస్తే మీరు పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే.. పడింది ప్రేమలో కాదు, కుర్చీలో నుంచి కిందకు జారి పడ్డారు. పడగానే కాలిలో ఏదో కలుక్కుమనిపించిందట. పడినప్పుడు కామనే కదా అని సరిపెట్టుకున్నారు. ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు.
 
  మర్నాడు నిద్ర లేవగానే ఈ బ్యూటీకి చుక్కలు కనిపించాయి. కాలు వాచింది. దాంతో పాటు నొప్పి కూడా. సరిగ్గా నడవలేని పరిస్థితిలో డాక్టర్ దగ్గరకు వెళితే మోకాలి నుంచి కింద వరకూ పెద్ద కట్టు కట్టారు. ఆ తర్వాత చార్మి.. ‘థాంక్స్ అమైరా దస్తర్.. ఫర్ దిస్ బ్యూటిఫుల్ గిఫ్ట్.
 
 యు రియల్లీ బ్రోక్ ఏ లెగ్’ అంటూ గాయమైన కాలి ఫొటోలను ట్వీట్ చేశారు. ఇది చదివిన చార్మి అభిమానులు ‘అసలు కాలికి ఏమైంది?’, ‘అమైరా దస్తర్ (‘అనేకుడు’ హీరోయిన్) ఏం చేసింది?’ అని కంగారుపడ్డారు. అసలేం జరిగిందో తెలుసుకోవాలని చార్మీకి ‘సాక్షి’ ఫోన్ చేస్తే, ‘హలో’ అని స్వీట్‌గా పలకరించారామె. ‘కాలికి గాయమైందని ట్వీట్ చేశారు. చిన్న గాయమే అనుకుంటున్నాం. ఎలా ఉన్నారు?’ అని ప్రశ్నించగా అసలు విషయం చెప్పారు.

 
 ‘‘ఐయామ్ ఫైన్ అండి. శుక్రవారం రాత్రి కింద పడ్డాను. ఐస్ పెట్టి, మూవ్ రాశాను. హ్యాపీగా పడుకున్నాను. మార్నింగ్ చూస్తే అరికాలి నుంచి మోకాలి వరకూ వాచింది. డాక్టర్ వద్దకు వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. అసలు నడవలేకపోతున్నాను. కానీ, ఇంపార్టెంట్ వర్క్ ఉంది. బయటకు రాక తప్పలేదు’’ అని చార్మి అన్నారు.
 
 ఇంతకీ మీ ఈ పరిస్థితికి అమైరానే కారణమా? ఒకవేళ అదే నిజమైతే పడేసినవాళ్లకు ఎవరైనా థ్యాంక్స్ చెబుతారా? అని చార్మీని అడిగితే... ‘‘అమైరా నాకు మంచి ఫ్రెండ్. ఆమె ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేస్తోంది. మనది హైదరాబాద్, తనది ముంబై. సరదాగా సిటీ చూపిద్దామని బయటకు తీసుకువెళ్లాను. సిటీ అంతా తిరిగాక,తన రూమ్‌కి వెళ్లాను. కుర్చీలో కుర్చోగానే స్లిప్ అయింది. నేను వెనక్కి పడుతుంటే అమైరా నా చెయి పట్టుకుని ముందుకు లాగింది. దాంతో ఇద్దరం కలసి పడ్డాం. శనివారం ఉదయమే అమైరా ముంబయ్ వెళ్లింది. అందుకే, వెళ్తూ వెళ్తూ నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావ్! అని సరదాగా ట్వీట్ చేశా’’ అని చెప్పారు.
 
 మరో వారం రోజుల్లో అమైరా హైదరాబాద్ వస్తారట. ఈలోపు గాయం నయమైతే సరి. లేదంటే అమైరా పని చెప్తానంటున్నారు చార్మి. ‘మీరు తనను కింద పడేస్తారా.. ఏంటి?’ అనడిగితే.. ‘‘ఏదో సరదాకి అన్నాను కానీ, అమైరాని ఏమీ చేయనండి. తనకేమైనా అయితే షూటింగ్ డిస్ట్రబ్ అవుతుంది. నిర్మాతపై భారం పడుతుంది. అది నాకిష్టం లేదు’’ అని తనలో మంచితనాన్ని చార్మి చాటుకున్నారు.
 
 ఇన్ని చెప్పారు కదా... ఏదో కొత్త సినిమా కోసం ఫిజిక్‌ని మార్చుకుంటున్నారట.. ఆ సినిమా డీటైల్స్ చెప్పేస్తే మీ ఫ్యాన్స్ ఆనందిస్తారు కదా? అనడిగితే... ఇప్పుడు కాదు. త్వరలోనే ఆ తీపి కబురు చెప్తా అంటూ స్వీట్‌గా దాటేసారు చార్మి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement