బిగ్‌బాస్‌ తర్వాత కనిపించకుండా పోయారు

Bigg Boss 3 Telugu: Bigg Boss Winners Identity Being Absconded - Sakshi

వరల్డ్‌ బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌బాస్‌.. పేరు ఘనం ఫలితం శూన్యం అన్న చందంగా తయారైంది. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్ల ఎంపిక కోసం బిగ్‌బాస్‌ యాజమాన్యం తీవ్ర కసరత్తులే చేస్తుంది. జనాల్లో కొద్దో గొప్పో పేరు సంపాదించుకున్న వారినే షోకు ఎంపిక చేసుకుంటుంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో నియమనిబంధనలను అతిక్రమించకుండా, వందరోజులు హౌస్‌లోనే ఉండేలా బాండ్‌ రాయించుకుంటుంది. అయితే.. షో తర్వాత ఎన్నో అవకాశాలు వస్తాయని భావించిన కంటెస్టెంట్ల గంపెడాశలపై బిగ్‌బాస్‌ నీళ్లు చల్లుతుందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. షో నిర్వహించే వారికి మంచి టీఆర్పీ రేటింగ్‌తో భారీగానే గిట్టుబాటు అవుతుంది.. కానీ అందులో పాల్గొన్నవారికి మాత్రం అంతకుమునుపు ఉన్న పేరు కూడా ఊడిపోతుందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

ఆ హడావుడి ఏమైంది?
అప్పుడప్పుడే వెలుగులోకి వస్తున్న తారలు.. బిగ్‌బాస్‌ షో తర్వాత చేతిలో ఏ ప్రాజెక్టు లేక ఈగలు తోలుకుంటున్నారు. జనాలు వారి పేర్లను కూడా మర్చిపోతున్నారంటే వారి పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. బిగ్‌బాస్‌ 1 విజేతగా నిలిచిన శివబాలాజీ రూ.50 లక్షల ప్రైజ్‌మనీ గెలుచుకున్నాడు. బిగ్‌బాస్‌ కిరీటం గెలిచాడన్న మాటే గానీ అది అతని జీవితానికి ఎంతమాత్రం ఉపయోగపడలేదు. అంతకుముందు చకచకా సినిమాలు చేసుకుంటూ పోయిన శివబాలాజీ బిగ్‌బాస్‌ తర్వాత అడపాదడపా సినిమాల్లో మాత్రమే కనిపించాడు. అంతదాకా ఎందుకు? అందులో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్లు పత్తాలేకుండా పోయారు. ఏ ఒకరిద్దరికో తప్పితే ఎవరికీ పాపులారిటీ రాలేదు. ఇక రెండో సీజన్‌లో కౌశల్‌ ఆర్మీ చేసిన సందడి అంతా ఇంతా కాదు. బిగ్‌బాస్‌ విన్నర్‌గా కౌశల్‌ను ప్రకటించాలంటూ ఆర్మీల పేరిట ర్యాలీలు చేస్తూ నానాహడావుడి చేశారు.

కప్పు కొట్టాక భవిష్యత్తు ఏంటి?
బిగ్‌బాస్‌ షో తర్వాత కౌశల్‌ సినిమాల్లోకి రానున్నాడన్న వార్తలు కూడా వినిపించాయి. కానీ టైటిల్‌ గెలిచిన తర్వాత కౌశల్‌ పరిస్థితి తలకిందులైంది. కేవలం టీవీ ఇంటర్వ్యూలకు, షాప్ ఓపెనింగ్‌లకు మాత్రమే అతను పరిమితమైపోయాడు. మెల్లిమెల్లిగా మీడియా కూడా ఆయన్ను పట్టించుకోవడం మానేసింది. మొత్తానికి గత రెండు సీజన్ల విజేతలకు ప్రైజ్‌మనీ తప్పితే అంతకుమించి ఒరిగిందేమీ లేదు. బిగ్‌బాస్‌ షో తర్వాత వాళ్లిప్పుడు కనిపించకుండా పోయారని నెటిజన్లు అంటున్నారు. ఇప్పుడు టైటిల్‌ కోసం నువ్వా నేనా అని పోరాడుతున్న శ్రీముఖి, రాహుల్‌లో ఎవరు గెలిచినా.. తర్వాత వారి పరిస్థితి కూడా ఇంతేనా అని ప్రేక్షకులు పరిపరివిధాలా ఆలోచిస్తున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top