‘బ్రోచేవారెవరురా’ మూవీ రివ్యూ

Brochevarevarura Telugu Movie Review - Sakshi

టైటిల్‌ : బ్రోచేవారెవరురా 
నటీనటులు : శ్రీ విష్ణు, నివేదా థామస్‌, సత్యదేవ్‌, నివేథా పేతురాజ్‌, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు
సంగీతం: వివేక్‌సాగర్‌
నిర్మాత : విజ‌య్ కుమార్ మ‌న్యం
దర్శకత్వం : వివేక్‌ ఆత్రేయ

మెంటల్‌ మదిలో చిత్రంలో ఆకట్టుకున్న వివేక్‌ ఆత్రేయ.. మొదటి ప్రయత్నంలోనే మెప్పించాడు. విభిన్న కథనంతో, తనదైన శైలితో తెరకెక్కించిన ప్రేమ కథను తెరపై అందంగా చూపించాడు. మొదటి ప్రయత్నంలో సున్నితమైన భావోద్వేగాలతో కూడిన కథ, కథనంతో ప్రయోగం చేయగా.. రెండో సారి అలాంటి కథాకథనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఓ అమ్మాయి ఇంట్లో, సమాజంలో పడే కష్టాలు, ఎదురయ్యే బాధలను కథగా మలుచుకుని చేసిన ప్రయత్నమే ‘బ్రోచేవారెవరురా’. మరి ఈసారి వివేక్‌ ప్రయత్నం ఫలించిందా? ఆయనకు మరో విజయం లభించిందా? తెలియాంటే.. కథేంటో ఓసారి చూద్దాం.

కథ
ఓ అమ్మాయి తన ఇష్టాలను, కష్టాలను తల్లిదండ్రులతో చెప్పుకోవాలనుకుంటుంది. అమ్మాయి పడే కష్టాలను, ఆమె ఇష్టాలను, సమాజంలో ఆమెకు ఎదురయ్యే వేదింపులను నిర్భయంగా కన్నవారితో చెప్పుకునే స్వేచ్చను ఇవ్వాలి. అలా కాకుండా తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా మాట్లాడలేనప్పుడు.. స్నేహితులతోనే, ఇంకెవరితోనో చెప్పుకుంటారు. తండ్రి నిరాదరణకు గురైన ఓ అమ్మాయి.. ఇంటిని కాదనకుని బయటకు వెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేదే ఈ కథ. దీంట్లో మిత్ర(నివేదా థామస్‌), రాహుల్‌ ( శ్రీ విష్ణు), విశాల్‌ (సత్యదేవ్‌),  షాలిని (నివేథా పేతురాజ్‌) పాత్రలకు ఉన్న సంబంధమేంటనేది థియేటర్లో చూడాలి.

నటీనటులు:
మిత్ర పాత్రలో నివేదా థామస్‌ అద్భుతంగా నటించింది. తండ్రి ప్రేమకు దూరమైన మిత్ర క్యారెక్టర్‌లో నివేదా నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. లుక్స్‌ పరంగానూ నివేదా ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అల్లరి చిల్లరగా తిరిగే రాహుల్‌ పాత్రలో శ్రీ విష్ణు మెప్పించాడు. తనకు అలవాటైన నటనతో రాహుల్‌ పాత్రలో ఈజీగా జీవించేశాడు. సినీ హీరోయిన్‌ షాలినీగా నివేధా పేతురాజ్‌, డైరెక్షన్‌ కోసం ప్రయత్నించే విశాల్‌గా సత్యదేవ్‌ బాగానే నటించారు. శ్రీ విష్ణు స్నేహితులుగా రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి గుర్తుండే పాత్రలో నటించారు. మిగతా నటీనటులంతా తమ పరిధి మేరకు మెప్పించారు.

విశ్లేషణ
ఓ చిన్న పాయింట్‌ను తీసుకున్న వివేక్‌ ఆత్రేయ.. తను అల్లిన కథ, కథనాన్ని పేర్చిన విధానం ఆకట్టుకుంటుంది. చిత్రంలో జరిగే ప్రతీ సన్నివేశానికి.. మళ్లీ ఎక్కడో లింక్‌ చేసి రాసిన కథనానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. మిత్ర పాత్రలో అమ్మాయి పడే కష్టాలను చూపిస్తూనే.. తండ్రి అనే వాడు ఎలా ఉండకూడదో చూపించాడు. ప్రేక్షకులకు ఏదో మెసెజ్‌ ఇస్తున్నట్లు కాకుండా.. కథనంలో భాగంగా తన మాటలతోనే ప్రేక్షకుడిని అర్థమయ్యేట్లు చెప్పాడు.

ఓ వైపు నవ్విస్తూనే మరోవైపు ఆలోచించేలా చేశాడు. కథనం స్లోగా నడస్తున్నా.. ఎంటర్‌టైన్‌మెంట్‌ను మిస్‌ చేయకుండా.. తను అనుకున్న కథను, తను చెప్పదల్చుకున్న పాయింట్‌ను ప్రేక్షకులకు విసుగు రాకుండా చెప్పాడు. థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడిని పడిపడి నవ్వేలా చేసిన వివేక్‌.. కొంచెంకొంచెంగా అసలు పాయింట్‌ను చెబుతూ ఉంటాడు.  చివరకు ఓ అమ్మాయికి తల్లిదండ్రులు, ఇళ్లే సురక్షితమని ముగించేస్తాడు. ఈ కథలో తిప్పిన ప్రతీ మలుపు ఆసక్తికరంగా ఉండటం, ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌ను ఎక్కడా వదలకపోవడంలోనే వివేక్‌ పనితనం అర్థమవుతోంది. వివేక్‌సాగర్‌ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం బాగుంది. ఎక్కడా కూడా పాటలు స్పీడ్‌ బ్రేకుల్లా అనిపించవు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ విభాగం సినిమా విజయవంతం కావడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌
నటీనటులు
కథ
దర్శకత్వం

మైనస్‌పాయింట్స్‌
స్లో నెరేషన్‌

బండ కళ్యాణ్‌,సాక్షి వెబ్‌ డెస్క్‌.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top