తెలుగు సినీ అభిమానులకు మరో విషాదకర వార్త. యువ నటుడు ఉదయ్ కిరణ్ అకాల మరణాన్ని జీర్ణించుకోకముందే మరో ధ్రువతార రాలిపోయింది.
అభిమానుల సందర్శనార్థం అక్కినేని పార్థివదేహాన్ని అన్నపూర్ణ స్డూడియోకు తరలించారు. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. అక్కినేని నాగేశ్వరరావు బుధవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు.
ఏఎన్ఆర్ మరణించిన సమయంలో ఆయన కుమారుడు ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున చెంతనే ఉన్నారు. గత కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్న నాగేశ్వరరావును మంగళవారం అర్ధరాత్రి కేర్ ఆస్పత్రికి తరలించారు. ఏడు దశాబ్దాలకుపైగా అశేష తెలుగుప్రజలను అలరించిన అక్కినేని శాశ్వత వీడ్కోలు తీసుకుని తిరిగిరాని లోకాలకు పోయారు. అభిమానుల కోసం ఆయన భౌతికకాయాన్ని అన్నపూర్ణ స్డూడియోలో ఉంచనున్నట్టు నాగార్జున తెలిపారు.
నాగేశ్వరరావుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఏఎన్ఆర్గా తెలుగుప్రజలకు సుపరిచితులైన నాగేశ్వరావు 1923 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా వెంకటరాఘవ పురంలో వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించారు. 1944న సినీ రంగ ప్రవేశం చేశారు. ఏఎన్‌ఆర్ మొదటి చిత్రం ధర్మపత్ని. తాజా చిత్రం మనంతో కలిపి ఇప్పటి వరకు 256 చిత్రాల్లో నటించారు. పద్మవిభూషణ్, 1988లో పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కె, ఎన్జీఆర్ జాతీయ అవార్డులను స్వీకరించారు. నవరాత్రి సినిమాలో 9 పాత్రలు చేసిన ఏకైక తెలుగు నటుడు అక్కినేని కావడం విశేషం. తెలుగులో డబుల్ రోల్ పోషించిన మొట్టమొదటి నటుడు కూడా నాగేశ్వరరావే.