శతాబ్ది ఉత్సవాల్లో తెలుగు పరిశ్రమకు అవమానం | 'Centenary celebrations of Indian cinema disgrace to Telugu film industry' | Sakshi
Sakshi News home page

శతాబ్ది ఉత్సవాల్లో తెలుగు పరిశ్రమకు అవమానం

Sep 25 2013 4:10 PM | Updated on Aug 28 2018 4:30 PM

భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల్లో తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర అవమానం జరిగిందని ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి మండిపడ్డారు.

ఇటీవల చెన్నైలో ముగిసిన భారతీయ సినిమా శతాబ్ది ఉత్సవాల్లో తెలుగు సినీ పరిశ్రమకు తీవ్ర అవమానం జరిగిందని ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి మండిపడ్డారు. అసలు సీనియర్లెవరినీ ఈ ఉత్సవానికి పిలవలేదని, వెళ్లినవారికి కూడా తగిన గౌరవం ఇవ్వలేదని ఆయన అన్నారు. దర్శక నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి కార్యక్రమం మధ్యలోనే బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సంబరాలు మంగళవారంతో ముగిశాయి. సోమవారం నాడు భారతీయ సినీ ప్రముఖుల్లోని 41 మందిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సత్కరించారు. చెన్నైకి చెందిన పరిశ్రమ సీనియర్లలో చాలామందిని కనీసం ఆహ్వానించలేదని, వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్, భువనచంద్ర లాంటివారిని కూడా పిలవలేదని మురారి చెప్పారు. తనను పిలుస్తారని చెప్పినా, ఎవరూ కనీసం ఫోన్ కూడా చేయకపోవడంతో వెళ్లకూడదని నిర్ణయించుకున్నానన్నారు. ఎవరినైనా సత్కరించాలనుకుంటే వారికి ముందుగా చెప్పాలని, చిట్టచివరి నిమిషంలో వచ్చి అవార్డు తీసుకోమని చెబితే కుదరదని అన్నారు.

అసలు వాళ్లకు కనీస ప్లానింగ్ కూడా లేదని మండిపడ్డారు. నాలుగు రోజులకు కలిపి ఒక పాస్ ఇచ్చి ఉండాల్సిందని, అలా కాకుండా ప్రతిరోజూ పాస్ కోసం గుమ్మం దగ్గర కళాకారులు ఎదురు చూపులు చూడాల్సి వచ్చిందని అన్నారు. కమిటీ వద్ద శాలువాలు, మెమొంటోలు అయిపోవడంతో తీసుకున్నవాళ్లు మళ్లీ వాటిని తిరిగి ఇవ్వాల్సి వచ్చిందని తెలిసినట్లు కూడా మురారి చెప్పారు. సీనియర్ నటి కవిత, నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్. నారాయణమూర్తి లాంటి వాళ్లు కూడా ఇలాగే అభిప్రాయపడ్డారు. తాను 150కి పైగా చిత్రాల్లో నటించానని, అగ్రహీరోలు అందరి సరసన హీరోయిన్గా చేశానని, అలాంటి తనను కనీసం పిలవను కూడా పిలవలేదని కవిత అయితే కంటనీరు పెట్టారు.

వందేళ్ల సినిమా సంబరాలంటే కళామతల్లికి ధన్యవాదాలు చెబుతారనుకున్నానని, తీరా వేదికమీద డాన్సులు, డ్రామాలు వేశారని, సినీ రంగాన్ని గౌరవించేది ఇలాగేనా అని నారాయణమూర్తి ఆవేశంగా ప్రశ్నించారు. అక్కడ కనీసం నిలబడాలని కూడా అనిపించలేదని, దాంతో తాను సగంలోనే తిరిగి వచ్చేశానని ఆయన చెప్పారు. మహేష్ బాబు, ప్రభాస్, మోహన్ బాబు, దాసరి నారాయణరావు.. ఇలా చాలామంది ప్రముఖులు అసలీ ఉత్సవాలకు హాజరు కాలేదు. అయితే, ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు చిన్నచిన్న పొరపాట్లు తప్పవని నిర్మాత, దక్షిణ భారత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ చిల్లర కళ్యాణ్ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement