‘ఛల్‌ మోహన్‌ రంగ’ మూవీ రివ్యూ

Chal Mohan Ranga Movie Review In Telugu - Sakshi

టైటిల్ : ఛల్‌ మోహన్‌ రంగ
జానర్ : రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : నితిన్‌, మేఘ ఆకాష్‌, లిజి, నరేష్‌, ప్రగతి, నర్రా శ్రీను, మదు నందన్‌
సంగీతం : తమన్‌ ఎస్‌
కథ : త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
దర్శకత్వం : కృష్ణ చైతన్య
నిర్మాత : పవన్ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సుధాకర్‌ రెడ్డి

హీరోగా మంచి ఫాలోయింగ్ సాధించినా.. వరుస విజయాలు సాధించటంలో ఫెయిల్ అవుతున్నాడు యంగ్ హీరో నితిన్‌. అ..ఆ లాంటి బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ తరువాత లై సినిమాతో నిరాశపరిచిన ఈ యంగ్ హీరో కృష్ణ చైతన‍్య దర్శకత్వంలో ఛల్‌ మోహన్‌ రంగ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంతేకాదు ఈ సినిమాను నితిన్‌ అభిమాన హీరో పవన్‌ కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి నిర్మించటం విశేషం. త్రివిక్రమ్ స్వయంగా కథ అందించిన ఈ సినిమా నితిన్‌ కెరీర్‌ను తిరిగి గాడిలో పెట్టిందా..? పవన్‌, త్రివిక్రమ్‌లు నిర్మాతలుగా మారి తెరకెక్కించిన ఈ సినిమా విజయం సాధించిందా..?

కథ :
మోహన్‌ రంగ (నితిన్‌) ఓ మధ్య తరగతి కుర్రాడు. చిన్నతనంలో తనకు పరిచయం అయిన అమ్మాయి అమెరికా వెళ్లిందని తెలుసుకొని ఎలాగైన అమెరికా వెళ్లాలని ఆ వయసులోనే నిర్ణయించుకుంటాడు. తరువాత అమ్మాయి విషయం మర్చిపోయినా అమెరికా ఆశతోనే పెరిగి పెద్దవాడవుతాడు. మూడుసార్లు వీసా రిజెక్ట్ కావటంతో ఇండియాలో చనిపోయిన ఓ పెద్దావిడ శవాన్ని అమెరికా తీసుకెళ్లే కారణం చూపించి వీసా సంపాదిస్తాడు. అమెరికా వెళ్లిన మోహన్‌ రంగ ముందు కాస్త ఇబ్బంది పడినా ఫైనల్‌ గా ఓ మంచి జాబ్‌ సాధిస్తాడు. ఈ ప్రయత్నాల్లోనే మేఘ సుబ్రమణ్యం (మేఘ ఆకాష్‌) అనే అమ్మాయితో రంగకు పరిచయం అవుతుంది. (సాక్షి రివ్యూస్‌) తల్లి చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవటం ఇష్టం లేని మేఘ.. రంగ వ్యక్తిత్వం నచ్చి అతనితో ప్రేమలో పడుతుంది. రంగ కూడా మేఘను ఇష్టపడతాడు. కానీ ఇద్దరి మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు వేరు కావటంతో ప్రేమ గురించి ఒకరితో ఒకరు చెప్పుకోకుండానే దూరమవుతారు. మేఘ తల్లితో పాటు ఇండియా వచ్చేస్తోంది. రంగ కూడా మేఘను మర్చిపోవాలని ప్రయత్నిస్తుంటాడు. కానీ కొంత కాలం తరువాత మేఘను ఒక్కసారి కలవాలని ఇండియాకు వస్తాడు మోహన్‌ రంగ. రంగ వచ్చే సరికి మేఘ ఏ పరిస్థితుల్లో ఉంది..? రంగ తన ప్రేమను మేఘకు చెప్పాడా..? వాళ్లిద్దరు ఒక్కటయ్యారా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
సినిమా సినిమాకు నటుడిగా ఎదుగుతున్న నితిన్‌ ఈ సినిమాలో మరింత పరిణతి కనబరిచాడు. ఎమోషనల్‌ సీన్స్‌ తో పాటు అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రేమకు దూరమైన యువకుడిగా బాధను చూపిస్తూనే కామెడీతో అలరించాడు. పవన్‌ వీరాభిమాని అయిన నితిన్‌ ఈ సినిమాలో కూడా పవన్‌ స్టైల్స్‌ను ఇమిటేట్‌ చేసే ప్రయత్నం చేశాడు. అంతేకాదు ఈ సారి మెగా స్టార్‌ చిరంజీవి అభిమానులను కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశాడు. తొలి సినిమాలో బబ్లీగా కనిపించిన మేఘకు ఈ సినిమాలో కాస్త నటనకు అవకాశం ఉన్న పాత్ర దక్కింది. తొలి భాగం అల్లరి అమ్మాయిగా కనిపించిన మేఘ, సెకండ్‌ హాఫ్‌లో ప్రేమకు దూరమైన ప్రియురాలిగానూ మెప్పించింది. (సాక్షి రివ్యూస్‌) అదే సమయంలో కామెడీతోనూ ఆకట్టుకుంది. హీరో తండ్రిగా నరేష్, తల్లిగా ప్రగతి, హీరోయిన్‌ తండ్రిగా సంజయ్ స్వరూప్‌లు రొటీన్‌ పాత్రలో కనిపించారు. చాలా కాలం తరువాత తెలుగు తెర మీద కనిపించిన సీనియర్‌ నటి లిజి హీరోయిన్‌ తల్లి పాత్రలో హుందాగా కనిపించింది. ఇతర పాత్రల్లో నర్రా శ్రీను, మదునందన్‌, శ్రీనివాస్‌, ప్రభాస్‌ శ్రీను, సత్యలు కామెడీ తో ఆకట్టుకున్నారు.

