స్టార్‌డమ్‌ ఏబీసీడీలు కూడా శిరీష్‌ స్టార్ట్‌ చేయాలి

Allu sirish Abcd movie pre-release event updates - Sakshi

‘‘ఏబీసీడీ’ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే నా ‘పిల్ల జమీందార్‌’ సినిమా గుర్తుకు వస్తోంది. నా సినిమాను మించి ‘ఏబీసీడీ’ హిట్‌ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు హీరో నాని. అల్లు శిరీష్, రుక్సార్‌ థిల్లాన్‌ జంటగా సంజీవ్‌ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏబీసీడీ’. ‘అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి’ అన్నది ఉపశీర్షిక. డి.సురేశ్‌బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై ‘మధుర’ శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాని మాట్లాడుతూ– ‘‘నేను యాక్టింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నప్పుడు శిరీష్‌ను అప్పుడప్పుడు కలిశాను. అప్పుడు తను కాస్త లావుగా, బొద్దుగా ఉండేవాడు. సినిమా బిజినెస్‌ గురించి చాలా మంచి ఆర్టికల్స్‌ రాసేవాడు. ప్రొడక్షన్‌లో అరవింద్‌గారికి మంచి సక్సెసర్‌ దొరికాడని అనుకున్నాను. కట్‌ చేస్తే తను యాక్టర్‌ అయిపోయాడు. తన కెరీర్‌కు సంబంధించి ఏబీసీడీలు ఎప్పుడో స్టార్ట్‌ చేసిన శిరీష్, తన స్టార్‌డమ్‌కు సంబంధించిన ఏబీసీడీలు ఈ సినిమాతో స్టార్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. అల్లు శిరీష్‌ మాట్లాడుతూ–‘‘రెండేళ్ల కిందట నా కజిన్‌ రామ్‌చరణ్‌ ‘ఏబీసీడీ’ మలయాళ సినిమా సీడీ నాకు ఇచ్చి, ఈ క్యారెక్టర్‌ నీకు కరెక్ట్‌గా సూట్‌ అవుతుందని చెప్పాడు. సినిమా చూస్తే చాలా బాగుందనిపించింది. ఈ సినిమాలో హీరో డబ్బు విలువ తెలియకుండా పాడైపోయాడని భావించిన తండ్రి అతన్ని బాగు చేసుకోవడానికి ఏం చేశాడనేదే కథ.

బన్నీకి, రామ్‌చరణ్‌కు 21 ఏళ్లు వచ్చినప్పుడు కారు కొనిచ్చారు. నాకు 21 ఏళ్లు వచ్చాక మంచి స్పోర్ట్స్‌ కారు కొనివ్వమని నాన్నను అడగ్గానే ‘చెప్పుచ్చుకుని కొడతాను.. నీ వయసువాళ్లు పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో ట్రావెల్‌ చేస్తున్నారు. నీకు కారు కొనివ్వడమే లగ్జరీ. అలాంటిది స్పోర్ట్స్‌ కారు కొనివ్వమని అడుగుతున్నావ్‌’ అని కొనివ్వలేదు. నీ కారుకి బడ్జెట్‌ ఇంత అనుకుంటున్నాను అంటే, ఆ రోజు నేను కోపానికి పోయి ‘నాకు వద్దులే, నా సొంత డబ్బులతోనే కొనుక్కుంటాను’ అన్నాను. అయితే ఆ కారు కొనడానికి నాకు మూడేళ్లు పట్టింది. అప్పుడు నాన్న చేసిన పనివల్ల డబ్బు విలువ తెలిసి వచ్చింది. కాబట్టి ఈ సినిమాను మా నాన్నకు డెడికేట్‌ చేస్తున్నాను. ఈ చిత్రంలో నా తండ్రి పాత్రలో నాగబాబుగారిని తప్ప మరెవరినీ ఊహించుకోలేను’’ అన్నారు.  ‘‘మధుర’ శ్రీధర్‌ నాకు మంచి స్నేహితుడు. అతనితో కొంతకాలంగా ట్రావెల్‌ చేస్తున్నాను. అల్లు అరవింద్‌గారు కూడా నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాతో శిరీష్‌కు పెద్ద విజయం రావాలి’’ అన్నారు డి.సురేశ్‌బాబు. ‘‘అందరికీ థాంక్స్‌’’ అని ‘మధుర’ శ్రీధర్‌ రెడ్డి అన్నారు. ‘‘మధుర శ్రీధర్‌’తో ట్రావెల్‌ చేసేటప్పుడు మా నాన్నతో ఉన్నట్లే అనిపించింది. అల్లు శిరీష్‌ సినిమాలోనే కాదు.. రియల్‌ లైఫ్‌ హీరో కూడా. కొత్త డైరెక్టర్‌ని పరిచయం చేయాలనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్‌. శిరీష్‌ నాకు లైఫ్‌ లాంగ్‌ హీరోగా ఉంటారు’’ అన్నారు సంజీవ్‌ రెడ్డి. రుక్సార్‌ థిల్లాన్, మ్యూజిక్‌ డైరెక్టర్‌ జుడా సాందీ, డైరెక్టర్‌ వేణు ఊడుగుల తదితరులు పాల్గొన్నారు.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top