విశ్లేషణ :
రౌడీఫెలో సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణ చైతన్య... ఛల్‌ మోహన్‌ రంగతో మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ అందించిన రొటీన్‌ కథను తనదైన కథనంతో ఆసక్తికరంగా చూపించాడు. ముఖ్యంగా గేయ రచయిత అయిన కృష్ణచైతన్య డైలాగ్స్ తో సినిమా రేంజ్‌ ను పెంచాడు. కృష్ణ చైతన్య సంభాషణల్లో చాలా సార్లు త్రివిక్రమ్‌ కనిపిస్తాడు. ముఖ్యంగా ప్రాసలు, పంచ్‌ల విషయంలో త్రివిక్రమ్‌నే ఫాలో అయినట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల ప్రేమ, తరువాత మనస్పర్థలు, బ్రేకప్‌, తిరిగి కలవటం ఇది గతంలో తెలుగు తెర మీద చాలా సార్లు వచ్చిన కథే అయినా.. కథకు తీసుకున్న నేపథ్యం, సంభాషణలు ఆడియన్స్‌ను అలరిస్తాయి. (సాక్షి రివ్యూస్‌) అయితే అక్కడక్కడా కథనం నెమ్మదించటం ఇబ్బంది పెడుతుంది.  తమన్ అందించిన పాటలతో పాటు నేపథ్య సంగీతం బాగుంది. నటరాజన్ సుబ్రమణ్యం సినిమాటోగ్రఫి సినిమాకు మరో ఎసెట్. న్యూయార్క్‌ సిటీని కలర్‌ఫుల్‌ గా చూపించిన సినిమాటోగ్రాఫర్‌ ఊటి అందాలను అంతే అ‍ద్భుతంగా చూపించారు. ఎటిడింగ్‌, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కామెడీ
డైలాగ్స్‌
నితిన్‌ నటన

మైనస్ పాయింట్స్ :
రొటీన్‌ కథ

- సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top